Manipur Viral Video: మణిపూర్ వైరల్ వీడియో కేసులో కీలక పరిణామం, FIR నమోదు చేసిన సీబీఐ
Manipur Viral Video: మణిపూర్ వైరల్ వీడియోకేసుని టేకప్ చేసిన CBI FIR నమోదు చేసింది.
Manipur Viral Video:
మణిపూర్ వైరల్ వీడియో కేసులో సీబీఐ FIR నమోదు చేసింది. రెండ్రోజుల క్రితమే సుప్రీంకోర్టులో కేంద్రం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇకపై ఈ కేసుని CBI విచారిస్తుందని అందులో పేర్కొంది. ఇప్పుడు అధికారికంగా FIR నమోదు చేసింది. ఈ నెల 27వ తేదీన కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అఫిడవిట్ సమర్పించింది. ఈ కేసుని సీబీఐ విచారిస్తుందని వెల్లడించింది. మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలను సహించేది లేదని తేల్చి చెప్పింది. వీలైనంత వేగంగా ఈ కేసుని విచారించేలా చూడాలని కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టుని విజ్ఞప్తి చేసింది. మణిపూర్‌లో కాకుండా వేరే రాష్ట్రానికి కేసుని బదిలీ చేసి విచారణ కొనసాగించాలని కోరింది. మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో ఇటీవలే వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం...ఈ కేసుని సుమోటోగా స్వీకరించింది. ఈ కేసుని 28వ తేదీనే విచారించాల్సి ఉన్నా...CJI అందుబాటులో లేకపోవడం వల్ల వాయిదా పడింది. అయితే...ఇప్పటికే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. మణిపూర్ ప్రభుత్వానికీ నోటీసులు పంపింది. వైరల్ వీడియో కేసులో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. ఇప్పటి వరకూ ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. INDIA కూటమికి చెందిన 21 మంది ఎంపీలు మణిపూర్ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలోనే CBI FIR నమోదు చేయడం ఆసక్తికరంగా మారింది.
Central Bureau of Investigation registers FIR in Manipur viral video case: CBI official pic.twitter.com/a1WdwYydyF
— ANI (@ANI) July 29, 2023
కేసు సీబీఐకి బదిలీ కావడంతో విచారణ త్వరగానే పూర్తవుతుందని నమ్ముతున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ విషయం మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది అయినప్పటికీ కూడా కేంద్రం తన శాయశక్తుల న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి కేంద్రం ఈ కేసు గురించి తెలుసుకుంటూనే ఉంటున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికీ ఇంకా హింసాకాండ జరుగుతూనే ఉండటంతో బాధితులకు ప్రభుత్వం ఏదైనా సహాయక చర్యలు చేపట్టి వెంటనే పరిస్థితులు చక్కదిద్దాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. వారికి జీవనోపాధి పొందే విధంగా తగిన సహాయం అందించాలని, వృత్తి పరమైన శిక్షణతోపాటు హింసల వల్ల నష్టపోయిన వారికి తగిన ఉద్యోగావకాశాలు కూడా కల్పించడానికి కృషి చేస్తున్నట్లు కేంద్రం సుప్రీంకి తెలిపింది. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి నిత్యావసరాలతోపాటు మందులు అదుబాలుటులో ఉండేలా అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్టు సుప్రీం కోర్టుకు కేంద్రం వివరించింది. ఎప్పుడైతే మణిపూర్ లో హింస మొదలైందో అప్పటి నుంచి సాయుధ పోలీసు బలగాలు రాష్ట్రంలో మోహరించినట్లు కేంద్రం తెలిపింది.
Also Read: పొరుగు రాష్ట్రాల్లో తల దాచుకుంటున్న మణిపూర్ బాధితులు, కాలినడకనే వేలాది మంది వలస