Prajwal Revanna: మహిళలపై లైంగిక దాడి కేసు - సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చుక్కెదురు
Supreme Court: మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.
Supreme Court Refuses Bail To Prajwal Revanna: మహిళలపై లైంగిక దాడి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు (Prajwal Revanna) సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారించిన సర్వోన్నత న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది. అంతకు ముందు కర్ణాటక హైకోర్టు (Karnataka Highcourt) సైతం ఆయన బెయిల్ అభ్యర్ధనను తోసిపుచ్చింది. కాగా, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. రేవణ్ణపై 3 కేసులు నమోదు కాగా.. నాలుగుసార్లు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయన దేశం విడిచి పరారు కాగా.. బెంగుళూరు పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ ఏడాది మేలో జర్మనీ నుంచి వచ్చిన రేవణ్ణను బెంగుళూరులో అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణకు కర్ణాటక ప్రభుత్వం సిట్ సైతం ఏర్పాటు చేసింది.
రేవణ్ణ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఫిర్యాదులో ఐపీసీ సెక్షన్ 376 నేరాన్ని పేర్కొనలేదని.. సెక్షన్ 376 సమస్య గురించి మాట్లాడలేదని చెప్పారు. ఆరోపణలు తీవ్రమైనవని.. అయితే, ఫిర్యాదులో అత్యాచారానికి సంబంధించిన నిర్దిష్ట ఆరోపణ లేదని వాదించారు. విదేశాల నుంచి వచ్చిన రేవణ్ణ వెంటనే పోలీసులకు లొంగిపోయారని.. బెయిల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ కేసు కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో రేవణ్ణ ఓడిపోయారని అన్నారు. ఈ వాదనలు విన్న జస్టిస్ ఎం.త్రివేది, సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం.. అతనిపై అనేక కేసులున్నాయని పేర్కొంటూ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కాగా, మరో 6 నెలల తర్వాత బెయిల్ కోసం దరఖాస్తు చేయవచ్చా.? అని ముకుల్ రోహత్గీ అభ్యర్థించగా.. 'మేం ఏమీ చెప్పడం లేదు' అని జస్టిస్ త్రివేది వ్యాఖ్యానించారు. అక్టోబర్ 21న హైకోర్టు రేవణ్ణకు రెగ్యులర్ బెయిల్, ముందస్తు పిటిషన్లను కొట్టివేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడా నిరాశే ఎదురైంది.