ఉజ్జెయిన్ అత్యాచార కేసు నిందితుడి ఇల్లు కూల్చివేత, బుల్డోజర్తో ధ్వంసం - వీడియో
Watch Video: ఉజ్జెయిన్ మైనర్ అత్యాచార కేసులో నిందితుడి ఇంటిన బుల్డోజర్తో కూల్చివేశారు.
Watch Video:
సంచలనం సృష్టించిన ఉజ్జెయిన్ బాలిక అత్యాచార కేసులో నిందితుడు భరత్ సోని (Bharat Soni) ఇంటిని కూల్చేశారు అధికారులు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుల్డోజర్తో ఇల్లుని ధ్వంసం చేశారు. ఇది అక్రమ నిర్మాణమని, అందుకే కూల్చివేశామని అధికారులు వెల్లడించారు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చేశారన్న వాదనలు వినిపించాయి. అయితే..దీనిపైనా మున్సిపల్ కార్పొరేషన్ క్లారిటీ ఇచ్చింది. ఇది ప్రభుత్వం స్థలమని, అక్రమంగా ఇల్లు నిర్మించారని చెప్పింది. దీనికి నోటీసులతో పని లేదని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన అలజడి రేపింది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు తీవ్రంగా మండి పడ్డాయి. నడిరోడ్డుపై అత్యాచార బాధితురాలు సాయం కోసం అర్థిస్తున్న వీడియో అందరినీ షాక్‌కి గురి చేసింది.
#WATCH | Ujjain minor rape case | Municipal Corporation team demolishes the house of the accused (Bharat Soni) in Madhya Pradesh.
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 4, 2023
More details awaited. pic.twitter.com/yTIxI4PxLn
ప్రస్తుతానికి నిందితుడిని విచారిస్తున్నారు. 700 సీసీ కెమెరాల ఫుటేజ్‌నీ పరిశీలిస్తున్నారు. దాదాపు 30-35 మంది పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్లో పాల్గొంటున్నారు. నిందితుడు భరత్ సోని తండ్రి ఈ ఘటనపై స్పందించారు. తన కొడుకు చేసింది సిగ్గుమాలిన చర్య అని, తనను కలిసేందుకు ఆస్పత్రికి, పోలీసు స్టేషన్, కోర్టుకు వెళ్లనని చెప్పారు. తన కొడుకు తీవ్రమైన నేరం చేశాడని, అలాంటి వాడిని ఉరి తీసి చంపాలని డిమాండ్ చేశారు. బాధిత బాలిక కూడా తన కూతురు లాంటిదే అని ఆయన అన్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితుడు భరత్ సోని తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు భరత్ సోనిని పట్టుకున్నారు. బాధిత బాలిక ప్రస్తుతం ఇండోర్ లోని ప్రభుత్వ మహారాజా తుకోజీరావు హోల్కర్ మహిళా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దేశం మొత్తాన్ని కుదిపేసిన ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మౌనంగా ఉన్నారని, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శలు గుప్పించింది.
సెప్టెంబర్ 27 ఘటన..
సామూహిక అత్యాచారానికి గురైన 12 ఏళ్ల బాలిక రోడ్డుపై అర్ధనగ్నంగా నడుచుకుంటూ వచ్చిన దృశ్యాలు అక్కడి CC కెమెరాలో రికార్డ్ అవడం సంచలనమైంది. చాలా దారుణమైన స్థితిలో ఉన్న ఆ బాలిక రోడ్డుపై నడుచుకుంటూ ఇంటింటికీ తిరుగుతూ సాయం కోసం అభ్యర్థించడం కలిచివేసింది. ఆమెను అలాంటి స్థితిలో చూసినా ఎవరూ సాయం చేయలేదు. ఓ వ్యక్తి ఆమెని చూసి కూడా పట్టించుకోకుండా అలాగే ముందుకు వెళ్లిపోవడం CC కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియోలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఉజ్జెయిన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్నాగర్ రోడ్ వద్ద ఈ ఘటన జరిగింది. తన ఒంటిని కప్పుకునేందుకు నానా ఇబ్బందులు పడుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిపోయింది. చివరకు ఓ ఆశ్రమం వద్దకు చేరుకుంది. ఆమెని చూసిన ఓ పూజారి వెంటనే ఆమె శరీరాన్ని కప్పాడు. ఆమెపై అత్యాచారం జరిగిందని గుర్తించాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు అత్యాచారం జరిగినట్టు ధ్రువీకరించారు. గాయాలు చాలా తీవ్రంగా ఉండడం వల్ల మెరుగైన చికిత్స కోసం ఇండోర్‌కి తరలించారు. అప్పటికే చాలా రక్తం పోయింది. పోలీసులే ముందుకొచ్చి ఆమెకి రక్తదానం చేశారు.
Also Read: ఎలన్ మస్క్‌పై పిటిషన్ వేసిన మాజీ భార్య, కొడుకుని చూడనివ్వడం లేదని కోర్టుకి