National Youth Day 2024 Special: యువకులు అంటే ఎవరు? దేశంలో ఎంత మంది యువత ఉన్నారో తెలుసా?
Youth Statistic In India: యువత కోసం స్వామి వివేకానంద ఎంతో తపించారు. భారతదేశ భవిష్యత్తుని మార్చగలిగేది యువతేనని ఆయన బలంగా నమ్మేవారు. యువత ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్లాలని ఆయన అనేవారు.
Youth Population In India: యువత కోసం స్వామి వివేకానంద ఎంతో తపించారు. భారతదేశ భవిష్యత్తుని మార్చగలిగేది యువతేనని ఆయన బలంగా నమ్మేవారు. యువత ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్లాలని ఆయన అనేవారు. అందుకే ‘డబ్బు లేని వాడు కాదు జీవితంలో ఒక ఆశయం అంటూ లేని వాడు అసలైన పేదవాడు’ అని అనేవారు. ఆయన ఎప్పుడు యువతను ‘గొర్రెలలా కాదు సింహంలా ధైరంగా బ్రతకండి’ దేనికి భయపడవద్దని చెప్పేవారు. ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే ఈ దేశం స్వరూపాన్నే మార్చేస్తాను’ అని స్వామీజీ తరచూ అనేవారు.
వివేకానంద తన ప్రసంగాలతో, సూక్తులతో పుస్తకాలతో, యువతరాన్ని ఉత్తేజపరిచి, దిశానిర్ధేశం చేశారు. దేశంలో యువత మనసులో స్ఫూర్తి నింపినవారిలో వివేకానంద అంతటి వారు మరొకరు లేరు. ఆయన గొప్ప తననాన్న స్మరించుకుంటూ యావత్ భారత దేశం స్వామి వివేకానంద జయంతి జనవరి 12ను దేశం మొత్తం జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1985 నుంచి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు.
యువత అంటే ఎవరు?
భారతదేశాన్ని యువత దేశం అంటారు. ప్రపంచంలోనే అత్యధిక యువత జనాభా ఉన్న దేశం ఇండియానే. అయితే యువత అంటే ఎవరు? దానికి నిర్వచనం ఏమిటి? భారతదేశంలో ఎంత మంది యువత ఉన్నారు? సంవత్సరాలుగా ఈ జనాభా ఎలా పెరిగింది? జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈ వివరాలు తెలుసుకోండి..
ఒక వ్యక్తి బాల్యం, యుక్తవయస్సు మధ్య సమయాన్ని తరచుగా కౌమారదశగా పిలుస్తారు. అయితే, ఒక వ్యక్తి ఎంత వయస్సులో యువకుడిగా పరిగణించబడాలనే దానిపై ఖచ్చితమైన ప్రమాణం లేదు. సమయం, ప్రదేశం, పరిస్థితిని బట్టి యువకుడి నిర్వచనం మారుతోంది. ఐక్యరాజ్యసమితి నిర్వచనం ప్రకారం 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్కులను యువతగా పరిగణిస్తారు. ఐక్యరాజ్యసమితిలోని అనేక సభ్య దేశాలలో 18 -30 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిని యువకుడిగా పరిగణిస్తారు. యూత్ హాబిటాట్‌లో 15-32 ఏళ్ల వారు యువతగా పరిగణించబడతారు. ఆఫ్రికాలో 15-35 ఏళ్లలోపు వారని యువకుడిగా పరిగణిస్తారు.
మరి ఇండియాలో యువత ఎవరు?
మన దేశంలో.. జాతీయ యువజన విధానం 2014 ప్రకారం, 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిని యువకుడిగా పరిగణిస్తారు. అయితే అంతకుముందు జాతీయ యువజన విధానం-2003లో 13 - 35 ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తిని యువకుడిగా పరిగణించేవారు. సబ్ సహారా ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలలో 12 నుంచి 30 లేదా 35 ఏళ్ల వ్యక్తిని యువకుడిగా పరిగణిస్తారు. నైజీరియాలో 18 - 35 ఏళ్లు వయస్సు గల వారందరిని యువతగా భావిస్తారు. వియత్నాంలో 15 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిని యువకులుగా పరిగణిస్తారు. బ్రెజిల్‌లో 15 నుంచి 29 ఏళ్ల వ్యక్తులను యువతగా లెక్కేస్తారు.
భారత్‌లో ఎంత మంది యువత ఉన్నారు?
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) ప్రకారం ప్రపంచంలోని ప్రతి ఆరుగురిలో ఒకరు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఉన్నారు. ప్రపంచంలోని యువత జనాభా 120 కోట్లకు పైగా ఉంది. ఇది మొత్తం జనాభాలో 16 శాతం. వీరిలో ఎక్కువ మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నివసిస్తున్నారు. ప్రపంచంలోనే భారత్ అత్యధిక యువజన జనాభాను కలిగి ఉంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, దేశ జనాభాలో 27.2 శాతం మంది 15 నుంచి 29 ఏళ్లలోపు వారు ఉన్నారు. దేశ జనాభాలో యువత సంఖ్య 37.14 కోట్లు. 2036 నాటికి, ఈ సంఖ్య 22.7%కు (34.5 కోట్లు) తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.
గత కొన్నేళ్లుగా దేశంలో యువత జనాభా పెరిగింది. 1991లో దేశంలో యువత జనాభా 22.27 కోట్లు, అప్పటి మొత్తం జనాభాలో 26.6 శాతంగా ఉండేది. 2001లో ఈ సంఖ్య 27.34 కోట్లకు పెరిగింది. మొత్తం జనాభాలో వాటా 26.6% మాత్రమే. 2011లో యువత జనాభా 33.33 కోట్లకు పెరిగింది. మొత్తం జనాభాలో యువత 27.5 శాతం ఉన్నారు. 2016లో ఈ సంఖ్య 35.96 కోట్లుకు పెరిగింది. దేశం మొత్తం జనాభాలో యువత వాటా 27.9 శాతంగా ఉంది.