(Source: ECI/ABP News/ABP Majha)
NDA President Candidate: ఎవరీ ద్రౌపది ముర్ము? టీచర్ నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎలా? అదే జరిగితే ఓ రికార్డు
Draupadi Murmu Biography: ద్రౌపది ముర్ము గిరిజన సామాజిక వర్గానికి చెందినవారు. ఇలా షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఇదే తొలిసారి.
Draupadi Murmu Full Profile: NDA తరపున రాష్ట్రపతి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించారు. ఒడిశాకు చెందిన నాయకురాలు ద్రౌపది ముర్ము అనే మహిళను అభ్యర్థిగా బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ద్రౌపది ముర్ము గిరిజన సామాజిక వర్గానికి చెందినవారు. ఇలా షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఇదే తొలిసారి. బీజేపీ పార్లమెంటరీ కమిటీ భేటీ తర్వాత ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్మును ఎంపిక చేసినట్లుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. National Democratic Alliance లోని అన్ని పార్టీలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు నడ్డా చెప్పారు. అయితే, ఆదివాసీ మహిళ అయిన ద్రౌపది ముర్ము ఒక టీచర్ స్థాయి నుంచి రాష్ట్రపతి అభ్యర్థిత్వం వరకూ ఎదిగిన తీరు ఎంతో స్ఫూర్తి దాయకం.
NDA Presidential Candidate: ఇప్పటివరకూ రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం గిరిజన వర్గాల వారికి లభించలేదు. 64 ఏళ్ల ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్ 20న జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యాం చరణ్ ముర్ము. మర్ము దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.
భువనేశ్వర్ లోని రమాదేవి మహిళా కాలేజీ నుంచి బీఏ చదివారు. ఆ తర్వాత టీచర్ గా తన కేరీర్ ను ఆమె ప్రారంభించారు. 197-83 మధ్య ఒడిశాలోని నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా, 1994 నుంచి 97 వరకూ శ్రీ అరబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్ లో అసిస్టెంట్ టీచర్ గా పని చేశారు. 1997లో ఆమె రాజకీయ ప్రవేశం చేశారు.
1997లో బీజేపీలో చేరిక, 2015లో గవర్నర్
1997 ఏడాదిలో బీజేపీ లో చేరిన ద్రౌపది ముర్ము అదే ఏడాదిలో కౌన్సిలర్ అయ్యారు. తర్వాత 2000వ ఏడాదిలో రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ టర్మ్ లోనే ఆమెను మంత్రి పదవి వరించింది. 2000 - 02 వరకూ ఒడిశాలో రవాణా, వాణిజ్య మంత్రి అయ్యారు. బిజు జనతాదళ్ - బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఆమె పని చేశారు. 2002 నుంచి 2004 మే వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.
2004లో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. అదే సమయంలో 2002 నుంచి 2009 వరకూ మయూర్ భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2006 నుంచి 2009 వరకూ ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలిగానూ ఉన్నారు. 2010లో మళ్లీ మయూర్ భంజ్ జిల్లా అధ్యక్షురాలు అయ్యారు. మళ్లీ 2013 నుంచి 2015 వరకూ మయూర్ భంజ్ జిల్లా అధ్యక్షురాలిగా పని చేశారు. 2015లో ఝార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్ గా ఎంపికయ్యారు. ద్రౌపది ముర్ము తన భర్త, ఇద్దరు కుమారులను ఓ ప్రమాదంలో కోల్పోయారు.
25న నామినేషన్
జూన్ 25న ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే.. రాజ్యాంగబద్ధంగా దేశంలోనే అత్యున్నత పదవికి ఎన్నికయ్యే తొలి ఆదివాసీ గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర లిఖించనున్నారు.