(Source: ECI/ABP News/ABP Majha)
Rupert Murdoch: ఆయనకు 93, ఆమెకు 67 - ఐదో పెళ్లి చేసుకున్న మీడియా దిగ్గజం మర్దోక్
International News: అంతర్జాతీయ మీడియా దిగ్గజం రూపర్ట్ మర్దోక్ 93 ఏళ్ల వయసులో ఐదో వివాహం చేసుకున్నారు. 67 ఏళ్ల ఎలీనా జుకోవాను ఆయన మనువాడారు. కాలిఫోర్నియాలోని ఎస్టేట్‌లో వీరి పెళ్లి శనివారం జరిగింది.
Media Tycoon Rupert Murdoch Marries For Fifth Time: అంతర్జాతీయ మీడియా దిగ్గజం, ఆస్ట్రేలియన్ - అమెరికన్ బిలియనీర్ రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch) 93 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి చేసుకున్నారు. తన కంటే వయసులో 26 ఏళ్ల చిన్నవారైన రిటైర్డ్ పరణాణుజీవ శాస్త్రవేత్త ఎలీనా జుకోవాను ఆయన మనువాడారు. కాలిఫోర్నియాలోని సొంత ఎస్టేట్‌లో శనివారం వీరి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. వీరి వివాహానికి అమెరికా ఫుట్ బాల్ టీం 'న్యూ ఇంగ్లాండ్ పేట్రియాట్స్' యజమాని రోబెర్ట్ క్రాఫ్ట్, ఆయన సతీమణి డానా బ్లూమ్‌బెర్గ్ హాజరయ్యారు. వివాహానికి సంబంధించిన ఫోటోలు బ్రిటన్ పత్రిక 'ది సన్'లో ప్రచురితమయ్యాయి. కాగా, ఈ జంట మార్చిలో తమ నిశ్చితార్థాన్ని ప్రకటించారు.
మర్దోక్ ఐదో వివాహం
మర్దోక్‌కు ఇది ఐదో వివాహం. మొదట ఆస్ట్రేలియాకు చెందిన పాట్రిషియా బుకర్‌ను 1956లో ఆయన వివాహమాడారు. అనంతరం 1960ల్లో వీరి వివాహ బంధం ముగిసిపోయింది. ఆ తర్వాత జర్నలిస్ట్ అన్నామరియా మన్‌ను వివాహం చేసుకుని 30 ఏళ్ల తర్వాత 1999లో ఆమెకు విడాకులిచ్చారు. ఆ తర్వాత వెండీ డాంగ్‌ను పెళ్లి చేసుకుని.. ఆమెకు విడాకులిచ్చిన అనంతరం 2016లో జెర్రీ హాల్‌ను నాలుగో వివాహం చేసుకున్నారు. ఆమెను పెళ్లాడిన ఆరేళ్లకు విడాకులు తీసుకున్నారు. తన రెండో భార్య అన్నా మరియా మన్ నుంచి విడిపోయిన సందర్భంలో మర్దోక్ చెల్లించిన భరణం అత్యంత ఖరీదైన వాటిల్లో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్ డాలర్ల ఆస్తి ఇచ్చినట్లు సమాచారం. మర్దోక్ తన మాజీ భార్యల్లో ఒకరైన వెన్‌డీ డెంగ్ ఇచ్చిన పార్టీలో జుకోవా ఆయనకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి వీరు డేటింగ్‌లో ఉన్నారు. రష్యాకు చెందిన జుకోవా అమెరికాకు వలస వచ్చారు. గతంలో ఆమెకు మాస్కో ఆయిల్ బిలియనీర్ అలెగ్జాండర్‌తో వివాహమైంది.
మర్దోక్ 1950ల్లో మీడియా కెరీర్‌ను ప్రారంభించి న్యూస్ ఆఫ్ ది వరల్డ్, ది సన్ వార్తా పత్రికలను ప్రారంభించారు. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడి న్యూయార్క్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి పబ్లికేషన్స్ కొనుగోలు చేశారు. 1996లో ఫాక్య్ న్యూస్ ప్రారంభించారు. ఆయన తన కెరీర్‌లో అనేక వివాదాలు ఎదుర్కొన్నారు. 2011లో ఫోన్ హ్యాకింగ్ స్కామ్ కారణంగా న్యూస్ ఆఫ్ ది వరల్డ్ పత్రికను మూసేయాల్సి వచ్చింది. గతేడాది సెప్టెంబరులో తన వ్యాపారాన్ని కుమారులకు అప్పగించారు. ప్రస్తుతం తమ సంస్థలకు గౌరవ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. మర్దోక్ నికర ఆస్తుల విలువ 17.7 బిలియన్ల డాలర్లుగా ఫోర్బ్స్ 2023లో లెక్కగట్టింది