Kerala Menstrual Leave: కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం- ఆ మూడు రోజులు అమ్మాయిలకు సెలవులు
కేరళలోని ప్రఖ్యాత కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. దీన్ని ఆదర్శంగా తీసుకున్న కేరళ ప్రభుత్వం అన్ని విశ్వవిద్యాలయాల్లో అమలు చేస్తోంది.
Kerala Menstrual Leave: ఉన్నత విద్యా శాఖ పరిధిలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న బాలికలకు రుతుస్రావ సెలవులు(Menstrual Leave) ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కుశాట్) తన విద్యార్థులకు పీరియడ్ లీవ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు తమ శాఖ పరిధిలోని అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు తెలిపారు.
ఎస్‌ఎఫ్‌ఐ నేతృత్వంలోని విద్యార్థి సంఘాల డిమాండ్ల మేరకు కుశాట్‌లో పీరియడ్ సెలవులకు ఆమోదం తెలిపినట్లు ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు తెలిపారు. పీరియడ్స్ సమయంలో విద్యార్థినులు ఎదుర్కొనే మానసిక, శారీరక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఇతర విశ్వవిద్యాలయాల్లో కూడా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
కొచ్చిన్ యూనివర్శిటీ నిర్ణయంపై హర్షం
కేరళలోని ప్రఖ్యాత కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కుశాట్) ప్రతి సెమిస్టర్లో బాలికల హాజరు శాతం పెంచడానికి ఇది ఉపయోగపడుతుందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్వయంప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయం కుశాట్‌లో వివిధ తరగతుల్లో 8,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వారిలో సగానికి పైగా బాలికలు ఉన్నారు. కొచ్చిన్ యూనివర్శిటీ నిర్ణయాన్ని ప్రశంసించిన కేరళ ప్రభుత్వం ఇప్పుడు అన్ని యూనివర్సిటీల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
ఉన్నత విద్యాశాఖ మంత్రి ఏమన్నారంటే?
పిరియడ్స్ టైంలో బాలికలు ఎదుర్కొనే మానసిక, శారీరక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అన్ని విశ్వవిద్యాలయాల్లో రుతుస్రావ సెలవులను అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు ఫేస్బుక్ పోస్టులో తెలిపారు.
ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి
కొచ్చిన్ యూనివర్శిటీ తాజా నిర్ణయాన్ని అభినందిస్తూ... ఒక విద్యా కేంద్రం బాలికలకు రుతుస్రావ సెలవులు ఇవ్వడం కేరళలో ఇదే మొదటిసారని ఆయన అన్నారు. ఇప్పుడు బాలికలకు 73 శాతం హాజరు తప్పనిసరి చేశారు. ఇప్పుడు ఈసెలవులతో కలిసి బాలికలకు మరో 2 శాతం డిస్కౌంట్ ఇచ్చారు.