Ratan Tata: రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేసిన మహారాష్ట్ర మంత్రిమండలి
Ratan Tata: వ్యాపారవేగా, సమాజసేవకుడిగా దేశానికి ఎన్నో సేవలు చేసిన రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలని మహారాష్ట్ర తీర్మానం చేసింది. దీన్ని కేంద్రానికి పంపించింది.
Ratan Tata: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతితో యావత్ దేశం దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన అంత్యక్రియను కేంద్రం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రాష్ట్ర ప్రభత్వాలు గురువారం రోజును సంతాప దినంగా ప్రకటించాయి.
భారత రత్న పురస్కారమే సరైన గౌరవం
ప్రపంచస్థాయి వ్యాపార దిగ్గజంగా ఎదగడమే కాకుండా మానవతా వాదిగా దేశానికి సేవ చేసిన రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. ఆయన సేవలకు సరైన గుర్తింపు ఇదేనంటూ మహారాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేసింది. ముందుగా ఆయన మృతికి మంత్రిమండలి సంతాపం తెలియజేసింది. అనంతరం ఆయనకు భారత రత్న ఇవ్వాలనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. దీన్ని కేంద్రానికి పంపనుంది.
సామాజిక సేవకుడు
వ్యాపారవేత్తగానే కాకుండా సమాజ సంక్షేమాన్ని కాంక్షించే వ్యక్తిగా రతన్ టాటాను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని తీర్మానంలో పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపన ద్వారానే దేశాభివృద్ధిలో భాగమవ్వడమే కాకుండా దేశ భక్తిని చాటి చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి అంటూ కితాబు ఇచ్చింది. సమాజం చిత్తశుద్ధి ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వ్యాపారం చేసిన పారిశ్రామికవేత్తగా అభివర్ణించింది.
సమాన ఆలోచనలు కలిగిన సామాజిక కార్యకర్త, దూరదృష్టి గల లీడర్‌ను కోల్పోయామని మహారాష్ట్రమంత్రిమండలి పేర్కొంది. భారతదేశంలోని పారిశ్రామిక రంగంలోనే కాకుండా, సామాజిక అభివృద్ధిలో కూడా టాటా సహకారం అసాధారణమైనదని అన్నారు. భారతమాత అక్కున చేర్చుకున్న మహారాష్ట బిడ్డ స్వీయ క్రమశిక్షణ, స్వచ్ఛమైన అడ్మినిస్ట్రేషన్, ఉన్నత నైతిక విలువలు కలిగిన వ్యక్తిగా ప్రజల మనిషిగా ఉన్నారని తెలిపింది. కఠినమైన పరీక్షుల ఎన్ని ఎదురైనా వాటిని చిరునవ్వుతోనే అధిగమించి టాటా సంస్థలను అంతర్జాతీయంగా తీర్చిదిద్దారని కీర్తించారు.
ఎప్పటికి దేశం మర్చిపోని ముద్దుబిడ్డ
టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెట్‌జీ టాటాకి ముని మనవడు రతన్ టాటా. టాటా గ్రూప్‌కు చైర్మన్‌గా, తాత్కాలిక చైర్మన్‌గా పని చేశారు. టాటా గ్రూప్ ఛారిటబుల్ ట్రస్ట్‌కు అధిపతిగా ఉంటూ కష్టాల్లో దేశానికి దేశ ప్రజలకు అండగా నిలబడ్డారు. రతన్ టాటా పాటించిన విలువలు, సంస్థలను నడిపిన తీరు భావితరాలకు పాఠంలా ఉపయోగపడుతుంది. దేశ పునర్నిర్మాణంలో టాటా గ్రూప్ కీలక పాత్ర పోషించింది. అందులో రతన్ టాటా కృషి దేశం ఎప్పటికీ మర్చిపోదు.
దేశంలోన కాదు అంతర్జాతీయంగా కూడా భారతదేశ పతాకాన్ని ఎగురవేశారు. ఉప్పు నుంచి ఉక్కు వరకు కంప్యూటర్ల నుంచి కాఫీ-టీ వరకు టాటా పేరును ప్రతి ఇంటికీ తీసుకెళ్లారు. విద్య, ఆరోగ్యం, సామాజిక సేవా రంగంలో కూడా విశిష్టమైన సేవ చేశారు. ముంబైపై 26/11 దాడుల తర్వాత అతని చూపిన దృఢత్వం, కోవిడ్ టైంలో ప్రధాని సహాయ నిధికి అందించిన రూ.1500 కోట్లు విరాళం ఇలా చెప్పుకుంటూ పోతే వేల ఘటనలు ఉన్నాయి. కోవిడ్ రోగులకు తమ హోటళ్లలో వైద్య సేవలు అందించిన మహోన్నతమైన వ్యక్తి. అందుకే భౌతికంగా దూరమైన ప్రతి ఇంటిలో ప్రతి మనిషి గుండెలో ఉండిపోయారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తికి భారత రత్నతో గౌరవించాలని మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
Also Read: రతన్ టాటా వారసుల రేస్‌లో మాయా, నెవిల్లే , లియా- ఎవరు ఎందులో గొప్ప!