Vegetable Prices Hike: కిలో రూ.155కి చేరిన టమాటా - కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి, క్యాబేజీ ధరలు
Vegetable Prices Hike: టమాటాతో పాటు ఇతర కూరగాయలు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. కిలో టమాటా రూ.155కు చేరగా.. ఉల్లి, క్యాబేజీ, బంగాళదుంపలు అయితే కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
Vegetable Prices Hike: గత కొంత కాలంగా టమాటా ధర రోజురోజుకూ పెరిగిపోతుంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూరగాయలు ధరలు విపరీతంగా పెరగడంతో.. సామాన్య ప్రజలు కన్నీళ్లు పెడుతున్నారు. రోజూ ఏం వండుకోవాలో తెలియకు.. కారం మెతుకులతోనే పూట గడిపేస్తున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వర్షాల కారణంగా రవాణాకు తీవ్ర అంతరాయం కల్గడంతో మెట్రో నగరాల్లో టమాటా ధరలు మరింత అధికం అయ్యాయి. కోల్ కతాలో కిలో టమాటా ధర రూ.155కు చేరగా.. ముంబయిలో రూ.58, ఢిల్లీలో రూ.110, చెన్నైలో రూ.117గా టమాటా ధరలు ఉన్నాయి. కేంద్ర వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం దేశంలో టమాటా సరాసరి ధర కిలోకు రూ.83.29గా ఉంది.
పాట్నాలో ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు
బీహార్ రాజధాని పాట్నాలో క్యాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలు కిలో రూ.60 చొప్పున లభిస్తున్నాయి. ఇదొక్కటే కాదు పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కూడా కూరగాయల ధరల విపరీతంగా పెరిగాయి. మే నెల ప్రారంభం అయినప్పటి నుంచి పాట్నాలో కూరగాయల ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. టమోటా ధర గరిష్టంగా పెరిగిన చోట ఇతర కూరగాయలు కూడా ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయి. క్యాలీ ఫ్లవర్, క్యాబేజీ నుంచి బెండకాయ వంటి కూరగాయల ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. మే నెలలో కిలో రూ.40 ఉన్న క్యాలీ ఫ్లవర్ ఇప్పుడు కిలో రూ.60కి చేరగా.. మేలో 30 రూపాయల నుంచి 40 రూపాయలు పలికిన క్యాబేజీ ప్రస్తుతం రూ.60కి పెరిగింది. బంగాళ దుంప, ఉల్లి ధరలు మే నెలలో కిలో రూ.20 ఉండగా జూలైలో కిలో రూ.30 నుంచి 35కి పెరిగాయి.
పశ్చిమ బెంగాల్‌లో కూడా పెరిగిన ధరలు
కూరగాయలతో పాటు పండ్ల ధరలు పెరుగుతున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో కూరగాయల ధరలు 30 నుంచి 35 శాతం పెరిగాయి. వారం రోజుల క్రితం కిలో రూ.150 ఉన్న పచ్చిమిర్చి ఇప్పుడు కిలో రూ.300 నుంచి 350కి చేరింది. మరోవైపు టమాట కిలో ధర రూ.130 నుంచి 150 వరకు విక్రయిస్తున్నారు.
ఒడిశాలోనూ ఇదే పరిస్థితి
ఒడిశాలో గత 15 రోజులుగా కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. టమోటాలు కిలో రూ.140 నుంచి 160 మధ్య ఉండగా, పచ్చిమిర్చి కిలో రూ.200 పలుకుతోంది. అల్లం ధర కిలో రూ.300 పలుకుతోంది.
టమాటాలు కొనడం మానేసిన ఢిల్లీ ప్రజలు..
ఢిల్లీలోని సఫాల్ స్టోర్‌లో కూడా టమాటా కిలో రూ.129 పలుకుతుండడంతో ఇక్కడి ప్రజలు ఈ కూరగాయల కొనుగోలును తగ్గించారు.
ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఏంటి?
ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో టమాటా ధర కిలో రూ.150కి చేరుకుంది. పెరుగుతున్న టమాటా ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు.. ఈ విషయంలో ఏదైనా చేయాలని, తద్వారా సామాన్య ప్రజలకు ఉపశమనం కలుగుతుందని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
టమోటా ధరల పెరుగుదలకు కారణం
మహారాష్ట్రలో పంట నష్టం జరిగింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేయడంతో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. ఈ ఏడాది సాధారణం కంటే 30 శాతం పంట దిగుబడి తక్కువగా ఉందని కోలార్ కు చెందిన రైతులు చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే టమాటా ధరలు చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. ఒకేసారి భారీగా టమాటా దిగుబడి రావడం, సాగు కూడా అధిక మొత్తంలో ఉండటంతో గతేడాది కేజీ టమాటా రూ.5కు పడిపోయింది.