PM Viksit Bharat Rozgar Yojana: ప్రధాని మోదీ కొత్త పథకం: ఉద్యోగం పొందిన వారికి, కంపెనీలకు భారీ లబ్ధి!
ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ప్రారంభమైందంటూ ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రకటన చేశారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువతతో పాటు, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ఈ పథకం లబ్ధి చేకూర్చనుంది.

PM VBRY Eligibility : ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ప్రారంభమైందంటూ ప్రధాని మోదీ 79వ స్వాతంత్ర్య వేడుక సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రకటన చేశారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువతతో పాటు, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ఈ పథకం లబ్ధి చేకూర్చనుంది. అయితే, ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే అర్హతలేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి.
ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన అర్హతలు ఇవే...
ఈ పథకం అటు కొత్తగా ఉద్యోగం పొందిన వారికి, ఇటు కొత్తగా ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు వర్తిస్తుంది.
ఉద్యోగులు లబ్ధి పొందడానికి కావాల్సిన అర్హతలు
-
ప్రైవేట్ రంగంలో మొదటిసారిగా ఉద్యోగం పొందాలి.
-
నెలవారీ జీతం రూ. 1 లక్ష లేదా అంతకంటే తక్కువగా ఉండాలి.
-
ఉద్యోగం పొందిన సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.
-
2025 ఆగస్టు 1 లేదా ఆ తర్వాత EPFOలో మొదటిసారిగా ఉద్యోగం పొందిన వ్యక్తి సభ్యుడిగా చేరి ఉండాలి.
పై అర్హతలు ఉన్న ఉద్యోగికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ పథకం కింద గరిష్టంగా రూ. 15,000 ఆర్థిక సహాయం లభిస్తుంది.
కొత్తగా ఉద్యోగాలను కల్పించే ప్రైవేట్ కంపెనీలకు ప్రధానమంత్రి వికసిత్ భారత్ పథకం వర్తిస్తుంది.
కంపెనీలకు ఉండాల్సిన అర్హతలు ఇవే
-
50 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఇద్దరు కొత్త ఉద్యోగులను నియమించుకోవాలి. అప్పుడే ఈ పథకం వర్తిస్తుంది.
-
50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఐదుగురు కొత్త ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుంది.
కంపెనీలకు పై అర్హతలు ఉంటేనే ఈ పథకం కింద ప్రతి కొత్త ఉద్యోగి పేరున నెలకు రూ. 3,000 వరకు ప్రోత్సాహం లభిస్తుంది.
ఈ పథకానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
ప్రధానమంత్రి వికసిత్ భారత్ పథకానికి అర్హులైన వారు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పటికే ఉన్న EPFO వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటుంది. పై అర్హతలు ఉన్న ఉద్యోగి, ఈ పథకం వర్తించే కంపెనీలో ఉద్యోగిగా చేరితే, మీరు ఆ పథకానికి అర్హులా కాదా అనేది ఆటోమేటిక్‌గా నిర్ణయం జరిగిపోతుంది. అర్హత ఉన్న ఉద్యోగులకు ప్రకటించిన ఆర్థిక సహాయం వారి బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమ అవుతుంది. బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా ఆధార్ అనుసంధానించబడి ఉండాల్సి ఉంటుంది. అదే రీతిలో, కంపెనీలు తమ ఉద్యోగుల వివరాలను EPFO పోర్టల్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వివరాల తనిఖీ అనంతరం, ఈ పథకం ద్వారా లభించే ప్రోత్సాహక మొత్తం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
ఈ పథకం ద్వారా యువతలో ఉపాధిని పెంచడం కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందడానికి ఈ పథకం ఊతమిస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. రానున్న రెండేళ్లలో ఈ పథకం ద్వారా 3.5 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలన్న లక్ష్యంతో ఉంది. అంతే కాకుండా కంపెనీలు కొత్త ఉద్యోగులకు అవకాశాలు కల్పించడాన్ని ప్రోత్సహించేలా ఈ పథకం రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.






















