Look back 2023: G20 సదస్సుతో అంతర్జాతీయంగా మారుమోగిన భారత్ పేరు, ఈ ఏడాదికిదే హైలైట్
Look back 2023: భారత్ ఈ ఏడాది G20 సదస్సుని విజయవంతంగా నిర్వహించి అంతర్జాతీయంగా చరిష్మాని పెంచుకుంది.
India's Achievements in 2023:
G20 సదస్సు 2023
మరి కొద్ది రోజుల్లో 2023 ముగిసిపోనుంది. ఈ ఏడాది మొత్తంలో భారత్ పేరు అంతర్జాతీయంగా వినబడేలా చేసిం G20 సదస్సు. ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9-10 మధ్య (G20 Summit in India) కాలంలో ఈ సమావేశాలు జరిగాయి. ఈ సదస్సుకి 6 నెలల ముందు నుంచే భారత్ అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసింది. ఆతిథ్యంలో ఎక్కడా లోటు రాకుండా చూసుకుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఆఫ్రికన్ యూనియన్‌ని G20లో భాగం చేయడంలో భారత్ ముఖ్యపాత్ర పోషించింది. అంతే కాదు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ముందు జరిగిన ఈ G20 సదస్సు విజయవంతం కావడం ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాని మరింత పెంచింది. ఈ సదస్సుకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హాజరయ్యారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్ని కారణాల వల్ల రాలేదు. ఈ సదస్సు కోసం భారత్ భారీగానే ఖర్చు చేసింది. ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సదస్సు జరిగింది. భారత్ సంస్కృతి ఉట్టిపడేలా ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాల్లో పెయింటింగ్స్ వేయించింది. ఇవే హైలైట్‌గా నిలిచాయి. ఈ మొత్తం యాడ్స్ కోసం కేంద్రం రూ.10 కోట్లకుపైగా ఖర్చు చేసింది. ఇదంతా విదేశీ అతిథులను ఆకట్టుకోవడం కోసమే.
రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై తీర్మానం..
నిజానికి G20 దేశాల్లో చైనా, రష్యా చాలా కీలకమైనవి. కానీ ఈ రెండు దేశాల అధ్యక్షులూ ఈ సదస్సుకి హాజరు కాలేదు. అయినా సరే...భారత్ మిగతా అన్ని దేశాలతో సమన్వయం చేసుకోగలిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia Ukraine War) గురించి ప్రస్తావించడమే కాకుండా ఓ జాయింట్ స్టేట్‌మెంట్ కూడా సిద్ధం చేసింది. ముందు ఈ స్టేట్‌మెంట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ...భారత్ వాటిని నిర్లక్ష్యం చేయలేదు. మరోసారి ఆ స్టేట్‌మెంట్‌ని రివ్యూ చేసింది. అందరితోనూ చర్చించి చివరకు 100% అంగీకారం సాధించగలిగింది. ఇందుకోసం 200 గంటల పాటు ఎడతెరపి లేకుండా చర్చలు జరిగినట్టు భారత్ G20 షెర్పా అమితాబ్ కాంత్ వెల్లడించారు. ముందుగా ఐరోపా సహా పశ్చిమ దేశాలు కొంత అసహనం వ్యక్తం చేశాయి. భారత్ ఆయా దేశాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని స్టేట్‌మెంట్‌లో మార్పులు చేర్పులు చేసింది. "ఇది యుద్ధాలు చేసుకునే కాలం కాదు" అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇది అందరికీ ఆమోదయోగ్యంగా అనిపించింది.
ఎకనామిక్ కారిడార్..
ఇదే సదస్సులో భారత్ మరో కీలక ప్రతిపాదన చేసింది. అదే..India-Middle East-Europe Economic Corridor నిర్మాణం. భారత్, యూఏఈ, సౌదీ అరేబియా, యురేపియన్ యూనియన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, అమెరికాని కలుపుతూ ఈ కారిడార్‌ని నిర్మించాలని భారత్ ప్రతిపాదించింది. ఇక ఈ సదస్సు మొదటి రోజే ఆఫ్రికన్ యూనియన్‌ని G20 లోకి ఆహ్వానించింది ఇండియా. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ ప్రకటన చేశారు. ఆ దేశాన్ని సాదరంగా ఆహ్వానించారు. మొత్తం 55 ఆఫ్రికన్ దేశాలు G20లో భాగమయ్యాయి. ఇదే సదస్సులో Global South అంశాన్ని ప్రస్తావించింది. G20 సదస్సు దేశవ్యాప్తంగా ఓ కొత్త చర్చకు దారి తీశాయి. ఈ ఇన్విటేషన్ కార్డ్‌లలో India కి బదులుగా Bharat అని ప్రింట్ చేయించింది కేంద్రం. ఎప్పటి నుంచో ఈ పేరు మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటికి బలం చేకూర్చుతూ కేంద్ర Bharat అనే పదాన్నే ఎక్కువగా ప్రమోట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ కూర్చున్న చోట కూడా Bharat నేమ్ ప్లేట్ కనిపించింది. దీనిపై విపక్షాలు మండి పడ్డాయి. ఇది కొంత వరకూ వివాదాస్పదమైనప్పటికీ కేంద్రం దాని గురించి పట్టించుకోలేదు. మొత్తంగా రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సు భారత్‌కే కాకుండా కేంద్ర ప్రభుత్వానికీ బాగానే ప్లస్ అయింది. ఈ ఏడాది భారత్ సాధించిన విజయాల్లో G20 సదస్సుని విజయవంతంగా నిర్వహించడం ఒకటి.
Also Read: నా పేరుకి ముందు తరవాత గౌరవ వాచకాలొద్దు, నేనూ సామాన్య కార్యకర్తనే - పార్టీ ఎంపీలకు ప్రధాని విజ్ఞప్తి