Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్
Congress Task Force 2024: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన "టాస్క్ ఫోర్స్ - 2024"లో ఎంపీ రాహుల్ గాంధీకి చోటు లభించలేదు. ఈ మేరకు సోనియా గాంధీ ప్రకటన చేశారు.
పార్టీ ఎంపీ రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నుంచి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ "టాస్క్ ఫోర్స్ - 2024"ని ప్రకటించగా.. అందులో రాహుల్‌కు చోటు దక్కలేదు. ఈ టాస్క్ ఫోర్స్ వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ వ్యూహాలు రచించనుంది. ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన చింతన ఈవెంట్‌లో కాంగ్రెస్ పార్టీ సంస్కరణలలో భాగంగా పలు కమిటీల ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన పొలిటికల్ స్ట్రాటజీ టీమ్ కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ 2024 టీమ్‌లో రాహుల్ గాంధీని తీసుకోలేదు. గులాం నబి ఆజాద్, మల్లికార్జున ఖర్గే లాంటి జీ 23 నేతలకు ఈ కీలక గ్రూప్‌లో అవకాశం కల్పించలేదు సోనియా గాంధీ.
జీ 23 నేతలకు టాస్క్ ఫోర్స్‌లో నో ఛాన్స్
పార్టీలో అసమ్మతి వైపు మొగ్గుచూపుతూ లేఖలు రాసిన 23 మంది నేతలకు ఎన్నికల కోసం వ్యూహాలు రచించే టాస్క్ ఫోర్స్‌లోకి తీసుకోలేదు కాంగ్రెస్ అధిష్టానం. మరోవైపు దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్రకు చేయనున్నారు. ఇందులో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించనున్నారు. భారత్ జోడో యాత్రను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఈ పాదయాత్రను సక్సెస్ చేసేందుకు ప్రత్యేక కమిటీలను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. టాస్క్ ఫోర్స్ 2024 గ్రూప్, పొలిటికల్ అఫైర్స్ కమిటి, భారత్ జోడో యాత్ర ప్లానింగ్ మరియు కో ఆర్డీనేషన్ కోసం స్పెషల్ కమిటీలను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. ఈ కమిటీల ఏర్పాటుపై రాజస్థాన్‌లో చింతన్ శిబిరంలో పార్టీ కీలక నేతలు ప్రతిపాదన చేయగా, నేడు కమిటీల ఏర్పాటుపై సోనియా ప్రకటన చేశారు. భారత్ జోడో యాత్ర సెంట్రల్ ప్లానింగ్ మరియు కో ఆర్డీనేషన్ గ్రూప్‌లో సభ్యులుగా శశి థరూర్, దిగ్విజయ్ సింగ్, సచిన్ పైలెట్, రణవీత్ సింగ్ భట్టు, కేజే జార్జ్, సలీమ్ అహ్మద్, జోతి మని, ప్రద్యుత్ బోర్డోలూయి, జితూ పత్వారిను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది.
రాహుల్ గాంధీకి ఇక్కడ ఛాన్స్..
టాస్క్ ఫోర్స్ 2024లో చోటుదక్కని రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ నేతలకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో అవకాశం లభించింది. ఏఐసీసీ ప్రకటించిన పొలిటికల్ అఫైర్స్ కమిటిలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్, అంబికా సోని, దిగ్విజయ్ సింగ్, జితేందర్ సింగ్, అనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ 2024లో ప్రియాంకకు చోటు
వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం వ్యూహాలు రచించాల్సిన టాస్క్ ఫోర్స్ 2024 కమిటీలో కేంద్ర మాజీ మంత్రులు పి చిదంబరం, జైరాం రమేష్, ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్ తో పాటు రణదీప్ సింగ్ సూర్జేవాలా, ప్రియాంక గాంధీ వాద్రా, కె సునీల్‌లకు ఛాన్స్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం.