Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Kejriwal Ed Custody: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీని కోర్టు మరో 4 రోజులు పొడిగించింది. ఏప్రిల్ 1 వరకూ ఆయన్ను ఈడీ కస్టడీకి అనుమతించింది.
Court Extend Ed Custody To Delhi Cm Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Kejriwal)కు షాక్ తగిలింది. కేజ్రీవాల్ ఈడీ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరో 4 రోజులు పొడిగించింది. ఈడీ అధికారులు ఆయన్ను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరగా.. 4 రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో ఏప్రిల్ 1 వరకూ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. ఈ కేసులో గతంలో విధించిన 7 రోజుల కస్టడీ గురువారంతో ముగియగా.. ఈడీ అధికారులు ఆయన్ను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. ఇంకా విచారించేందుకు కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీకి కోరగా.. న్యాయస్థానం అనుమతించింది. కాగా, ఈ నెల 21న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది.
ఈడీ వాదన ఇదే
ఈ కేసులో కేజ్రీవాల్ ను విచారించే సమయంలో 5 రోజులు ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేశామని.. ఆయన సమాధానాలు దాటవేస్తున్నారని ఈడీ ఆరోపించింది. డిజిటల్ పరికరాలకు సంబంధించి పాస్ వర్డ్స్ ను ఆయన వెల్లడించలేదని కోర్టు దృష్టికి తెచ్చింది. ఇదే సమయంలో మరో ముగ్గురు వ్యక్తుల వాంగ్మూలాలను కూడా రికార్డు చేశామని తెలిపింది. 'ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ రూ.100 కోట్ల లంచం తీసుకున్నారు. ఈడీకి అరెస్ట్ చేసే అధికారం ఉంది. ఆయన విచారణకు సహకరించడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ హవాలా డబ్బు ద్వారా గోవా ఎన్నికల్లో ఖర్చు చేసిన వివరాలు మా దగ్గర ఉన్నాయి. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి.' అని ఈడీ పేర్కొంది.
కేజ్రీవాల్ స్వయం వాదనలు
అంతకుముందు కేజ్రీవాలే స్వయంగా కోర్టులో తన వాదనలు వినిపించారు. ఈ కేసులో నలుగురు సాక్షులు మాత్రమే తన పేరును ప్రస్తావించారని... ఒక సీఎంను అరెస్ట్ చేసేందుకు ఆ వాంగ్మూలాలు సరిపోతాయా.? అని ఈడీని ఉద్దేశించి ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీని దేశం ముందు ఓ అవినీతి పార్టీగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. 'నిందితుడితో బలవంతంగా నా పేరు చెప్పించారు. ఏ కోర్టు నన్ను దోషిగా పరిగణించలేదు. ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు నేను సిద్ధం.' అంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
'రాజకీయ కుట్ర'
#WATCH | Excise Case: Delhi CM Arvind Kejriwal says "This is a political conspiracy, the public will give an answer to this."
— ANI (@ANI) March 28, 2024
Delhi Court extended ED remand of Arvind Kejriwal till April 1. pic.twitter.com/iWONJzELGZ
అయితే, కేజ్రీవాల్ ను కోర్టులోకి తీసుకువెళ్తున్న సమయంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసు ఓ రాజకీయ కుట్ర అని ఆరోపించారు. ఢిల్లీ ప్రజలే దీనికి సమాధానం చెబుతారని అన్నారు.
కాస్త ఊరట
కాగా, కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేసేలా ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు డిస్మిస్ చేసింది. జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విషయంలో న్యాయపరమైన జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కారణంగా పిల్ ను డిస్మిస్ చేసింది. కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ జైలు నుంచే ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.