MLAs Assets: దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తుల లెక్కలు బయట పెట్టిన రిపోర్ట్, టాప్‌లో బీజేపీ లీడర్స్
MLAs Assets: దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తుల లెక్కల్ని ADR నివేదిక వెల్లడించింది.
MLAs Assets:
ఆస్తుల విలువపై ADR రిపోర్ట్..
దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు బయట పెట్టింది Association for Democratic Reforms (ADR) రిపోర్ట్. National Election Watch (NEW) కూడా ఈ వివరాలు సేకరించింది. మొత్తం 28 రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని శాసన సభ్యుల ఆస్తుల చిట్టా వెల్లడించాయి ADR-NEW సంస్థలు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘానికి దాఖలు చేసిన అఫిడవిట్‌ల ఆధారంగా ఈ వివరాలు వెలువరించాయి. ఈ రిపోర్ట్ ప్రకారం..దేశవ్యాప్తంగా 4001 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరి ఆస్తుల విలువ రూ.54,545 కోట్లు. నాగాలాండ్, మిజోరం, సిక్కిం రాష్ట్రాల ఏడాది బడ్జెట్‌ల కంటే ఇది ఎక్కువ అని నివేదిక స్పష్టం చేసింది. 1356 మంది బీజేపీ ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 16,234 కోట్లు, 719 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆస్తులను రూ. 15,798 కోట్లుగా లెక్క తేల్చింది. రాష్ట్రాల వారీగా చూస్తే..తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో 146 మంది వైసీపీ ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 3,379 కోట్లు. తెలంగాణలోని 118 మంది ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల విలువ రూ. 1,601 కోట్లు. ఈ జాబితాలో కర్ణాటక ఎమ్మెల్యేలు టాప్‌లో ఉన్నారు. ఆ రాష్ట్రంలోని 223 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ. 14,359 కోట్లుగా వెల్లడించింది ADR రిపోర్ట్. ఆ తరవాతి స్థానం మహారాష్ట్రదే. ఈ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.6,679 కోట్లుగా ఉంది. మూడో స్థానం ఆంధ్రప్రదేశ్‌దే. అందరి కన్నా తక్కువ ఆస్తులు ఉన్నది త్రిపుర ఎమ్మెల్యేలకే. వీళ్ల ఆస్తుల విలువ రూ.90 కోట్లు మాత్రమే. బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆస్తులే ఎక్కువగా ఉన్నట్టు ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది.
పార్టీల వారీగా ఎమ్మెల్యేల ఆస్తులు..
బీజేపీ (1356 మంది ఎమ్మెల్యేలు) - రూ. 16,234 కోట్లు
కాంగ్రెస్ (719 మంది ఎమ్మెల్యేలు) - రూ. 15,798 కోట్లు
వైఎస్సార్‌సీపీ (146 మంది ఎమ్మెల్యేలు) - రూ.3,379కోట్లు
డీఎమ్‌కే (131 మంది ఎమ్మెల్యేలు) - రూ.1,663 కోట్లు
ఆప్ (161 మంది) - రూ.1,642 కోట్లు
విరాళాల లెక్కలివి..
దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలకు సంబంధించిన వివరాల జాబితాను ఇటీవలే ADR విడుదల చేసింది. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో ఎక్కువ శాతం ఎలక్టోరల్ బాండ్ల రూపంలోనే వస్తున్నట్లు వెల్లడించింది. 2016-17 నుంచి 2021-22 మధ్య కాలంలో ఏడు జాతీయ పార్టీలు, ఇరవై నాలుగు ప్రాంతీయ పార్టీలకు 16,437 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చినట్లు తన నివేదికలో పేర్కొంది. అందులో రూ. 9,188 కోట్లు కేవలం ఎలక్టోరల్ బాండ్ల రూపంలోనే వచ్చినట్లు తెలిపింది. ఇతర జాతీయ పార్టీల కంటే బీజేపీకే ఎక్కువ విరాళాలు లభించినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదించింది. బీజేపీకి రూ. 10,122 కోట్లు, కాంగ్రెస్‌కు రూ. 1,547 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్‌కు రూ. 823 కోట్లు వచ్చినట్లు ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది. బీజేపీకి వచ్చిన విరాళాల్లో సగానికిపైగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఉండగా.. 32శాతం కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చాయి. మొత్తం విరాళాల్లో 80 శాతం జాతీయ పార్టీలకు రాగా, ప్రాంతీయ పార్టీలకు 19.75 శాతం విరాళాలు వచ్చినట్లు ఏడీఆర్ వెల్లడించింది.
Also Read: No-Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై 17 గంటల చర్చకు ఆమోదం, ప్రధాని మోదీ ఏం మాట్లాడతారు?