How PV Saves India : ఇప్పటి శ్రీలంకలా అప్పట్లో భారత్ మారకుండా కాపాడింది పీవీనే ! ఆ రోజు తీసుకున్న నిర్ణయమే ...
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక వ్యక్తి పీవీ నరసింహారావు. ఆయన జయంతి సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థకు ఆయన చేసిన మేలు గురించి ఒక్క సారి గుర్తు చేసుకుందాం !
How PV Saves India : పీవీ నరసింహారావు అంటే దేశ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరిగా దేశం ఈ రోజు ఆర్థికంగా ఈ స్థితిలో ఉందంటే దానికి కారణం ఆయనేనని మొదటి మాటగా చెబుతారు. ఎందుకంటే ప్రధానిగా పీవీ బాధ్యతలు చేపట్టిన పరిస్థితుల్లో దేశం ఆర్థికంగా ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండేదో ఒక్క మాటలో చెప్పాలంటే... శ్రీలంకను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. శ్రీలంకకు పీవీ లాంటి నేత లేడు కాబట్టి చేయి దాటిపోయింది. కానీ విదేశీ మారక ద్రవ్యం పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితుల్లో దేశ అవసరాలు తీర్చడానికి పీవీ నరసింహారావు సాహసోపేత నిర్ణయాలు సంస్కరణలు తీసుకువచ్చారు. వాటి ఫలితమే నేడు ఆర్థికంగా దేశం నిలదొక్కుకోగలిగింది.,
1991లో శ్రీలంక తరహా సంక్షోభం ఎదుర్కొన్న భారత్
1991 ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ ఎలా గట్టిక్కిందో ఈ రోజుకీ ప్రపంచ దేశాలకు ఆశ్చర్యమే. 1991 నాటికి భారతదేశం క్లోజ్డ్ ఎకానమీగా ఉండేది. అంటే ప్రతి నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. ఎంత ఉత్పత్తి చేయాలి, ఎంత ఖర్చు చేయాలి, ఎంతమందిని వినియోగించాలి అన్నవన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇలాంటి వ్యవస్థనే పర్మిట్ రాజ్ లేదంటే లైసెన్స్ రాజ్ అంటారు. అదే ఎకనమిక్ క్రైసిస్ కు కారణమైంది. అప్పుడు భారతదేశం వద్ద విదేశీ మారకద్రవ్యం నిల్వలు దాదాపుగా ఖాళీ అయిపోయాయి. ఒక బిలియన్ డాలర్ నిల్వలు మాత్రమే మిగిలాయి. అవి కూడా 20 రోజుల పాటు చమురు, ఆహార బిల్లుల చెల్లింపుకు మాత్రమే సరిపోతాయి. భారత్ విదేశీ అప్పులు 72 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా అప్పులు ఉన్న దేశాల్లో మూడో స్థానంలో భారత్ ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థపైనా, ప్రభుత్వంపైనా ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోంది. ద్రవ్యోల్బణం, రెవెన్యూ లోటు, కరెంట్ ఖాతా లోటు రెండంకెలకు చేరుకున్నాయి.
పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు
1991 జూన్ 21వ తేదీన పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నిర్ణీత గడువులోగా భారతదేశం విదేశీ అప్పును చెల్లించలేకపోతుందని, డీఫాల్టర్‌గా ప్రకటించుకుంటుందని అప్పట్లో అంతా భావించారు. కానీ, మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా పెట్టుకున్న పీవీ నరసింహారావు పలు సంస్కరణలు తీసుకొచ్చారు. నిర్మాణాత్మక మార్పులతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. మన్మోహన్ సింగ్ అనే ఆర్థిక వేత్తకు..... ఆర్థికమంత్రి పదవి ఇచ్చి ఈ దేశాన్ని పీవీ నెక్ట్ ఫేజ్ వైపు నడిపించారు. చాలా మంది 1991 జులై 24ను భారతదేశ ఆర్థిక స్వాతంత్ర్య దినోత్సవం అని కూడా అంటారు. ఆ రోజు సమర్పించిన బడ్జెట్ భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు బాటలు పరిచింది. ఓపెన్ ఎకానమీగా... ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించి, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించే ఆర్థిక సంస్కరణలను ప్రకటిస్తూ అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ జులై 24, 1991న బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశీయ మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ పెంచారు. లైసెన్సింగ్ రాజ్ కు చరమగీతం పాడారు.
రాజకీయ సవాళ్లు ఎదురైనా సంస్కరణలు అమలు చేసి దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టిన పీవీ
కంపెనీలు పర్మిట్ల నుంచి విముక్తి పొందాయి. ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతి లైసెన్సింగ్‌లో సడలింపులే లక్ష్యంగా బడ్జెట్‌లో చాలా మార్పులు ప్రకటించారు. దిగుమతి-ఎగుమతి విధానంలో విదేశీ పెట్టుబడులను స్వాగతించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉద్యోగాలు సృష్టిస్తాయని అర్థమయ్యేలా అందరినీ ఒప్పించారు. అంతెందుకు ఇంత గొప్పగా మనం ఈరోజు చెప్పు ఐటీ డెవలప్ మెంట్ కోసం 90 స్ లో ..ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 హెచ్‌హెచ్‌సి కింద పన్ను మినహాయింపు ప్రకటించారు. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ అభిప్రాయాలకు విరుద్ధంగా అప్పట్లో ఆర్థిక సంస్కరణలకు పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. పైగా పొలిటికల్లీ ఆయనది మైనార్టీ గవర్నమెంట్.
భారత ఆర్థిక వ్యవస్థ సాధించే ఘనతలకు పునాది ఆయన నిర్ణయాలే
అయినా దేశం కోసం ఆయన తగ్గలేదు. అంతకు ముందు గవర్నమెంట్స్ స్విట్టర్జ్ ల్యాండ్ బ్యాంకుల దగ్గర మన బంగారాన్ని తాకట్టుపెట్టడం లాంటి పనులు చేసినా ఏవీ కూడా మన దేశానికి ఆర్థిక సంస్కరణలు ఇచ్చిన ఫలితాలను తీసుకురాలేదు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే పీవీ తర్వాత ప్రధానిగా వచ్చిన అటల్ బిహారీ వాజ్ పేయ్...నరసింహారావు-మనోహ్మన్ ఆర్థిక సంస్కరణలను కొనసాగించారు. ఎక్కడా మార్చలేదు. రాజకీయాల కంటే దేశం గొప్పదని భావించే ఆ ఇద్దరు ప్రధానుల ఆలోచనా తీరే ఈరోజు మనం చూస్తున్న మూడున్నర లక్షల కోట్ల అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇది ఖచ్చితంగా పీవీ నరసింహారావు వేసిన పునాది నుంచే ఎదిగింది. అందుకే ఆధునిక భారత ఆర్థిక వ్యవస్థ పితామహుడిగా ఆయనను పేర్కొనవచ్చు.