Blackout In Border: డ్రోన్ దాడులకు పాకిస్తాన్ విఫల ప్రయత్నం- తిప్పికొట్టిన భారత్ -సరిహద్దుల్లో హైఅలర్ట్
Blackout In Border:రాజస్థాన్‌లోని జైసల్మేర్, బాడ్మేడ్ జిల్లాల్లో డ్రోన్ దాడికి పాకిస్తాన్ విఫలయత్నం చేసింది. మిగతా సరిహద్దు ప్రాంతాల్లో కూడా అదే కుట్రలకు పాల్పడుతోంది.

Blackout In Border: ఆపరేషన్ సిందూర్‌తో కళ్లుతాగిన కోతిలా మారిపోయింది పాకిస్థాన్. తమ ఆధీనంలో ఉన్న ఉగ్ర స్థావరాలను భారత్ పేల్చేసిందన్న దుగ్ధతో బోర్డర్‌లో అలజడి సృష్టించేందుకు యత్నిస్తోంది. ప్రశాంతంగా ఉన్న ప్రదేశాల్లో ఏదో చేద్దామని కుటిలయత్నాలు చేస్తోంది. కానీ ఇలాంటి కుయుక్తులు ముందే గమనించిన భారత్ ఆర్మీ... ఉగ్రదేశ చర్యలను అడ్డుకుంటోంది. సమర్థంగా తిప్పికొడుతోంది. ప్రజల ప్రాణాలకు ఎలాంటి నష్టం లేకుండా ఉండేందుకు భారత్ ఆర్మీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది ఆర్మీ. పాకిస్థాన్‌కు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో బ్లాకౌట్ ప్రకటించింది. విద్యుత్ సరఫరా నిలిపేసింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించినట్టు స్థానికులు చెబుతున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా జిల్లా మొత్తం పూర్తిగా బ్లాక్‌అవుట్ చేశారు. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు.
రాజస్థాన్లో బ్లాక్ అవుట్
రాజస్థాన్‌లో బ్లాక్‌అవుట్ ప్రారంభమైంది. ఈ బ్లాక్‌అవుట్ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ఉంటుంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్, బాడ్మెడ్, శ్రీ గంగానగర్ జిల్లాల్లో బ్లాక్‌అవుట్ ఉంటుంది. జైసల్మేర్‌లో పాకిస్తాన్ డ్రోన్ దాడికి విఫలమైన ప్రయత్నం చేసింది. అయితే, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
బాడ్మెడ్ లో వైమానిక దాడుల హెచ్చరికతో సైరన్ వార్నింగ్‌లు మోగిస్తున్నారు. బార్మెర్ అంతటా పూర్తిగా బ్లాక్‌అవుట్ చేశారు. వరుసగా మూడోసారి ప్రమాద సైరన్ మోగించారు. సైరన్‌లు నిరంతరం ప్రతిధ్వనిస్తున్నాయి. పోలీసులు రోడ్లపై మోహరించారు. ప్రజలు ఇంటి లోపలే ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ టీనా దాబి రెడ్ అలర్ట్ జారీ చేశారు. పౌరులు తమ ఇళ్లలోనే ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
జోధ్‌పూర్‌ను కూడా బ్లాక్‌అవుట్ చేశారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ అగర్వాల్ జిల్లా అంతటా వెంటనే బ్లాక్‌అవుట్ కోసం సూచనలు జారీ చేశారు. సరిహద్దు ఉద్రిక్తతలు, వైమానిక దాడుల ముప్పులకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో అప్రమత్తత స్థాయి పెంచినట్టు అధికారులు తెలిపారు.
పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్ దాడుల దృష్ట్యా, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం సీఎం నివాసంలో జరుగుతోంది. సరిహద్దు జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయి. మూడు జిల్లాల్లోనూ రాత్రి 9 గంటలకు ముందే బ్లాక్‌అవుట్ పూర్తైంది. నేడు బ్లాక్‌అవుట్ మొదటి రోజు . పౌరులందరూ దీనికి సహకరించాలని అభ్యర్థించారు. వారి కోసం ఒక సలహా కూడా జారీ చేసింది ప్రభుత్వం. రైల్వే స్టేషన్, ప్రధాన మార్కెట్, జిల్లా కలెక్టరేట్ సహా నగరంలోని డజను చోట్ల సైరన్ మోగింది.
జమ్ముకశ్మీర్ బ్లాక్ అవుట్
గురువారం సాయంత్రం జమ్మూ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లు దాడికి విఫలయత్నం చేసిన కొద్దిసేపటికే జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయంలో బ్లాక్‌అవుట్ జరిగినట్లు సమాచారం.
గురువారం సాయంత్రం జమ్మూలో క్షిపణులు, డ్రోన్‌లతో దాడి చేసేందుకు యత్నించింది పాకిస్థాన్. దీంతో ముందు జాగ్రత్త ప్రభుత్వం పూర్తిగా బ్లాక్‌అవుట్ చేసింది. విమానాశ్రయం పరిసరాల్లో రెండు శక్తివంతమైన పేలుళ్ల శబ్దాలు విన్న వెంటనే జమ్మూ చీకటిలో మునిగిపోయింది. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ప్రతిఘటన చర్యలు ప్రారంభించినట్టు, పాకిస్తానీ డ్రోన్‌లను భారత యాంటీ-డ్రోన్ వ్యవస్థ కూల్చివేసిందని అధికారులు తెలిపారు. కొంతమంది ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, విమానాశ్రయం వెలుపల ఒక డ్రోన్ పడిపోవడం కనిపించిందన్నారు.
పశ్చిమ సరిహద్దులో అనేక ప్రదేశాలలో శత్రు డ్రోన్‌లను చూసినట్లు రక్షణ అధికారులు తెలిపారు. భారత వైమానిక రక్షణ వ్యవస్థలు డ్రోన్‌లను సమర్థవంతంగా తిప్పికొడుతున్నామని అధికారులు తెలిపారు.





















