(Source: ECI/ABP News/ABP Majha)
Raipur Gang Rape: ఛత్తీస్‌గఢ్‌లో అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం, బీజేపీ నేత కొడుకు సహా 10 మంది అరెస్టు
Raipur Gang Rape: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం జరిగింది. బీజేపీ నేత కొడుకు సహా 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
Raipur Gang Rape: రక్షా బంధన్ వేళ ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. అన్నా చెల్లెళ్ల సోదరభావం, ప్రేమానురాగాలకు ఉదాహరణగా నిలిచే రాఖీ పౌర్ణమి వేళ ఇద్దర అక్కాచెల్లెళ్లపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఛత్తీస్ గఢ్‌లోని రాయ్‌పూర్‌లో రక్షా బంధన్ ను జరుపుకుని తమ కజిన్ తో పాటు తిరిగి వస్తున్న క్రమంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై కొందరు దుండగులు దాడి చేశారు. దాదాపు 10 మంది ఇద్దరు యువతులను అత్యంత పాశవికంగా లైంగిక దాడి చేశారు. ఈ కేసులో పోలీసులు 10 మందిని అరెస్టు చేశారు. కాగా.. నిందితుల్లో బీజేపీ నేత కుమారుడు కూడా ఉండటం గమనార్హం.
ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని మందిర్ హసౌద్ ప్రాంతంలో రిమ్స్ మెడికల్ కాలేజీ సమీపంలో ఈ దారుణం జరిగింది. సోదరుడికి రాఖీ కట్టేందుకు మహాసముంద్ జిల్లాకు వెళ్లి తిరిగి తమ కజిన్ తో పాటు వస్తుండగా.. దాదాపు 9 నుంచి 10 మంది దుండగులు వారిని మార్గమధ్యలో అడ్డుకున్నారు. వారిపై అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి దిగారు. కజిన్ ను తీవ్రంగా కొట్టారు. తర్వాత అంతా కలిసి ఆ ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరు బాలికలతో పాటు వారితో పాటు వచ్చిన వ్యక్తిని కూడా తీవ్రమైన శారీరక హింసకు గురైనట్లు పోలీసులు తేల్చారు.
సామూహిక అత్యాచారం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మొత్తం 10 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్లో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన అనుమానితుల్లో ఒకరైన పూనమ్ ఠాకూర్.. ఇటీవల ఆగస్టు 2023లో బెయిల్ పై విడుదలైనట్లు తేల్చారు. పూనమ్ ఠాకూర్ స్థానిక బీజేపీ నాయకుడు లక్ష్మీ నారాయణ్ సింక్ కుమారుడిగా గుర్తించారు. బాధితుల్లో ఒకరు మైనర్ అని.. ఒకరి వయస్సు 19 సంవత్సరాలు కాగా, మరొకరి వయస్సు 16 సంవత్సరాలు అని పోలీసులు తెలిపారు.
'బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ముగ్గురు నిందితులు వారి నుంచి నగదును, మొబైల్ ఫోన్లను దోచుకున్నారు. మిగిలిన ఏడుగురు నిందితులు నాలుగు ద్విచక్రవాహనాలపై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులు ఇద్దరు అక్కాచెల్లెళ్లను ప్రధాన రహదారికి దూరంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వారి కజిన్ పై దాడి చేసి కత్తితో బెదిరించారు' అని రాయ్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (SSP) ప్రశాంత్ అగర్వాల్ వెల్లడించారు.
అత్యాచారం తర్వాత నిందితులు ఇద్దరు అక్కాచెల్లెళ్లను అక్కడే వదిలి పారిపోయారని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (ASP)(రూరల్), రాయ్ పూర్ నీరజ్ చంద్రకర్ తెలిపారు. నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ కజిన్, సామూహిక అత్యాచారానికి గురైన ఆ అక్కాచెల్లెల్లు అదే స్థితిలో స్థానిక పోలీసు పెట్రోలింగ్ విభాగానికి చేరుకున్నట్లు వెల్లడించారు. అక్కడి నుంచి వారిని పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చినట్లు చెప్పారు.
వారి ఫిర్యాదు ప్రకారం వెంటనే కేసు నమోదు చేసుకుని పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. సాంకేతిక, ఇతర ఆధారాలతో మొత్తం 10 మంది నిందితులను గుర్తించి ఉదయం వరకు నాటికి అరెస్టు చేసినట్లు ఏఎస్పీ నీరజ్ చంద్రకర్ వెల్లడించారు. నిందితులపై 376డి (గ్యాంగ్ రేప్), 376డిఏ( 16 ఏళ్ల లోపు యువతులపై సామూహిక అత్యాచారం), భారతీయ శిక్షాస్పృతిలోని ఇతర సెక్షన్లు, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ(పోక్సో) చట్టంలోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న పూనమ్ ఠాకూర్ అనే వ్యక్తి.. స్థానిక బీజేపీ నాయకుడి కుమారుడిగా పోలీసులు గుర్తించారు. మందిర్ హసౌద్ మండల బీజేపీ ఉపాధ్యక్షుడు లక్ష్మీ నారాయణ సింగ్ కుమారుడిగా గుర్తించారు. బీజేపీ నేత కుమారుడిపై మందిర్ హసౌద్, అరాంగ్ పోలీసు స్టేషన్లలో గతంలో ఐదు కేసులు నమోదు అయ్యాయి. అతడు 2019, 2022 సంవత్సరాల్లో అత్యాచారం ఆరోపణలతో అరెస్టు అయినట్లు గుర్తించారు. గత నెలలోనే బెయిల్ పై విడుదలైనట్లు స్పష్టం చేశారు.