Bangalore: ఇస్రోతో కలిసి పని చేసేందుకు 100 స్టార్టప్‌లు రెడీ - ఛైర్మన్ సోమనాథ్
ISRO Chief Somanath: ఇస్రోతో కలిసి పని చేసేందుకు 100 అంకుర సంస్థలు రిజిస్టర్ చేసుకున్నాయని చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
ISRO Chief Somanath in Bangalore:
స్పేస్‌టెక్ సెక్టార్‌దే ఫ్యూచర్...
భారత్‌లోని 100 అంకుర సంస్థలు ఇస్రోతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. ఇప్పటికే ఈ కంపెనీలు ఇస్రోతో కలిసి పని చేసేందుకు రిజిస్టర్ చేసుకున్నాయని చెప్పారు. బెంగళూరు టెక్ సమ్మిట్ 2022 సదస్సుకి హాజరైన ఆయన మరి కొన్ని వివరాలు పంచుకున్నారు. తమతో పని చేసేందుకు రెడీగా ఉన్న సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని స్పష్టం చేశారు. ఓ ప్రాజెక్ట్‌ని మొదలు పెట్టినప్పటి నుంచి పూర్తి చేసేంత వరకూ అవసరమైన స్పేస్ టెక్నాలజీని అందించేందుకు ఆ కంపెనీలు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. భారత్‌లో స్పేస్‌టెక్ సెక్టార్‌లోకి అడుగు పెడుతున్న సంస్థలు భవిష్యత్‌లో కీలక పాత్ర పోషిస్తాయన్న సోమనాథ్...ఇస్రో ఆయా కంపెనీలకు అన్ని విధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. 100 కంపెనీల్లో దాదాపు 10 సంస్థలు..ఇప్పటికే కొన్ని శాటిలైట్స్, రాకెట్స్ తయారు చేశాయని వివరించారు. మరి కొన్ని నెలల్లోనే చంద్రయాణ్-3 (Chandrayaan-3) మిషన్‌ను ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఇందుకోసం ఇస్రో..నాసాతో కలిసి పని చేస్తుందని తెలిపారు. భారత్‌లో అంతరిక్ష రంగం ఇంకా పురోగతి సాధించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో ఈ సేవల్ని ఎలా విస్తృతం చేయాలో ఆలోచిస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. కొత్త ప్రొపల్షన్ విధానాలు అనుసరించాలని సూచించారు. గ్రీన్ ప్రొపెలంట్,ఎలక్ట్రిక్ ప్రొపెలంట్, న్యూక్లియర్ ప్రొపెలంట్ లాంటి సాంకేతికతలను ఇప్పటికే ఇస్రోలో కొన్ని ప్రాజెక్ట్‌ల కోసం వినియోగి స్తున్నామని పేర్కొన్నారు సోమనాథ్.
అంతా దేశీయమే..
"ప్రస్తుతం భారత్‌లో చాలా కంపెనీలు మ్యానుఫాక్చరింగ్ సెక్టార్‌లోకి అడుగు పెడుతున్నాయి. ఈ కారణంగా దేశీయంగా మనం ఎన్నో పరికరాలు తయారు చేసుకోటానికి వీలవుతోంది. వీటిలో కొన్ని సంస్థలు స్పేస్ సెక్టార్‌లోనూ తమ సేవల్ని విస్తృతం చేసుకుంటుండటం సంతోషకరం. దేశీయంగా తయారవుతున్న రాకెట్‌లను ఆపరేట్ చేసేందుకు వినియోగిస్తున్న కంప్యూటర్‌లనూ మనం ఇక్కడే తయారు చేసుకుంటున్నాం" అని వివరించారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్. స్మార్ట్ సిటీ లాంటి ప్రాజెక్ట్‌ల్లోనూ ఇస్రో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.
ప్రారంభ్ లాంఛ్..
దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ ప్రైవేట్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇప్పటి వరకూ భారత్ కి సంబంధించిన ప్రయోగాలనే ఇస్రో చేపట్టింది. పలు ప్రైవేటు ఉపగ్రహాలను నింగిలోకి పంపినా, రాకెట్ మాత్రం ఇస్రోనే తయారు చేసేది. కానీ ఈసారి రాకెట్ కూడా ప్రైవేటుదే. అంటే పూర్తిగా ఇది ప్రైవేట్ ప్రయోగం. దీనికి కేవలం ఇస్రో లాంఛింగ్ ప్యాడ్ ని మాత్రమే వినియోగించారు. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు, స్టార్టప్‌లకు అవకాశాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఇస్రో. దీనిలో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ ఈ రాకెట్‌ను రూపొందించింది. ఇస్రో, ఇన్ స్పేస్ సహకారంతో రెండేళ్ల కాల వ్యవధిలో దీన్ని సిద్ధం చేశారు. దీనికి విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. విక్రమ్-ఎస్1 అనే పేరుతో ఈ ప్రయోగం జరిగింది. తొలిసారిగా పంపిన ఈ రాకెట్ పేరు ప్రారంభ్.
Also Read: Dhruva Space: అంతరిక్ష రంగంలో "ధ్రువ స్పేస్" సంచలనం, దూసుకుపోతున్న హైదరాబాద్ కంపెనీ