Proffessor Bikini Photos: ప్రొఫెసర్ బికినీ ఫోటోలు ఇన్‌స్టాలో, చూసేసిన స్టూడెంట్స్! 99 కోట్లు కట్టాలన్న వర్సిటీ
Kolkata University: తాను ఏ తప్పూ చేయలేదని ప్రొఫెసర్ వాదించారు. అయినా తనపై వచ్చిన ఆరోపణలకు గానూ ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు ఉద్వాసనకు గురయ్యారు. ఆ మహిళా ప్రొఫెసర్ బికినీ వేసుకొని దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయని వర్సిటీ యాజమాన్యానికి తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఒకరు సదరు మహిళా ప్రొఫెసర్ బికినీ వేసుకున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో చూశాడు. అది గమనించిన అతని తండ్రి ఆ విషయాన్ని సెయింట్ జేవియర్స్ యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు.
అయితే, తాను ఏ తప్పూ చేయలేదని ప్రొఫెసర్ వాదించారు. అయినా తనపై వచ్చిన ఆరోపణలకు గానూ ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
గతేడాది ఈ ఘటన జరిగింది. గత అక్టోబరులో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఆమె వల్ల యూనివర్సిటీ ప్రతిష్ఠకు భంగం కలిగిందనే ఉద్దేశిస్తూ ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ ను రూ.99 కోట్లు కట్టాలంటూ అధికారులు ఆదేశించారు. అయితే, ఆ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ మాత్రం తాను ఏ తప్పూ చేయలేదని, కాబట్టి న్యాయపరంగా పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు.
‘‘అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌కు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన రీతిలో ఉన్న ఫొటోలను నా కుమారుడు చూడటాన్ని గమనించాను. వాటిని చూసి నిర్ఘాంతపోయాను. ఒక ప్రొఫెసర్ ఇలా లో దుస్తులు ధరించి సోషల్ మీడియాలో చిత్రాలను అప్‌లోడ్ చేయడం అవమానకరం. ఇలాంటి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచి ఆమె తన విద్యార్థులకు ఏం బోధిస్తున్నట్లు. ఇది అసభ్యకరమైన చర్య, ఏమాత్రం ఆమోదించదగ్గది కాదు’’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తాజాగా మీడియాతో మాట్లాడిన బాధితురాలు
ఆ ఫిర్యాదును అందుకున్న యూనివర్సిటీ యాజమాన్యం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ చర్య వల్ల యూనివర్సిటీ ప్రతిష్ఠకు, కీర్తికి తీవ్రమైన నష్టం వాటిల్లినట్లుగా పరిగణించింది. దీంతో ఆమెను ఉద్యోగంలో నుంచి తీసేశారు. దీనిపై ఆ మాజీ ప్రొఫెసర్ తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. గత అక్టోబర్‌లో రిజిస్ట్రార్, వైస్ ఛాన్సలర్ తో కూడిన ఓ కమిటీ తనను విచారణ చేసిందని తెలిపారు. ఆ సమావేశంలో ఫిర్యాదు లేఖను తన ముందు చదివి వినిపించారని, ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించారు. వారి డిమాండ్ మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో అదే నెల చివరి వారంలో తాను రాజీనామా చేసినట్లు వివరించారు.
అయితే, యూనివర్సిటీలో ఉన్న నిబంధనల ప్రకారం.. తాను ఎలాంటి డ్రెస్ కోడ్ ఉల్లంఘనలు చేయలేదని, తన ఇన్ స్ట్రా ప్రొఫైల్ కూడా ప్రైవేట్ ఖాతానేనని అన్నారు. దాన్ని ఎవరో హ్యాక్ చేశారని, అందుకే ఆ ఫొటోలు లీకయ్యాయంటూ అదే నెలలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనవసరంగా తనను ఉద్యోగంలోనుంచి తీసేశారని, విద్యార్థి తండ్రి ఫిర్యాదు కాపీని ఇవ్వాలని కోరుతూ విశ్వవిద్యాలయానికి లీగల్ నోటీసు కూడా ఇచ్చారు. నోటీసుపై యూనివర్సిటీ అధికారులు ఇది తీవ్రమైన తప్పుడు చర్యగా పేర్కొన్నారు. యూనివర్సిటీకి జరిగిన నష్టానికి గానూ రూ.99 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని నోటీసులు పంపినట్లు ఆమె తెలిపారు. అయితే, ఈ అంశంపై తాను హైకోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు.