PUNJAB POLITICS:కెప్టెన్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన సిద్ధూ..!
పంజాబ్ కాంగ్రెస్‌లో చిత్రమైన రాజకీయం కనిపిస్తోంది. సీఎం అమరీందర్‌తో సిద్దూకు విభేదాలు ఉన్నాయని తెలిసి పీసీసీ ఇచ్చింది అధిష్ఠానం. ఇప్పుడు ఆయన తన స్టైల్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు.
పంజాబ్‌లో రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం అనుకున్నారు కానీ.. ఇవాళ... పూర్తిగా రాజకీయం అంతా సిద్ధూకు అనుకూలంగా మారిపోయింది. క్రికెటర్‌గా ఎక్కవ మాట్లాడడని పేరు తెచ్చుకున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఇప్పుడు రాజకీయాల్లో ఆరితేరిపోయారు. క్రికెటర్‌గా రిటైరైన తర్వాత..కామెడీ షోలకు జడ్జిగా వెళ్లినా .. ఆయన కామెడీ కాలేదు. క్యారెక్టర్‌ని సీరియస్‌గానే ఉంచుకున్నారు. అదే సీరియస్ నెస్‌తో రాజకీయం చేస్తున్నారు. తనను ఇంత కాలం దూరం పెట్టినా రాహుల్, ప్రియాంకలతో ఉన్న సాన్నిహిత్యంతో .. పీసీసీ చీఫ్ పోస్టే పొందారు. ఆయన పీసీసీ చీఫ్ అయితే.. కాంగ్రెస్ పార్టీ చీలిపోతుందని ప్రచారం జరిగింది.కానీ.. సిద్దూ.. ఒడుపుగా సీఎం కెప్టెన్ అమరీందర్ వర్గాన్ని క్లీన్ బౌల్డ్ చేశారు.
ఇప్పుడు పంజాబ్‌లో ఆయనే సూపర్ స్టార్. ఇలా పీసీసీ చీఫ్ అవ్వగానే.. అలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఆయన గూటికి చేరిపోయారు. ముఖ్యమంత్రిగా ఉన్న కెప్టెన్ అమరీందర్ పక్కన పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు కూడా లేకుండా పోయారు. సిద్ధూకు ఏకంగా 62 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. కెప్టెన్ అమరీందర్ సింగ్.. పంజాబ్ రాజకీయాల్లో పాతుకుపోయిన నేత. అయితే ఆయన వయసు ఎనభై దాటిపోయింది. ఈ సమయంలో... కాంగ్రెస్ పార్టీకి సిద్ధూ భవిష్యత్ లీడర్‌గా కనిపించారు. అయితే ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చారు. 2014లో అరుణ్ జైట్లీకి లోక్‌సభ టిక్కెట్ ఇవ్వడానికి మోడీ, అమిత్ షా.. సిద్దూను పక్కన పెట్టడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరిపోయారు.
గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడే.. సీఎం సీటుకు పోటీ పడ్డారు. కానీ.. అమరీందర్‌కే సోనియా చాన్సిచ్చారు. తనకు వయసు అయిపోతోందని..ఇదే చివరి చాన్స్ అని చెప్పడంతో ఆయన వైపే మొగ్గారు. సిద్దూకు మంత్రి పదవి ఇచ్చినా.. ఏ అధికారం లేకపోవడంతో.. ఆయన పదవికి రాజీనామా చేసి .. కామెడీ షోలకు జడ్జిగా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతో మరోసారి పంజాబ్ పై దృష్టి పెట్టారు. పీసీసీ చీఫ్ పోస్ట్ సాధించగలిగారు. ఆ వెంటనే...కాంగ్రెస్‌పై పట్టు సాధించారు. ఎమ్మెల్యేలందర్నీ తన వైపు తిప్పుకుని.. బలప్రదర్శన చేశారు.
పంజాబ్ కు ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగాల్సి ఉన్నాయి. ఎన్నికలు జరిగే వరకూ అమరీందర్ సీఎంగా ఉంటారు. కానీ ఆ తర్వాత మాత్రం సిద్దూదే రాజ్యం. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకే మెరుగైన అవకాశాలు ఉంటాయని.. సిద్ధూ సీఎం అభ్యర్థి అయితే..మరింత అవకాశాలు పెరుగుతాయని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. అంటే సిద్ధూ.. రాజకీయాల్లోనూ... తనదైన ముద్ర వేసినట్లేనన్నమాట. ఆర్మీలో కెప్టెన్‌గా చేసి రాజకీయాల్లోకి వచ్చి.. సుదీర్ఘమైన పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడిన... అమరీందర్ సింగ్.. క్రికెట్‌లో పెద్దగా కెప్టెన్సీ చేయని.. సిద్ధూ చేతిలో.. క్లీన్ బౌల్డ్ అయిపోయారు.