Pawar Meets PM Modi: మహారాష్ట్రలో ఈడీ- పవార్‌తో మోడీ- ఎందుకీ సడెన్ మీటింగ్?
ప్రధాని నరేంద్ర మోదీ- శరద్ పవార్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీరి భేటీలో ఏ అంశాలపై చర్చించారో చూద్దాం.
ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ బుధవారం భేటీ అయ్యారు. ఇంతవరకు బానే ఉంది.. కానీ ఈ సడెన్ మీటింగ్ దేనికనేదే ప్రశ్న. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వరుస దాడులు చేస్తోంది. ఇలాంటి తరుణంలో మోదీ-పవార్ భేటీ కావడం విశేషం.
పార్లమెంటులో ఉభయులూ సుమారు 20 నుంచి 25 నిమిషాల పాటు సమావేశమయ్యారు. దీంతో వీరి సమావేశం వెనుక కారణం ఏమై ఉండవచ్చనేది ప్రధానంగా మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. మహారాష్ట్రలోని అధికార మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) నేతలపై, ముఖ్యంగా ఎన్‌సీపీ, శివసేన నేతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్ (ఈడీ) వరుస దాడుల చేస్తోంది. దీంతో వీరి భేటీపై ఆసక్తి నెలకొంది.
ఏం మాట్లాడారు?
పవార్, మోదీ సమావేశంపై ఎన్‌సీపీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఇది సాధారణ భేటీ యేనని మరీ పెద్దదిగా చేసి చూడనవసరం లేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. సమావేశం గురించి తనకు సమాచారం ఏమీ లేదని, సమాచారం తెలిస్తే చెబుతానన్నారు.
అయితే మోదీతో భేటీ తర్వాత పవార్ మీడియాతో మాట్లాడారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కేంద్ర సంస్థలు ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు పూర్తి బాధ్యత కూడా వాళ్లదే అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తినందుకే రౌత్‌ను ఈడీ లక్ష్యంగా చేసుకుందని పవార్ ఆరోపించారు.
ఆస్తులు సీజ్
శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ సహా ముగ్గురి రూ.11.15 కోట్ల విలువైన ఆస్తులను మంగళవారం అటాచ్ చేసింది.
జప్తు చేసిన ఆస్తుల్లో రూ. 9 కోట్లు విలువ చేసే అలీబాగ్‌లోని 8 స్థలాలతో పాటు ముంబయిలోని దాదార్ శివారులో ఉన్న రూ. 2 కోట్ల విలువైన ఓ ఫ్లాట్ ఉన్నాయి. ముంబయిలోని పత్రచాల్ రీ-డెవలప్‌మెంట్‌కు సంబంధించి రూ.1,034 కోట్ల విలువైన భూ కుంభకోణం కేసులో భాగంగా ఈ జప్తు జరిగినట్టు ఈడీ పేర్కొంది.
అరెస్ట్
ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త ప్రవీణ్ రౌత్‌ను ఫిబ్రవరిలోనే అరెస్టు చేసింది ఈడీ. అనంతరం ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది. మరో మనీలాండరింగ్ కేసు పీఎంసీ బ్యాంక్ మోసానికి సంబంధించి సంజయ్ రౌత్ సతీమణి వర్షా రౌత్‌ను గతేడాదే ప్రశ్నించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ప్రవీణ్ రౌత్ భార్య మాధురితో వర్షాకు ఉన్న సంబంధాలపై ప్రశ్నలు సంధించింది.
Also Read: Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఆ పక్షమే- పార్లమెంటులో విదేశాంగ మంత్రి క్లారిటీ
Also Read: Viral Video: కూతురికి ఏం గ్రాండ్ వెల్‌కమ్ ఇచ్చావు కాకా! అట్లుంటది మనతోని!