Mann Ki Baat: పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి యువత రాజకీయాల్లోకి రావాలి- మోదీ పిలుపు
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11గంటలకు ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని మోదీ పిలుపు నిచ్చారు.
![Mann Ki Baat: పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి యువత రాజకీయాల్లోకి రావాలి- మోదీ పిలుపు mann ki baat updates pm narendra modi s monthly radio broadcast episode 113 august edition Mann Ki Baat: పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి యువత రాజకీయాల్లోకి రావాలి- మోదీ పిలుపు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/22/42035c25c6aa806e0d1cf1e48fbec9d21724343190373708_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mann Ki Baat: 21వ శతాబ్దంలో భారత్‌లో ఎన్నో జరుగుతున్నాయని, ఇది అభివృద్ధి చెందిన భారత్‌కు పునాది పడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
యువత రాజకీయాల్లోకి రావాలి
రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని మోదీ పిలుపు నిచ్చారు. ఈ ఏడాది ఎర్రకోట నుంచి యువతకు రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించానని ప్రధాని మోదీ అన్నారు. తన ప్రకటనపై భారీ స్పందన వచ్చిందని, దీన్నిబట్టి మన యువత పెద్ద సంఖ్యలోనే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారో అర్థమవుతుందన్నారు. వారు సరైన అవకాశం, సరైన మార్గదర్శకత్వం కోసం చూస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
అభివృద్ధి చెందిన భారతే లక్ష్యం
స్వాతంత్య్ర పోరాట సమయంలో కూడా రాజకీయ నేపథ్యం లేని అనేక మంది, సమాజంలోని అన్ని వర్గాల వారు ముందుకు వచ్చారని మోదీ అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం వారు తమను తాము త్యాగం చేసుకున్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యాన్ని సాధించేందుకు ఈరోజు మనకు మరోసారి అదే స్ఫూర్తి కావాలని మోదీ సూచించారు. ‘ఈ ప్రచారానికి తప్పకుండా సహకరించాలని యువతకు నేను చెబుతాను. రాజకీయాలతో సంబంధం లేని యువత రాజకీయాల్లోకి వస్తే ప్రజాస్వామ్యం బలపడుతుంది’ అని మోదీ అన్నారు.
జాతీయ అంతరిక్ష దినోత్సవం గురించి మోదీ ఏం అన్నారంటే ?
జాతీయ అంతరిక్ష దినోత్సవం, చంద్రయాన్-3 గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 21వ శతాబ్దపు భారతదేశంలో చాలా విషయాలు జరుగుతున్నాయని, ఇది అభివృద్ధి చెందిన భారతదేశానికి పునాదిని బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఆగస్టు 23వ తేదీనే మనమందరం మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకున్నాం. గత సంవత్సరం ఈ రోజునే చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ భాగంలో శివ-శక్తి బిందువు వద్ద విజయవంతంగా ల్యాండ్ అయింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచిందన్నారు.
ఈ సందర్భంగా వివిధ స్పేస్ స్టార్టప్‌లలో పనిచేస్తున్న పలువురు యువ పారిశ్రామికవేత్తలతో మోదీ మాట్లాడి వారి కృషిని ప్రశంసించారు. దేశంలో పెరుగుతున్న అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను ఆయన ప్రశంసించారు. అంతరిక్ష రంగంలో వివిధ సంస్కరణల వల్ల దేశంలోని యువత ఎంతో ప్రయోజనం పొందారని ప్రధాని అన్నారు.
'మన్ కీ బాత్' గురించి..
రేడియోలో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమంలో ఇది 113వ ఎపిసోడ్. అంతకుముందు జూలై 28న 'మన్ కీ బాత్' 112వ ఎడిషన్ ప్రసారమైంది. అనంతరం పారిస్ ఒలింపిక్స్, మ్యాథ్స్ ఒలింపియాడ్, టైగర్ డే, అడవుల పరిరక్షణ, స్వాతంత్య్ర దినోత్సవం వంటి అంశాలపై ప్రధాని మోదీ ప్రసంగించారు. 22 భారతీయ భాషలు, 29 మాండలికాలతో పాటు, మన్ కీ బాత్ 11 విదేశీ భాషలలో కూడా ప్రసారం చేయబడుతుంది. వీటిలో ఫ్రెంచ్, చైనీస్, ఇండోనేషియన్, టిబెటన్, బర్మీస్, బలూచి, అరబిక్, పష్టు, పర్షియన్, డారి, స్వాహిలి ఉన్నాయి. 'మన్ కీ బాత్' ఆల్ ఇండియా రేడియో 500 కంటే ఎక్కువ స్టేషన్ల ద్వారా ప్రసారం అవుతుంది. 'మన్ కీ బాత్' మొదటి కార్యక్రమం 3 అక్టోబర్ 2014న ప్రసారం అయింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)