QR code on Tombstone: కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్, జ్ఞాపకాలను సజీవంగా దాచిన కుటుంబం
QR code on Tombstone: కేరళలో ఓ తల్లిదండ్రులు సమాధిపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే చనిపోయిన తమ కుమారుడి గురించిన వెబ్ పేజీ ఓపెన్ అయ్యేలా ఏర్పాటు చేశారు.
QR code on Tombstone: ఇంట్లో ఎవరైనా కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. వారి గత స్మృతులు మదిలో మెదులుతూ కలచివేస్తుంటాయి. వారు లేరు, తిరిగి రారు అనే భావన కన్నీరు పెట్టిస్తుంది. అందులోనూ చిన్న వయస్సు వారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతే ఆ బాధను దిగమింగుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. నవమాసాలు మోసి కన్న పిల్లలు తమ కళ్ల ముందే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతే ఆ తల్లిదండ్రుల బాధ అంతా ఇంతా కాదు. వారు ఎంతో కుమిలిపోతుంటారు. కొందరు తల్లిదండ్రులు వారి సంతానం చనిపోతే ఆ బాధను దిగమింగుకోలేకపోతారు. వారి జ్ఞాపకాలు చెదిరిపోకుండా చూసుకుంటారు. సంతానంలో ఎవరైనా చనిపోతే వారి గుర్తుగా విగ్రహాలు, సేవా కార్యక్రమాలు, ఆసుపత్రులు, పాఠశాలలు ఏర్పాటు చేస్తుంటారు. అలా వారిని చూసుకుంటారు. కేరళకు చెందిన ఓ తల్లిదండ్రులు తన కుమారుడు చనిపోతే అతని జ్ఞాపకాలు చెదిరిపోకుండా చేసిన ఏర్పాటు ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తోంది.
26 ఏళ్ల వయసులోనే ఇవిన్ అకాల మరణం..
కేరళలో డాక్టర్ ఇవిన్ ఫ్రాన్సిన్ అనే యువ వైద్యుడు మరణించాడు. బాడ్మింటన్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. 26 ఏళ్ల వయస్సులోనే ఇవిన్ అకాల మరణం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచి వేసింది. ఈ దుర్ఘటన జరిగి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తోంది. బతికున్నప్పుడు ఇవిన్ వైద్య రంగంలో గొప్ప సేవా కార్యక్రమాలు చేశాడు. పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాలు పంచుకున్నాడు. డాక్టర్ ఇవిన్ చనిపోయినా.. తన సేవా కార్యక్రమాల ద్వారా ఇంకా జనం మదిలో బతికే ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఇవిన్ తల్లిదండ్రులు.. అతడి గురించిన జ్ఞాపకాలు చెదిరిపోకుండా ఏదైనా ఏర్పాటు చేయాలని ఆలోచించగా వారికి ఓ ఆలోచన తట్టింది. వెంటనే ఇవిన్ జ్ఞాపకాలను పోగు చేయడం మొదలు పెట్టారు. ఫోటోలు, వీడియోలు, ఇవిన్ సృజనాత్మక వైఖరిపై సమాచారం సేకరించారు. వాటితో ఒక వెబ్ సైట్ తయారు చేయించారు. అందులో ఇవిన్ స్మృతులు అన్నీ ఉండేలా చూసుకున్నారు.
క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే.. ఇవిన్ సమాచారం అంతా వచ్చేలా!
ఇవిన్ సమాధిపై ఓ క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేశారు. ఆ క్యూఆర్ కోడ్ కు ఇవిన్ వెబ్ పేజీని లింక్ చేశారు. ఇవిన్ సమాధిపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే.. ఇవిన్ కు సంబంధించిన సమాచారం అంతా వచ్చేలా ఏర్పాటు చేశారు. అలా వారి కుమారుడి జ్ఞాపకాలను సజీవంగా ఉంచగలిగారు. ఇవిన్ తల్లిదండ్రుల ఆలోచన ఇప్పుడు చాలా మందిని ఆకర్షిస్తోంది. కుమారుడు దూరమైపోయినా.. తన ఆలోచనలను, జ్ఞాపకాలను పదిలంగా ఉంచిన తీరు అబ్బురపరుస్తోంది.