NBDA News: I.N.D.I.A కూటమి కీలక నిర్ణయం - ఇది ప్రమాదకరమని బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ ఆందోళన
కొంతమంది జర్నలిస్టులు లేదా యాంకర్ల కార్యక్రమాలకు తమ ప్రతినిధులను పంపబోమని I.N.D.I.A. కూటమికి చెందిన మీడియా కమిటీ తెలిపిందని ఎన్‌బీడీఏ ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రతిపక్ష కూటమి 'I.N.D.I.A.'లోని రాజకీయ పార్టీలు గురువారం (సెప్టెంబర్ 14) కొన్ని వార్తా ఛానెళ్లలోని కొందరు యాంకర్లు లేదా జర్నలిస్టుల షోలను బహిష్కరించాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్ట్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (NBDA) తప్పుబట్టింది. కొంతమంది జర్నలిస్టులు లేదా యాంకర్ల కార్యక్రమాలకు తమ ప్రతినిధులను పంపబోమని I.N.D.I.A. కూటమికి చెందిన మీడియా కమిటీ తెలిపిందని ఎన్‌బీడీఏ ఒక ప్రకటన విడుదల చేసింది. I.N.D.I.A. కూటమి తీసుకున్న నిర్ణయంపై ఎన్‌బీడీఏ అసహనం వ్యక్తం చేయడమే కాకుండా, ఈ నిర్ణయం ఒక ప్రమాదకరమైనది ఉదాహరించింది.
ప్రజాస్వామ్య ధర్మానికి వ్యతిరేకం - ఎన్‌బీడీఏ
దేశంలోని ప్రముఖ టీవీల్లో పని చేస్తున్న జర్నలిస్టు ప్రముఖుల షోలలో పాల్గొనకుండా ప్రతిపక్ష కూటమి తమ ప్రతినిధులకు ఆదేశాలు ఇవ్వడం ప్రజాస్వామ్య ధర్మానికి విరుద్ధం అని ఎన్‌బీడీఏ ప్రకటనలో వెల్లడించింది. ఈ పద్ధతి అసహనానికి ప్రతీక అని, ఇది మీడియా స్వేచ్ఛను హరించడమేనని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఎమర్జెన్సీ తరహాలో పరిస్థితి
దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో పరిస్థితులను ఎన్‌బీడీఏ ప్రస్తావిస్తూ.. కొంతమంది జర్నలిస్టులు/యాంకర్లను బహిష్కరించడం దేశాన్ని ఆ ఎమర్జెన్సీ కాలానికి తీసుకువెళుతుందని పేర్కొంది. మీడియా నోటికి తాళం వేసి స్వతంత్ర గొంతులు వినిపించకుండా చేయడం సరికాదని హితవు పలికింది.
నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందే
ఇలాంటి నిర్ణయం జర్నలిస్టులను బెదిరించడంతోపాటు మీడియా వాక్ స్వాతంత్య్రాన్ని, భావవ్యక్తీకరణను అణచివేయడమేనని ఎన్‌బీడీఏ అభిప్రాయపడింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష కూటమి I.N.D.I.A. ని ఎన్‌బీడీఏ కోరింది.
ప్రతిపక్ష కూటమి నేతల ఆదేశాలు ఇవీ..
కాంగ్రెస్ మీడియా విభాగం చీఫ్, ప్రతిపక్ష కూటమి మీడియా కమిటీ మెంబర్ పవన్ ఖేడా గురువారం ఓ లిస్టును విడుదల చేస్తూ.. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి కొన్ని ఛానెల్స్‌లో విద్వేషపూరిత ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారని అన్నారు. తాము ద్వేషానికి మరింత ఆజ్యం పోసేలా మారబోమని, ద్వేష రహిత భారతదేశమే తమ లక్ష్యం అని చెప్పారు. ఇష్టం లేకపోయినప్పటికీ కొందరు యాంకర్లు లేదా జర్నలిస్టులు నిర్వహించే షోలు, కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాము తమ నాయకులపై కొందరు జర్నలిస్టులు చేసే అనియంత్రిత వ్యాఖ్యలు, నకిలీ వార్తలు మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని అన్నారు. ఇకపై పోరాడుతూనే ఉంటామని చెప్పారు.