G20 Summit: మోదీ- బైడెన్ ద్వైపాక్షిక భేటీ, G20 సదస్సుకు ఒక్క రోజు ముందు చర్చలు
G20 Summit: జీ20 సదస్సుకు ఒక్కరోజు ముందు మోదీ-బైడెన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.
G20 Summit: ప్రతిష్టాత్మకమైన జీ20 సదస్సు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ శిఖరాగ్ర సదస్సు కోసం భారత రాజధాని ఢిల్లీలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ జీ20 సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు జీ20 సభ్య దేశాల అగ్ర నేతలతో పాటు ఇతర దేశాల అధినేతలు కూడా హాజరు కానున్నారు. అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జీ20 సదస్సుకు రెండ్రోజుల ముందుగానే భారత్ కు రానున్న విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 8వ తేదీన అంటే జీ20 సదస్సుకు ఒక్క రోజు ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుందని వైట్ హౌజ్ ప్రకటించింది.
జీ20 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. సెప్టెంబర్ 7వ తేదీన ఢిల్లీకి బయలుదేరతారని వైట్ హౌజ్ ప్రకటించింది. శుక్రవారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక భేటీలో పాల్గొంటారని వెల్లడించింది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ20 సదస్సులో జో బైడెన్ పాల్గొంటారంది. వాతావరణ మార్పులు, క్లీన్ ఎనర్జీ వంటి అంశాలతో పాటు ఉక్రెయిన్ సంక్షోభం వంటి అంతర్జాతీయ సమస్యలపైనా జీ20 సభ్య దేశాల ప్రతినిధులతో జో బైడెన్ చర్చిస్తారని శ్వేససౌధం వెల్లడించింది. జీ20 సదస్సుకు అధ్యక్షత వహించడంపై ప్రధాని నరేంద్ర మోదీని బైడెన్ అభినందిస్తారని పేర్కొంది. ఈ మేరకు వైట్ హౌజ్ అధ్యక్షుడు జో బైడెన్ షెడ్యూల్ ను ప్రకటించింది. జీ20 శిఖరాగ్ర సదస్సు అనంతరం బైడెన్.. వియత్నాం పర్యటనకు వెళ్తారని తెలిపింది.
జీ20 సదస్సుకు తాను రాలేకపోతున్నానని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే సమాచారం ఇచ్చారు. "రాలేకపోతున్నాను, దయచేసి ఏమీ అనుకోవద్దు" అంటూ ఇప్పటికే పుతిన్ ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల G20 సమ్మిట్‌కి హాజరు కాలేకపోతున్నానని వెల్లడించారు పుతిన్. రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. రష్యా నిర్ణయాన్ని అంగీకరిస్తూ పుతిన్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు వెల్లడించారు. G20 కార్యక్రమాలకు రష్యా మద్దతు కావాలని కోరారు. భారత్- రష్యా మధ్య ప్రత్యేకమైన, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యం అభివృద్ధి చెందుతోందని క్రెమ్లిన్ అభిప్రాయపడింది. ఆ తరవాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే విషయాన్ని Reuters వెల్లడించింది. జిన్‌పింగ్‌కి బదులుగా ఇద్దరు ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలున్నాయి. అయితే..దీనిపై భారత్, చైనా విదేశాంగ శాఖల ప్రతినిధులు మాత్రం స్పందించలేదు.
సెప్టెంబరు 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్‌కు 29 మంది దేశాధినేతలతో పాటు యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికారులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు కానున్నారు. ఈ సమ్మిట్ ముగింపులో G20 లీడర్స్ డిక్లరేషన్‌ని ఆమోదిస్తారు. సెప్టెంబరు 7 రాత్రి నుంచి సెప్టెంబరు 10 వరకూ ఢిల్లీలో ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆంక్షల్లో భాగంగా న్యూఢిల్లీ ప్రాంతంలో నివాసం ఉండేవారు ఆ పరిధిలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. కానీ, చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చిన వారు లేదా టూరిస్టులు న్యూఢిల్లీ పరిధిలోకి రావాలంటే హోటల్ బుకింగ్స్ కి సంబంధించిన ప్రూఫ్ చూపించాలని వివరించారు. అంతేకాక, ప్రజలు సెప్టెంబరు 8, 9, 10 తేదీల్లో మార్కెట్లకు, దుకాణాలకు వెళ్లొద్దని సూచించారు.