Facebook Love: ప్రియుడి కోసం పాకిస్తాన్ వెళ్లిన రాజస్థాన్ మహిళ
పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్ భారత్‌లోకి ప్రవేశించిన ఘటన మరవక ముందే ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళ తన ఫేస్‌బుక్ స్నేహితుణ్ని కలుసుకునేందుకు పాకిస్తాన్ వెళ్లింది.
ఇటీవల ఆన్‌లైన్ ప్రేమలు పెరిగిపోయాయి. ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరగుతూనే ఉన్నాయి. ప్రియుడు/ ప్రియురాలి కోసం దేశాలు, ఖండాలు దాటి వెళ్లడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ రాజస్థాన్‌కు చెందిన ఓ వివాహిత తన ఫేస్‌బుక్ ప్రేమికుడి కోసం పాకిస్తాన్ వెళ్లింది.
పబ్‌జీ ఆన్‌లైన్ గేమ్ ద్వారా పరిచయమైన యువకుడి కోసం పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్ తన నలుగురు పిల్లలతో కలసి భారత్‌లోకి ప్రవేశించిన ఘటన మరవక ముందే ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకుంది. అయితే ఈసారి రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళ తన ఫేస్‌బుక్ స్నేహితుణ్ని కలుసుకునేందుకు పాకిస్తాన్ వెళ్లింది.
ఫేస్‌బుక్‌లో పరిచయం
అంజు(34), అర్వింద్ దంపతులు. వీరు రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని బీవాడీలో నివసిస్తున్నారు. వీళ్లకు 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజుకు ఫేస్‌బుక్‌లో పాక్‌కు చెందిన నస్రుల్లా అనే 29 ఏళ్ల యువకుడితో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. కొద్ది కాలానికి ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అతన్ని కలుసుకోవడానికి అంజు గురువారం పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని అప్పర్ దిర్ జిల్లాకు వెళ్లింది. స్థానిక పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. వీసాతోపాటు ఇతర అనుమతి పత్రాలన్నీ సక్రమంగా ఉండటంతో ఆమెను విడిచిపెట్టారు.
జైపూర్ వెళ్తున్నానని చెప్పి..
అయితే ఆమె భర్త అర్వింద్‌కు మాత్రం ఆదివారం విషయం తెలిసింది. ఆమె పని చేసే కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా అంజుకు వాట్సప్ కాల్ చేయగా పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉన్నట్లు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న రాజస్థాన్ అధికారుల బృందం అర్వింద్ ఇంటికి వెళ్లి విచారణ చేశారు. అర్వింద్ మాట్లాడుతూ.. అంజూ జైపూర్ పర్యటకు వెళ్తున్నానని, కొద్ది రోజుల్లో తిరిగి వస్తానని చెప్పినట్లు వెల్లడించాడు.
మూడేళ్ల కిందటే పాస్‌పోర్ట్
అంజుకు పాస్‌పోర్ట్ ఎప్పుడు వచ్చిందని, వీసా మంజూరు విషయం గురించి అధికారులు ఆరా తీశారు. అంజూకు మూడేళ్ల క్రితం పాస్‌పోర్ట్ వచ్చిందని, ఇతర దేశాల్లో ఉపాధి కోసం పాస్ పోర్ట్ చేయించుకున్నట్లు చెప్పిందని అర్వింద్ వివరించాడు. ప్రస్తుతం అంజూ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తోందని చెప్పాడు. తాము క్రైస్తవులమని.. ఈ విషయాన్ని హిందూ-ముస్లిం ప్రేమకథగా రాయొద్దని అర్వింద్ కోరాడు. అంజూ తనకు మాట ఇచ్చిందని, పిల్లల కోసం తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ నుంచి తిరిగి వస్తుందనే నమ్మకం తనకు ఉందన్నాడు.
పంజాబ్ మీదుగా పాకిస్తాన్‌లోకి
పాకిస్తాన్‌కు చెందిన మీడియాతో డిర్ పోలీస్ స్టేషన్ SHO జావీద్ ఖాన్ మాట్లాడుతూ.. అంజూకు వీసా ఉందని, చట్టప్రకారమే పాకిస్తాన్‌లోకి ప్రవేశించిందన్నారు. ఈ ఉదంతంపై బీవాడీ ఏఎస్పీ సుజిత్ శంకర్ స్పందిస్తూ.. అంజూ ఈ నెల 20వ తేదీ ఇంటి నుంచి వెళ్లిపోయిందన్నారు. మధ్యప్రదేశ్‌లోని తెకంపూర్‌కు చెందిన అంజూ, ఉత్తర ప్రదేశ్‌లోని బలియాకు చెందిన అర్వింద్ పెళ్లి చేసుకుని రాజస్థాన్‌లో ఉంటున్నట్లు గుర్తించామన్నారు. మే 4న అంజూకు వీసా మంజూరైనట్లు గుర్తించారు. పంజాబ్‌లోని వాఘా ద్వారా పాకిస్తాన్‌లోకి ప్రవేశించినట్లు తేలింది.