Chandigarh Auto driver: టమాటాలు ఉచితంగా పంచుతున్న ఆటో డ్రైవర్, కానీ ఓ కండీషన్
Chandigarh Auto driver: ఛండీగఢ్‌లోని ఆటో డ్రైవర్ తన ఆటోలో 5 సార్లు ప్రయాణించిన వాళ్లకు ఉచితంగా టమాటాలు ఇస్తున్నాడు.
Chandigarh Auto driver:
ఛండీగఢ్ ఆటో డ్రైవర్
టమాటా ధరలు దడ పుట్టిస్తున్నాయి. రేపో మాపో తగ్గుతాయనుకుంటే...రోజురోజుకీ ఇంకా పెరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల రికార్డు స్థాయిలో కిలో రూ.250 వరకూ పలుకుతోంది. కొన్నిచోట్ల మాత్రం ప్రభుత్వం సబ్సిడీ ధరలకు అందిస్తూ కాస్త ఊరటనిస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఆటో డ్రైవర్ ప్యాసింజర్స్‌కి టమాటాలు ఉచితంగా పంచుతున్నాడు. ఛండీగఢ్‌లోని ఆటోడ్రైవర్ అరుణ్ ఈ స్కీమ్ తీసుకొచ్చాడు. కాకపోతే కొన్ని కండీషన్స్ పెట్టాడు. తన ఆటోలో ప్రయాణించిన వాళ్లకు కిలో టమాటాలు ఉచితంగా ఇస్తానని ప్రకటించాడు. అలా అని ఏదో ఓ సారి ఎక్కి కాస్త దూరం ప్రయాణం చేసి దిగిపోయి టమాటాలు అడిగితే కుదరదు. కచ్చితంగా ఐదు సార్లు తన ఆటోలో ప్రయాణంచాల్సిందే. ఇలాంటి కొత్త స్కీమ్‌లతో ప్రయాణికులను అట్రాక్ట్ చేయడం ఇదే తొలిసారి కాదు. దాదాపు 12 ఏళ్లుగా ఇండియన్ ఆర్మీకి చెందిన వాళ్లకు ఫ్రీగా సర్వీస్ అందిస్తున్నాడు అరుణ్. అంటే...ఆర్మీ వాళ్లు ఎవరు ఎక్కినా ఒక్క పైసా తీసుకోడు. ఇక గర్భిణీల నుంచి కూడా డబ్బులు వసూలు చేయడు. వాళ్లకూ ఉచితంగానే సర్వీస్ చేస్తున్నాడు. హాస్పిటల్స్‌కి తీసుకెళ్లి దిగబెడతాడు. కేవలం ఆటో నడిపితే వచ్చే ఆదాయంతోనే జీవనం గడుపుతున్న అరుణ్..ఇలా సోషల్ సర్వీస్ కూడా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
"నాకున్న ఒకే ఒక ఆదాయ మార్గం ఆటో నడపడమే. కానీ...ఇలాంటి సర్వీస్‌లు ఇవ్వడం వల్ల నాకు చాలా సంతృప్తి కలుగుతుంది. అక్టోబర్‌లో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ గనక ఇండియా విన్ అయితే ఛండీగఢ్‌లో ఐదురోజుల పాటు అందరికీ ఫ్రీ రైడ్ ఇస్తాను"
- అరుణ్, ఆటో డ్రైవర్
షూ షాప్ ఓనర్ ఆఫర్..
పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్‌లోని ఓ షూ షాప్ ఓనర్ ఇలాంటి ఆఫరే ఇచ్చాడు. తన షాప్‌లో షూ కొన్న వాళ్లకి 2 కిలోల టమాటాలు ఉచితంగా ఇస్తామని ప్రకటన ఇచ్చాడు. రూ.1000 కన్నా ఎక్కువ విలువైన షూ కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పాడు. మధ్యప్రదేశ్‌లోనూ ఓ మొబైల్ షాప్ ఓనర్..తన షాప్‌లో ఫోన్‌లు కొన్న వాళ్లకి ఉచితంగా టమాటాలు పంచుతున్నాడు.
ఢిల్లీలో సబ్సిడీ ధరకే..
చెన్నైలో పలు చోట్ల రేషన్ దుకాణాల్లో టమాటాలు తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇప్పుడు ఢిల్లీలోనూ టమాటా ధరలు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో నోయిడా, లఖ్‌నవూ, కాన్‌పూర్, వారణాసి,పట్నా, ముజఫర్‌పూర్ ప్రాంతాల్లో కిలో టమాటా రూ.80కే విక్రయించనుంది. దేశంలో దాదాపు 500 కేంద్రాల్లో ధరల స్థితిగతుల్ని తెలుసుకున్నాక..ఈ నిర్ణయం తీసుకున్నట్టు National Cooperative Consumers' Federation of India అధికారులు వెల్లడించారు. ముంబయిలో రూ.150, చెన్నైలో రూ.132. దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్‌లలో టమాటా ధరలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. గరిష్ఠంగా రూ.250కి చేరుకుంది. యావరేజ్ ప్రైస్ మాత్రం రూ.117గా ఉన్నట్టు తేలింది.