చంద్రయాన్-3 విజయంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు కర్ణాటక ప్రభుత్వం తరఫున సన్మానం
బెంగళూరులోని ఇస్రో హెడ్ ఆఫీస్‌కు వెళ్లిన సిద్దరామయ్య అక్కడ శాస్త్రవేత్తలను కలిశారు. ఇస్రో ఛైర్మన్ సోమనథ్, ప్రాజెక్టు డైరెక్టర్‌లు వీరముత్తువేల్, కె. కల్పన, యూఆర్‌ఎస్‌సీ డైరెక్టర్ ఎం శంకరన్‌ను సత్కరించారు.
చంద్రయాన్-3 బజ్ ఇంకా కొనసాగుతోంది. శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని అన్ని వేదికలపై ప్రజలు ప్రశంసిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో తలెత్తుకొనేలా చేసిన ఇస్రో సైంటిస్టులకు ఏం ఇచ్చుకున్నా తక్కువే అంటున్నారు. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ... ఈ మిషన్‌లో పాల్గొన్న వారంతా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే అన్నారు. దీంతో వారిపై అభిమానం మరింత పెంచుకుంటున్నారు ప్రజలు.
ఒక్క అడుగు ముందుకు వేసిన కర్ణాటక ప్రభుత్వం చంద్రయాన్ -3 విజయంలో భాగమైన వారిని సన్మానించేందుకు సిద్ధమైంది. ఈ మిషన్ కోసం పని చేసిన ఐదు వందల మంది ఇస్రో శాస్త్రవేత్తలను ఘనంగా సత్కరిస్తామని కర్ణాటక సీఎం సిద్ద రామయ్య ప్రకటించారు. ఇస్రో ఆఫీస్‌ను సందర్శించిన ఆయన శాస్త్రవేత్తలను అభినందిచారు.
బెంగళూరులోని ఇస్రో హెడ్ ఆఫీస్‌కు వెళ్లిన సిద్దరామయ్య అక్కడ శాస్త్రవేత్తలను కలిశారు. ఇస్రో ఛైర్మన్ సోమనథ్, ప్రాజెక్టు డైరెక్టర్‌లు వీరముత్తువేల్, కె. కల్పన, యూఆర్‌ఎస్‌సీ డైరెక్టర్ ఎం శంకరన్‌ను సత్కరించారు. వారు చేసిన కృషిపై ప్రశంసలు కురిపించారు.
చందమామ దక్షిణ ధ్రవంపై ల్యాండర్‌ను పంపి ప్రపంచ దేశాలకు భారత్ సత్తా చాటినందుకు ఆనందం వ్యక్తం చేశారు సిద్ధరామయ్య. ఇలాంటి సైంటిస్టులకు ఏం ఇచ్చినా తక్కువే అన్నారు. అందుకే 500 మంది శాస్త్రవేత్తలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సన్మానిస్తామన్నారు. సెప్టెంబర్ 2న కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. సన్మాలే కాకుండా భవిష్యత్‌లో ఇస్రో చేపట్టే కార్యక్రమాలకు పూర్తి స్థాయి మద్దతు ప్రకటించారు సిద్దరామయ్య.