News
News
వీడియోలు ఆటలు
X

Gandhi Death Anniversary: గాంధీని చంపిన ముఠాలో తెలుగు వ్యక్తి కూడా..! కానీ ఆయన్ని నిర్దోషిగా తేల్చిన కోర్టు, ఎలాగంటే..

గాంధీని చంపిన ముఠాలో గాడ్సే, అంప్టేలది ప్రత్యక్ష పాత్ర కాగా కోర్టు దోషులుగా తేల్చింది మాత్రం 8 మందిని. అయితే వారిలో ఒక తెలుగు వ్యక్తి కూడా ఉన్నారు. కానీ, కోర్టు ఆయన్ను నిర్దోషిగా గుర్తించింది.

FOLLOW US: 
Share:

30 జనవరి 1948. భారత దేశం ఉలిక్కిపడ్డ రోజు. ప్రపంచమే  మొత్తం నివ్వెరపోయినరోజు. అహింసే ఆయుధంగా తెల్లవాళ్ళని పారద్రోలిన మహాత్ముడు విద్వేషానికి బలైపోయాడు. నాథురాం గాడ్సే పేల్చిన తుపాకీ గుళ్ళకి ప్రాణాలు వదిలిన మాహాత్ముడు జాతిపితగా దేశం గుండెల్లో గౌరవం అందుకున్నాడు. ఆయన్ని చంపిన గాడ్సే ఉరికంబం ఎక్కాడు. ఇంతవరకూ చరిత్ర అందరికీ తెలిసిందే. అయితే నిజానికి గాంధీని చంపడానికి సిద్ధమైన  ముఠాలో గాడ్సే, అంప్టేలది ప్రత్యక్ష పాత్ర అయితే వారితో పాటు కుట్రపన్నారంటూ అప్పట్లో కోర్టు దోషులుగా తేల్చింది మాత్రం 8 మందిని. (వీరు కాకుండా  పాటు సావర్కర్ పేరు మొదట పెట్టినా ఆధారాలు లేకపోవడంతో ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది కోర్టు ). అయితే వారిలో ఒక తెలుగు వ్యక్తి కూడా ఉండడం గమనార్హం. అతనే శంకర కిష్టయ్య!

ఎవరీ శంకర కిష్టయ్య ?
అందుతున్న చారిత్రిక ఆధారాల దృష్ట్యా శంకర కిష్టయ్య షోలాపూర్ లో స్థిరపడిన అచ్చ తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి. చదువు అబ్బలేదు. కేవలం తెలుగు, కొద్దిగా మరాఠీ మాత్రమే వచ్చు.  దానితో పూణేకు చెందిన దిగంబర్ బాడ్గే అనే ఆయుధాల వ్యాపారి దగ్గర పనివాడిగా చేరాడు. అదే సమయంలో భారత దేశంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇండియా పాకిస్తాన్‌లు విడిపోవడంతో పాకిస్తాన్‌కు ఇస్తామన్న డబ్బును భారత ప్రభుత్వం ఆపింది. అప్పటికే కశ్మీర్ గురించి రెండు దేశాల మధ్యా గొడవలు జరుగుతుండడంతో భారత ప్రభుత్వం ఇచ్చే డబ్బును తిరిగి భారత దేశం మీదే యుద్దానికి ఉపయోగిస్తారన్న అనుమానంతో నెహ్రూ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే గాంధీ మాత్రం అటువంటిది  ఏమీ జరగదనీ, ఇస్తామన్న డబ్బు ఇచ్చేయ్యాల్సిందే అంటూ 13 జనవరి 1948 నుండి నిరాహార దీక్షకు కూర్చున్నాడు. దానితో భారత ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుని ఆ డబ్బును పాకిస్తాన్‌కు ఇచ్చెయ్యడానికి సిద్దపడింది. ఇది భారత దేశంలోని కొందరు అతివాదుల మనస్సులను గాయపరిచింది. 

మహాత్మా గాంధీ దేశ అధికారాన్ని కంట్రోల్ చేస్తున్నాడని, ఒక వర్గాన్నే సపోర్ట్ చేస్తున్నాడనే అపోహ పడ్డారు. అలాంటి వారిలో నాథురాం గాడ్సే, నారాయణ్ అంప్టేలు ఆయన్ను హత్య చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. వారికి విష్ణు కర్కరే, మదన్ లాల్ పహ్వ, దత్తాత్రేయ పర్చురే, గాడ్సే తమ్ముడు గోపాల్ గాడ్సేలు తోడయ్యారు. అయితే వారికి కావాల్సిన ఆయుధాల కొనుగోలుకు ఒక వ్యాపారి కావాల్సి వచ్చింది. అక్కడే వారికి ఆయుధ వ్యాపారి దిగంబర్ బాడ్గే పరిచయం అయ్యాడు . ఆయనా వీరితో కలవడంతో వివరాలు తెలియకపోయినా తన యజమాని వెంట శంకర్ కిష్టయ్య కూడా బయలుదేరి వెళ్ళాడు. వీరిలో ఒకొక్కరు ఒక్కో ప్రాంతం వాళ్ళు కావడంతో ఎక్కువగా హిందీలోనే మాట్లాడుకునే వారని తరువాత విచారణలో తేలింది. తెలుగు, కొద్దిగా మరాఠీ మాత్రమే వచ్చిన కిష్టయ్యకు భాషా భేదం వల్ల వీళ్ళ ప్లాన్  ఏంటి అనే దానిపై అస్సలు అవగాహన లేదని చరిత్రకారులు తరువాతి కాలంలో రాశారు. పైగా పనివాడు కావడంతో వీరికి కాస్త దూరంగానే తాను మెసలేవాడినని విచారణ సందర్భంగా కోర్టుకు  చెప్పుకున్నాడు.


మొదటి ప్రయత్నంలో విఫలమైన హత్యా ప్రయత్నం
20 జనవరి 1948 న గాంధీని చంపడానికి ఈ బృందం పథకం వేసింది. దాని ప్రకారం గాంధీని బాంబులు విసిరి చంపాలనుకున్నారు. ఆరోజు తాను నివాసం ఉంటున్న ఢిల్లీలోని బిర్లా హౌస్ ఆవరణలో ప్రసంగిస్తుండగా సభ మధ్యకు ఒక బాంబును విసిరారు. పెద్ద శబ్దం రావడంతో చుట్టూ గాంధీ ఉన్న జనం పారిపోయారు. గాడ్సే వేసుకున్న పథకం ప్రకారం ఒంటరిగా ఉన్న గాంధీ పైన రెండో బాంబును విసిరి ఆయన్ను హత్య చెయ్యాలి. అయితే జరిగిన గందరగోళం చూసి రెండో  బాంబు విసరాల్సిన దిగంబర్ ధైర్యాన్ని కోల్పోయి జనంతో పాటు పారిపోయాడు. అలాగే తన పనివాడు శంకర్ కిష్టయ్యను తీసుకుని ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోయాడు.  కానీ మొదటి బాంబు విసిరాడని చెప్పుకునే మదన్ లాల్ మాత్రం అక్కడే ఉండిపోయాడు. తనని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు. శిక్ష ముగించుకుని మదన్ లాల్ 1964 లో జైలు నుండి రిలీజ్ అయ్యాడు. 

అప్రమత్తం కాని భద్రతా సిబ్బంది 
గాంధీ మీద హత్యా ప్రయత్నం జరిగినా పోలీసులు పూర్తిస్థాయి భద్రత తీసుకోలేదు. కారణం, తాత్కాలిక భావోద్వేగాలతో చేసిన పనిగానే ఈ హత్యాయత్నాన్ని వారు చూశారు. అలాగే బాంబు విసిరినవాడు దొరికేశాడనే ధీమాలో వారున్నారు. పైగా అప్పటికి స్వాతంత్య్రం వచ్చి కనీసం 4 నెలలు కూడా కాలేదు కాబట్టి పూర్తిస్థాయి వ్యవస్థలు ఇంకా  ఏర్పడలేదు. 

ప్రభుత్వాన్ని హెచ్చరించినా వినలేదు: జగదీశ్ చంద్ర జైన్
ఆ కాలంలో ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, విద్యావేత్త, చరిత్ర కారుడు అయిన  జగదీష్ చంద్ర జైన్ తో మదన్ లాల్ కు పూర్వ పరిచయం ఉండేది. దానితో ఎప్పుడో మాటల సందర్భంలో జగదీశ్ జైన్ తో తాము గాంధీని హత్య చెయ్యబోతున్నట్టు మదన్ లాల్ చెప్పేశాడు. దాంతో అయన బొంబాయి ప్రభుత్వాన్ని, హోమ్ మినిష్టర్ నీ హెచ్చరించినా వారు నమ్మలేదని జగదీశ్ జైన్ తన పుస్తకాల్లో రాశారు. కనీసం బాంబు దాడి ప్రయత్నం తర్వాత అయినా తనను మదం లాల్ తో మాట్లాడనిస్తే తన వెనుక ఉన్నవారి పేర్లు బయట పెట్టిస్తానని చెప్పినా ప్రభుత్వం ఆయనకు సహకరించలేదని రాశారు.  

30 జనవరి 1948న రెండో ప్రయత్నం మిస్సవ్వలేదు
తమ పథకం ఫెయిల్ అవ్వడం, ఒకరు దొరికిపోవడం, దిగంబర్ బాగ్డే పనివాడితో సహా పారిపోవడంతో ఇక నాథురాం గాడ్సే, నారాయణ్ అంప్టేలు స్వయంగా యాక్షన్లోకి దిగారు. ఇద్దరూ 30 జనవరి 1948న అదే బిర్లా హౌస్ లో ప్రార్ధన కోసం వెళుతున్న 78 ఏళ్ల మహాత్మా గాంధీకి నమస్కారం చెయ్యబోతున్నవాడిలా ముందుకు వచ్చి వంగి, వెంటనే లేచి గాంధీ ఛాతీ మెడకు గురిచూసి కాల్చడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయాడు మహాత్ముడు . 

కింది కోర్టులో  విచారణ
పోలీసులకు పట్టుబడ్డ గాడ్సే, నారాయణ ఆంప్టేల ద్వారా మొత్తం బృందాన్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టుకు అప్పజెప్పడంతో గాడ్సే గ్యాంగ్ 8 మందితో సహా వీరి వెనుక కుట్రదారుడిగా అభియోగం మోపబడ్డ సావర్కర్ పైనా విచారణ సాగింది. అయితే సాక్ష్యాలు లేవంటూ సావర్కర్ ను నిర్దోషిగా వదిలిన కోర్టు గాడ్సే, అంప్టేలకు ఉరిశిక్ష, శంకరా కిష్టయ్యతో సహా మిగిలిన 8 మందికి జీవిత ఖైదు విధించింది.

శంకర కిష్టయ్య పాలిట దేవతలా వచ్చిన  మడికెర  కమలమ్మ
కింది కోర్టు ఇచ్చిన తీర్పు పై గాడ్సే మినహా మిగిలిన అందరూ పైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. అయితే వారిలో శంకర కిష్టయ్యకు చదువు రాకపోవడంతో వేలిముద్ర తోనే తన శిక్షపై అప్పీలుకు వెళ్ళాడు. కానీ అంతవరకూ శంకర్ ఆ కిష్టయ్యను కూడా మరాఠీ గానే లెక్కిస్తున్న కోర్టుకు తను తెలుగువాడిని తెలియడంతో అతనేం చెబుతున్నాడో తెలియని పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా సమయంలో బాంబే ప్రెసిడెన్సీ చీఫ్ మేజిస్ట్రేట్ ఆస్కార్ హెన్రి బ్రౌన్ వద్ద పనిచేస్తున్న మడికెర కమలమ్మ అనే ఉద్యోగి తెలుగు వ్యక్తి కావడంతో వెంటనే ఆమెను విచారణ టీమ్ లోకి తీసుకుంది ప్రభుత్వం. ఆమె ద్వారా శంకర కిష్టయ్య విషయం మొత్తం తెలుసుకున్న అధికారులు కోర్టుకు విషయం తెలపడంతో హై కోర్టు తనకు గాంధీ హత్య గురించిన ముందస్తు సమాచారం ఏమీ లేదనీ, కేవలం తన యజమాని అయిన  దిగంబర్ బాగ్డేకు సహాయకుడిగా మాత్రమే ఉన్నాడని నమ్మి శంకర్ కిష్టయ్యను విడుదల చేసింది. తనతోపాటు దత్తాత్రేయ పర్చురే, అలాగే అప్పటికే అప్రూవర్ గా మారి ఈ కేసు విషయంలో సాక్షిగా వ్యవహరించిన దిగంబర్ బాగ్డే లు కూడా తమపై మోపబడిన కేసుల నుండి బయట పడ్డారు. 

మిగిలిన వారిలో గాంధీని హత్య చేసిన  నాథురాం గాడ్సే, కుట్రపన్నిన నారాయణ అంప్టేలను 15 నవంబర్ 1949లో ఉరితీశారు. మిగిలినవారికి కింది కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షనే హైకోర్టు కూడా ధృవీకరించింది. ఈ కేసు ప్రొసీడింగ్స్‌కి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న జగదీష్ చంద్ర జైన్ రాసిన ఈ విషయాలన్నింటినీ తన పుస్తకాలైన "ది ఫర్ గాటెన్  మహాత్మ" ,"ఐ కుడ్ నాట్ సేవ్ బాపు" ల్లో నిక్షిప్తం చేశారు. వీటితో పాటు మరో 80 పుస్తకాలూ రాసిన జగదీష్ జైన్ సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 1998లో ఒక స్టాంపును సైతం రిలీజ్ చేసి గౌరవించింది. 

శంకర కిష్టయ్య ఏమయ్యాడు
అయితే, తనకు సంబంధం లేకపోయినా ప్రపంచాన్నే కుదిపేసిన మహాత్మా గాంధీ హత్యలో పాల్గొన్న బృంద సభ్యుడిగా జీవిత ఖైదు అంచుల వరకూ వెళ్లి నిర్దోషిగా బయట పడ్డ శంకర కిష్టయ్య తరువాత ఏమయ్యాడో పెద్దగా వివరాలు లేవు. అయితే తన పాత యజమాని అయిన దిగంబర్  బాగ్డే వద్దకు మాత్రం ఆ తరువాత వెళ్లనే లేదు. చరిత్రకారులు చెప్పేదాని ప్రకారం ఈ కేసు పూర్తయ్యాక కొంతకాలం రిక్షా కార్మికుడిగానూ, తరువాత అలాంటివే చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగించాడని చెబుతారు.

Published at : 30 Jan 2022 07:58 AM (IST) Tags: Mahatma Gandhi Death Anniversary Gandhi death case nathuram godse gandhi death date gandhi death scene telugu person in gandhi murder case

సంబంధిత కథనాలు

Tamil Nadu Crime: అత్తను దారుణంగా హత్య చేసిన కోడలు, సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్!

Tamil Nadu Crime: అత్తను దారుణంగా హత్య చేసిన కోడలు, సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్!

IBPS RRB XII Recruitment 2023: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల - ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఎప్పుడంటే?

IBPS RRB XII Recruitment 2023: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల - ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఎప్పుడంటే?

TCS Work From Office: ఆఫీస్‌కి రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్ - ఉద్యోగులకు టీసీఎస్ వార్నింగ్

TCS Work From Office: ఆఫీస్‌కి రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్ - ఉద్యోగులకు టీసీఎస్ వార్నింగ్

Viral Video: ఆడి చాయ్ వాలా అదిరిపోయే స్టోరీ - లగ్జరీ కారునే టీకొట్టుగా మార్చేసిన యువకుడు!

Viral Video: ఆడి చాయ్ వాలా అదిరిపోయే స్టోరీ - లగ్జరీ కారునే టీకొట్టుగా మార్చేసిన యువకుడు!

Rahul US Visit: బీజేపీలోనూ లొసుగులున్నాయ్, ప్రతిపక్షాలు కలిసి నడిస్తే ఓడించటం సులువే - రాహుల్ కామెంట్స్

Rahul US Visit: బీజేపీలోనూ లొసుగులున్నాయ్, ప్రతిపక్షాలు కలిసి నడిస్తే ఓడించటం సులువే - రాహుల్ కామెంట్స్

టాప్ స్టోరీస్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !