PM Suryodaya Yojana: పైసా ఖర్చు లేకుండా మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్! జీవితాంతం ఫ్రీ కరెంటు - ఇలా చేయండి
Suryodaya Yojana Scheme: ప్రధాన మంత్రి సూర్యోదయ యోజనకు సంబంధించిన వివరాలను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు.
![PM Suryodaya Yojana: పైసా ఖర్చు లేకుండా మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్! జీవితాంతం ఫ్రీ కరెంటు - ఇలా చేయండి Suryodaya Yojana scheme solar panels can be setup with free of cost details here PM Suryodaya Yojana: పైసా ఖర్చు లేకుండా మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్! జీవితాంతం ఫ్రీ కరెంటు - ఇలా చేయండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/04/e46bf6817eff2f15f039b82a30f1e69f1707016805057234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pradhan Mantri Suryodaya Yojana Scheme Details: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ‘సూర్యోదయ యోజన’ (Suryodaya Yojana Scheme) అనే కొత్త పథకం గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. దేశంలోని ఒక కోటి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను (Solar Panels) అమర్చనున్నారు. తాజాగా ఈ పథకం గురించి కొత్త వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఈ పథకం కింద ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్‌ను అమర్చుకోవడానికి ప్రభుత్వం నుంచి ఎక్కువ సబ్సిడీని పొందనున్నారు. సోలార్ ప్యానెళ్లను అమర్చుకున్న అనంతరం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రజలు తమ ఇంటిపైనే విద్యుత్ ఉత్పత్తి చేయగలుగుతారు.
ప్రస్తుతం 40 శాతం సబ్సిడీ
ప్రధాన మంత్రి సూర్యోదయ యోజనకు (Suryodaya Yojana Scheme Subsidy) సంబంధించిన వివరాలను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. గతంలో ప్రజలు తమ పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను అమర్చుకోవడానికి 40 శాతం సబ్సిడీ పొందేవారని కేంద్ర మంత్రి చెప్పారు. ఇప్పుడు వారికి ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన కింద 60 శాతం సబ్సిడీ లభిస్తుంది. మిగిలిన 40 శాతం మొత్తాన్ని ప్రజలు రుణంగా తీసుకోవచ్చు.
వారిపై ప్రభుత్వ దృష్టి
ఆర్థికంగా వెనుకబడిన వారు ఈ పథకం ద్వారా గరిష్ట ప్రయోజనాలను పొందేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ పథకం కింద కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సబ్సిడీని పెంచడం ద్వారా, ఎక్కువ మంది ఈ పథకం కింద రుణం తీసుకోకుండానే ఎక్కువ మంది తమ ఇళ్లలో సోలార్ ప్యానెల్స్‌ను పొందవచ్చని ప్రభుత్వం కోరుతోంది. దీని కింద నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.
విద్యుత్ కొనడం ద్వారా లోన్ పూర్తి
అయితే, ఒక వ్యక్తి రుణం తీసుకోవాలనుకున్నా, అతనిపై ఒత్తిడి ఉండదు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్‌ను (SPV) రూపొందిస్తోంది. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక SPVలను ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం నుంచి పొందే 60 శాతం సబ్సిడీ కాకుండా, మిగిలిన 40 శాతం SPV నుంచి రుణంగా తీసుకోవచ్చు. లబ్ధిదారుడి పైకప్పుపై అతని అవసరానికి మించి ఉత్పత్తి చేయబడిన విద్యుత్‌ను SPV కొనుగోలు చేస్తుంది. తద్వారా ఆ రుణం తిరిగి చెల్లింపు అవుతుంది. ఈ విధంగా రుణం సుమారు 10 సంవత్సరాలలో మొత్తం చెల్లింపు అవుతుంది. రుణం మొత్తం చెల్లింపు అయిన తర్వాత, సోలార్ ప్యానెల్ ఎక్విప్ మెంట్ మొత్తం లబ్ధిదారుడి పేరుకు బదిలీ చేస్తారు.
బడ్జెట్‌లో ఎన్ని వేల కోట్లు?
గత నెలలో అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత, ఫిబ్రవరి 1న లోక్‌సభలో బడ్జెట్‌ను సమర్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకం గురించి సమాచారం ఇచ్చారు. బడ్జెట్‌లో పథకానికి రూ.10 వేల కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా ప్రజలు ఏటా రూ.15 వేల నుంచి 18 వేల వరకు ఆదా చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
దేశంలో సౌరశక్తితో 100 గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సౌరశక్తితో దాదాపు 35 గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఉత్పత్తి 73 గిగావాట్లకు మించి ఉంటుందని అంచనా. ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన కింద 1 కోటి ఇళ్ల పైకప్పులపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా 100 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రభుత్వం సహాయపడుతుంది. కోటి పైకప్పులపై సౌర ఫలకాలను అమర్చడం ద్వారా దాదాపు 20-25 గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)