జగన్‌తోపాటు వాళ్లు ఇచ్చిన డబ్బుతోనే బిహార్‌లో పాదయాత్ర- స్వయంగా చెప్పిన ప్రశాంత్ కిషోర్
జన్ సూరాజ్ క్యాంపెయిన్ పేరుతో చేస్తున్న యాత్ర ఇప్పడు బిహార్ రాజధానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండో- నేపాల్ బోర్డర్‌లోని వాల్మీకి నగర్‌లో కొనసాగుతోంది.
'జన్ సూరాజ్ క్యాంపెయిన్' పేరుతో బిహార్‌లో యాత్ర చేస్తున్న రాజకీయ వ్యూహకర్త చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. బిహార్‌లో ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయాలని సంకల్పించిన ప్రశాంత్ కిషోర్ అక్కడ యాత్ర చేస్తున్నారు. తన పార్టీ పూర్తి స్థాయి పార్టీగా ఆవిర్భవించే సరికి రాష్ట్రంలో ఉన్న సమస్యలు ప్రజల అవసరాలు తెలుసుకోవాలని లక్ష్యంతో ఆయన ఈ పాదయాత్ర చేస్తున్నారు.
జన్ సూరాజ్ క్యాంపెయిన్ పేరుతో చేస్తున్న యాత్ర ఇప్పడు బిహార్ రాజధానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండో- నేపాల్ బోర్డర్‌లోని వాల్మీకి నగర్‌లో కొనసాగుతోంది. అక్కడ మీడియాతో మాట్లాడిన పీకే... పలు ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. తన ఆర్థిక మూలలపై వస్తున్నా ఆరోపణలకు సమాధానం ఇచ్చారు.
కిషోర్ అక్టోబర్ 2 నుంచి పాదయాత్ర చేస్తున్నారు. తన క్యాంపెయిన్ పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా పరిణామం చెందకముందే తన సొంత రాష్ట్రంలోని ప్రతి మూలను తాకుతూ 3,500 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ఆయన యాత్ర చేపట్టారు. ఈ యాత్రకు బీజేపీ స్పాన్సర్ చేస్తోందని జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ ఆరోపించారు.
పీకే పాదయాత్రకు ఆర్థికంగా బీజేపీ సహాయపడుతుందని రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన ప్రశాంత్ కిషోర్... తన సేవలు వినియోగించుకున్న పాత క్లయింట్లు ఇప్పుడు తనకు సహాయం చేస్తున్నారని అన్నారు. IPAC వ్యవస్థాపకుడిగా తాను పది ఎన్నికలకు పని చేశానని గుర్తు చేశారు. అందులో యూపీ మినహా అన్ని ఎన్నికల్లో విజయం సాధించానని చెప్పుకొచ్చారు.
"గత ఒక దశాబ్దంలో, నేను కనీసం 10 ఎన్నికలకు నా సేవలను అందించాను. ఒకదానిలో మినహా అన్నింటిలో విజయం సాధించాను" అని 2017 UP అసెంబ్లీ ఎన్నికలను గుర్తుచేసుకున్నాడు, అందులో తన సలహాలు సరిగా వాడుకోలేదన్నట్టు మాట్టాడారు.
"నేను గెలవడానికి సహాయం చేసిన కనీసం ఆరుగురు ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. మీడియా నన్ను నమ్మకపోయినా నేను వారి నుంచి డబ్బు తీసుకోలేదు. కానీ ఇప్పుడు బిహార్‌లో మేము చేస్తున్న ప్రయోగానికి నేను వారి సహాయం కోరుతున్నాను" అని పీకే అన్నారు. 2014లో తొలిసారిగా నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి పీకే ఫేమస్ అయ్యారు.
అప్పటి నుంచి చాలా రాష్ట్రాల్లో పార్టీ ఆయన సేవలు వినియోగించుకుంటున్నాయి. ఇప్పటికి కూడా పీకే స్థాపించిన ఐప్యాక్ ఆయా రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు పని చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపులో ప్రశాంత్ కిశోర్ చాలా కీలక పాత్ర పోషించారు. పశ్చిమబెంగాల్‌లో మమతు, తమిళనాడులో స్టాలిన్ విజయం వెనుక పీకే ఉన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి సంచలన విజయాన్ని అందించిన తర్వాత రాజకీయ కన్సల్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మధ్య టీఆర్‌ఎస్‌తో కూడా IPAC ఒప్పందం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. తర్వాత వాళ్ల మధ్య ఆ బాండ్ బ్రేక్ అయిందని కూడా సమాచారం ఉంది కానీ ఇరు వర్గాలు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.