PM Kisan Nidhi Yojana: రైతులకు గుడ్‌న్యూస్! అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు - విడుదల చేసిన మోదీ
PM Modi News: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ 17వ ఇన్‌స్టాల్ మెంట్‌ను ప్రధాని మోదీ విడుదల చేశారు. వరుసగా మూడోసారి ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక ఈ డబ్బును జమ చేశారు.
PM Kisan Funds: కేంద్ర ప్రభుత్వ పథకం అయిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను నేడు (జూన్ 18) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. దేశంలోని కోట్లాది మంది రైతుల లబ్ధిదారుల ఖాతాల్లోకి నరేంద్ర మోదీ బదిలీ చేశారు. ఈసారి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ఈ 17వ ఇన్‌స్టాల్ మెంట్‌ను విడుదల చేశారు. వరుసగా మూడోసారి ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక ఈ 17వ వాయిదాను విడుదల చేశారు.
ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది నేరుగా రైతులకు ఆర్థిక సాయం చేసే ప్రపంచంలోనే అతి పెద్ద పథకం అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం రూ.6 వేల ఆర్థిక సహాయం అందజేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సొమ్మును రైతు సోదరులు తమ వ్యవసాయానికి వాడుతున్నారు. దాదాపు 9.26 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ప్రధాని మోదీ విడతల వారీగా రూ.20 వేల కోట్లును విడుదల చేశారు. 16వ విడతను ఫిబ్రవరి 28న ప్రధాని మోదీ విడుదల చేశారు. ప్రతి 4 నెలలకు ఓసారి పీఎం కిసాన్ నిధి వాయిదాలు విడుదలవుతున్నాయి.
2019లో తొలిసారిగా పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏడాదికి రూ.6 వేల చొప్పున ప్రతి నాలుగు నెలలకు ఒకసారి డబ్బులను రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమచేస్తోంది. ఇప్పటి వరకూ రూ.3.04 లక్షల కోట్ల నిధులు దాదాపు 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి వెళ్లాయి.
ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రయోజనాలను పొందడం కోసం, రైతులు ఈ-కేవైసీని చేయించుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు ఈ వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు.
రైతులు PM-కిసాన్ అధికారిక పోర్టల్‌కి లాగిన్ చేయడానికి pmkisan.gov.inకి వెళ్లాల్సి ఉంది.
తర్వాత కిసాన్ హోమ్ పేజీలో 'కిసాన్ కార్నర్' విభాగంలోకి వెళ్లాలి.
ఇప్పుడు ఓ కొత్త పేజీలో 'బెనిఫిషియరీ స్టేటస్' పైన క్లిక్ చేయాలి.
దీని తర్వాత అభ్యర్థి అతని/ఆమె ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్ వంటివి వివరాలను, అక్కడ అవసరమైన మేరకు నమోదు చేయాలి.
తర్వాత లబ్దిదారుడు 'గెట్ రిపోర్ట్'పై క్లిక్ చేయాలి.
దీని తర్వాత రైతు దరఖాస్తు, పేమెంట్ స్టేటస్ కనిపిస్తుంది.
పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబరు 155261 / 011-24300606