సోనియా గాంధీ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా, ఎలా ఉన్నారంటూ పలకరింపు
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ సోనియా గాంధీ ఆరోగ్యంపై ఆరా తీశారు.
PM Modi:
ముచ్చటించిన మోదీ, సోనియా గాంధీ..
ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ పార్లమెంట్ ఛాంబర్‌లో కాసేపు ముచ్చటించారు. ఈ సమయంలోనే మోదీ సోనియా గాంధీని కుశల ప్రశ్నలు అడిగారు. "ఆరోగ్యం ఎలా ఉంది" అని ఆరా తీశారు. ఇటీవలే బెంగళూరులో విపక్షాల భేటీ జరిగింది. అది ముగించుకుని ఢిల్లీకి వస్తుండగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల భోపాల్‌లో అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. దీనిపైనే ప్రధాని మోదీ ఆరా తీశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలు కాకముందే ఛాంబర్‌లో ప్రధాని మోదీ సోనియాని పలకరించారు. మిగతా పార్టీల నేతల్నీ కలిసి గ్రీట్ చేశారు. ఆ తరవాత పార్లమెంట్‌లో కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. మణిపూర్ వైరల్ వీడియోపై నిరసన వ్యక్తం చేశారు. దీనిపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. సమావేశాలు మొదలు కాకముందు ప్రధాని నరేంద్ర మోదీ ఈ వీడియోపై స్పందించారు. ఇది దేశ ప్రజలందరికీ సిగ్గుచేటు అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిందితులెవరైనా వదిలి పెట్టమని, కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. అయితే...ప్రధాని మోదీ సోనియాను పలకరించిన సమయంలోనే మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. సాధారణంగా పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యే ముందు నేతలందరూ ఇలా పలకరించుకోవడం ఆనవాయితీ. అప్పుడే సోనియాతో కాసేపు మాట్లాడారు మోదీ.
ఇదీ జరిగింది..
బెంగళూరులో విపక్ష పార్టీల కీలక సమావేశాన్ని ముగించుకుని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా కొందరు నేతలు ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వీరు ప్రయాణిస్తున్న స్పెషల్ ఫ్లైట్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సోనియా, రాహుల్ ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు అధికారులు చెప్పారు. వాతావరణం సరిగా లేకపోవడంతో భోపాల్‌లోని రాజాభోజ్ విమానాశ్రయంలో వీరు ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు సైతం ప్రచారం జరుగుతోంది. భోపాల్ ఎయిర్ పోర్ట్ నుంచి మరో విమానంలో సోనియా గాంధీ, రాహుల్ ఢిల్లీకి వచ్చారు.
పార్లమెంట్‌లో గందరగోళం..
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. మొత్తం పార్లమెంట్‌ని కుదిపేసింది. ఇంత జరుగుతున్నా కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విపక్షాలు ఆందోళనకు దిగాయి. మొదలైన కాసేపటికే రెండు సభలూ వాయిదా వేయాల్సి వచ్చింది. విపక్షాల ఆందోళనల మధ్య సభ కాసేపు కూడా సజావుగా సాగలేదు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించినప్పటికీ ప్రతిపక్ష నేతలు మాత్రం నిరసనలు ఆపలేదు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలన్న కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. అక్కడి పరిస్థితులు అదుపులోకి తీసుకురావాలంటే ఇదే మార్గం అని తేల్చి చెబుతున్నారు. అంతే కాదు. ముఖ్యమంత్రి బైరెన్ సింగ్‌ని ఆ పదవి నుంచి తొలగించాలనీ డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Manipur Violence: నా గుండె రగిలిపోతోంది, ఎవరినీ వదిలిపెట్టం - మణిపూర్ హింసపై ప్రధాని మోదీ