(Source: ECI/ABP News/ABP Majha)
One Nation One Election: వన్ నేషన్- వన్ ఎలక్షన్ సహా జనగణనపై కీలక అప్‌డేట్ ఇచ్చిన కేంద్రం- కులగణన లేనట్టేనా!
National Census : దేశవ్యాప్తంగా జనాభా లెక్కింపునకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. మరోవైపు జమిలీ ఎన్నికల అంశంపై కూడా సీరియస్‌గా మోదీ సర్కారు దృష్టి పెట్టింది.
Modi Government: దేశవ్యాప్తంగా జనగణనకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. పదేళ్లకు ఒకసారి కేంద్రం ఈ సెన్సస్ లెక్కలు తీసుకోవడం పరిపాటి కాగా.. ఈ మేరకు ఆదివారం నుంచి సన్నాహాలు మొదలు పెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి. అయితే కులగణనకు సంబంధించి ఏ విధమైన స్పష్టత ఇంత వరకూ రాలేదు. వాస్తవానికి జనగణన 2021 ఏప్రిల్ 1 నే మొదలూ కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు కూడా ఈ జనగణన చేపట్టడం అవసరం అని అధికారులు వివరించారు. అయితే కులగణనకు సంబంధించిన కాలమ్‌ను చేర్చడంపై ఏ విధమైన స్పష్టతా ఇంత వరకూ రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కొంత కాలంగా దేశంలోని అనేక రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై అమెరికా పర్యటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులగణన చేపట్టడం సహా ఓబీసీలకూ 50 శాతంగా ఉన్న క్యాప్‌ను తాము అధికారంలోకి రాగానే ఎత్తేస్తామని చెప్పారు. ఈ సారి చేపట్టబోయే జనగణనలో దేశ ప్రజలు స్వయంగా తమ వివరాలు నమోదు చేసే అవకాశాన్ని కుడా సర్కారు కల్పిస్తోంది. ఈ మేరకు పోర్టల్‌ను కూడా సిద్ధం చేసున్న కేంద్రం.. డిజిటల్ సెన్స్‌స్ విధానాన్ని తొలిసారి అందుబాటులోకి తెస్తోంది. నేషనల్ సెన్సన్‌లో భాగంగా.. సమగ్ర వివరాలు రాబట్టేందుకు రిజిస్ట్రార్ అండ్ సెన్సస్ అధికారులు 31 ప్రశ్నలను సిద్ధం చేస్తున్నారు. ఇంట్లో సెల్‌ఫోన్, టెలిఫోన్, స్మార్ట్‌ఫోన్, సైకిల్, మోటార్ సైకిల్, కార్ ఉన్నాయా అన్న ప్రశ్నలు కూడా ఉండనున్నాయి.
వన్ నేషన్- వన్ ఎలక్షన్ దిశగా సన్నాహాలు:
భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రామీస్‌లలో ఒకటైన వన్ నేషన్- వన్ ఎలక్షన్ దిశగానూ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు చర్యలు చేపడుతోంది. 2024 సార్వత్రికంలో సరిపడా నెంబర్లు సాధించడంలో కాస్త వెనుక పడిన బీజేపీ .. దానితో సంబంధం లేకుండా.. 2014నాటి ఎన్నికల హామీల్లో ఒకటైన ఒకేసారి దేశంలో ఎన్నికల హామీని ఇప్పుడు అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆయోధ్య రామమందిరం నిర్మాణం సహా ఆర్టికల్ 370 రద్దు వంటి అనేక హామీలను సమర్థంగా అమలు చేసి చూపించింది. ఈ సారి వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై దృష్టి పెట్టింది. ఈ మేరకు మాజీ ప్రెసిడెంట్ రామ్‌కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇచ్చిన నివేదికను నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న విధానంలో.. ఎన్నికలకు భారీగా ఖర్చు కావడం సహా ఆ సమయంలో ప్రజోపయోగ పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కోవింద్ కమిటీ స్పష్టం చేసింది.
ఈ విధానంలో మార్పు రావాలని ప్రధాని మోదీ కూడా అనేక సార్లు వ్యాఖ్యానించారు. ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా మాట్లాడిన మోదీ.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు అత్యావశ్యం అని పునరుద్ఘాటించారు. ఈ ఐదు సంవత్సరాల్లోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని అమల్లోకి తేవాలని మోదీ సర్కారు భావిస్తుండగా.. దీనికి అన్ని పక్షాల మద్దతు కూడగడుతోంది. అయితే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా అనేక రాజకీయ పక్షాలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
Also Read: దేశంలో 7 కొత్త వందేభారత్‌లు, జెండా ఊపి ప్రారంభించిన మోదీ