Israel Hamas War: హమాస్ మిలిటరీ చీఫ్‌ని మట్టుబెట్టిన ఇజ్రాయేల్, అధికారికంగా ప్రకటించిన సైన్యం
Israel Hamas: హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ డీఫ్‌ని మట్టుబెట్టినట్టు ఇజ్రాయేల్ సైన్యం ప్రకటించింది. అక్టోబర్ 7 వ తేదీన ఇజ్రాయేల్‌పై దాడుల వెనక మాస్టర్‌మైండ్ ఇతనే అని వెల్లడించింది.
Israel Gaza War: గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయేల్‌పై హమాస్ మిలటరీ దాడులు చేసింది. అప్పటి నుంచి ఇజ్రాయేల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే హమాస్ కీలక నేత ఇస్మాయిల్ హనియేని మట్టుబెట్టిన ఇజ్రాయేల్ ఇప్పుడు కీలక ప్రకటన చేసింది. హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ డీఫ్ హతమైనట్టు ప్రకటించింది. గాజాలో ఖాన్ యూనిస్ ప్రాంతంలో గత నెల చేసిన దాడుల్లో డీఫ్ మృతి చెందినట్టు వెల్లడించింది. హనియే హతమైన మరుసటి రోజే ఈ ప్రకటన చేసింది ఇజ్రాయేల్ సైన్యం. జులై 14వ తేదీన ఇజ్రాయేల్ ఆర్మీ ఖాన్ యూనిస్ ప్రాంతంలో భీకర దాడులు చేసింది. ఫైటర్ జెట్స్‌తో గగనతలం నుంచి బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లోని హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ డీఫ్ మృతి చెందాడని, ఇదే విషయాన్ని నిఘా వర్గాలు వెల్లడించని మిలిటరీ స్పష్టం చేసింది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయేల్‌పై దాడులకు ప్లాన్ చేసిన మాస్టర్‌మైండ్ ఈ మహమ్మద్ డీఫ్. ఆ దాడిలో దాదాపు 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే..డీఫ్ హతమయ్యాడన్న వార్తల్ని హమాస్ కొట్టి పారేస్తోంది. ఈ దాడిలో 90 మందికి పైగా మృతి చెందారని, కానీ వాళ్ల మహమ్మద్ డీఫ్ లేరని స్పష్టం చేసింది. డీఫ్ ఉన్న ఇంటిపైనే బాంబులతో దాడి చేసిన చంపినట్టు ఇజ్రాయేల్ చెబుతోంది.
We can now confirm: Mohammed Deif was eliminated.
— Israel Defense Forces (@IDF) August 1, 2024
దాదాపు మూడు దశాబ్దాలుగా మహమ్మద్ డీఫ్ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. అమెరికా కూడా 2015లో డీఫ్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇజ్రాయేల్‌కి వ్యతిరేకంగా ఎన్నో ఏళ్లుగా దాడులు చేస్తూనే ఉన్నట్టు మిలిటరీ ప్రకటించింది. ఇజ్రాయేల్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ముందుండి నడిపించాడు మహమ్మద్ డీఫ్. అంతే కాదు. గాజా స్ట్రిప్‌లో యాక్షన్ ప్లాన్ అంతా ఇతనిదే. హమాస్ మిలిటరీలోని సీనియర్ సభ్యులకు కూడా ఆదేశాలిస్తూ యుద్ధానికి ఉసిగొల్పుతాడు. అటు ఇజ్రాయేల్ కూడా గట్టిగానే బదులిస్తోంది. ఇప్పటి వరకూ 39 వేల మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అటు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్ల అలీ ఖమేనీ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయేల్‌పై విరుచుకుపడాలని మిలిటరీకి ఆదేశాలిచ్చారు. హమాస్ లీడర్ హనియేని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని తేల్చి చెప్పారు. సెక్యూరిటీ కౌన్సిల్‌తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వెంటనే ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఇజ్రాయేల్‌పై ఇరాన్ కూడా పగతో రగిలిపోతోంది. అయితే...ఇజ్రాయేల్ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అటు అవును అని కానీ కాదు అని కానీ క్లారిటీ ఇవ్వలేదు. గాజాలో దాదాపు 10 నెలలుగా యుద్ధం జరుగుతోంది. మధ్యలో చాలా సార్లు సయోధ్యకు ప్రయత్నాలు జరిగినా అవేవీ ఫలించలేదు. బందీలను విడిపించేందుకు మాత్రం ఒప్పందాలు కుదుర్చుకున్నారు. విడతల వారీగా వాళ్లను విడిచి పెడుతున్నారు. అటు దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.