Siddaramaiah MUDA Case: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు, ఈ 6న విచారణకు హాజరు
Siddaramaia In MUDA Case : మైసూర్ అర్బన్ డెవెలప్‌మెంట్ అథారిటీ ముడా స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ6న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.
Karnataka Muda scam Case: బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపిన ముడా స్కాం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మైసూర్ అర్బన్ డెవెలప్‌మెంట్ అథారిటీ (MUDA) స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Karnataka CM Siddaramaiah)కు లోకాయుక్త పోలీసులు సమన్లు జారీ చేశారు. నవంబర్ 6న సిద్ధారామయ్య విచారణకు హాజరుకావాలని సోమవారం జారీ చేసిన నోటీసులలో పేర్కొన్నారు. తనకు లోకాయుక్త నుంచి నోటీసులు వచ్చాయని సీఎం సిద్ధారామయ్య సైతం తెలిపారు. నవంబర్ 6న విచారణకు హాజరు కానున్నట్లు వెల్లడించారు.
సిద్ధరామయ్య భార్యను విచారించిన పోలీసులు
సిద్ధరామయ్య సతీమణి పార్వతీని లోకాయుక్త పోలీసులు అక్టోబర్ 25న ప్రశ్నించారు. ముడా భూములకు సంబంధించి విచారణ జరిపారు. రాజకీయాలతో సంబంధం లేని తన భార్యను సైతం కేసులోకి లాగారని సిద్ధరామయ్య ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థలం కేటాయింపునకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి కొంతకాలం సైలెంట్ గా ఉంది. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. ఆగస్టు 16 న సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు సైతం జారీ చేశారు. కానీ తనపై విచారణ జరిపించాలని గవర్నర్ ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. సీఎం సిద్ధరామయ్య పిటిషన్ ను సెప్టెంబరు 24న హైకోర్టు తోసిపుచ్చింది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి చెల్లుబాటు అవుతుందని, వ్యక్తిగత ఫిర్యాదుతో కేసు నమోదుకు అనుమతి ఇచ్చే అధికారం ఉందని స్పష్టం చేసింది. దాంతో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ ఇచ్చిన అనుమతి చెల్లుబాటు అయింది.
అక్రమంగా ముడా ప్లాట్లు పొందారని సిద్దారమయ్యపై ఆరోపణలు
మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడా) మైనసూరులో డెలవప్ చేసిన ఓ వెంచర్ లో సిద్ధరామయ్య భార్య పార్వతికి సైతం ప్లాట్లు కేటాయించారు. సిద్ధరామయ్య స్వగ్రామంలో ఆయన భార్యకు చెందిన భూమిని కూడా డెవలప్ మెంట్ కోసం ముడా తీసుకుంది. ఆ భూమికి ప్రతిఫలంగా అత్యంత విలువైన భూములు సిద్దరామయ్య భార్యకు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని ఆరోపణలు వచ్చాయి. ఖరీదైన భూములు సీఎం సిద్ధరామయ్య ఫ్యామిలీ పొందినట్లు గవర్నర్ కు ఫిర్యాదులు రాగా, విచారణకు ఆదేశించారు. ముడా భూముల స్కాంపై సిద్ధరామయ్యను లోకాయక్త పోలీసులు విచారించేందుకు సిద్ధమయ్యారు.
తనను కుట్రపూరితంగా కేసులో ఇరికించారని, తన భార్యను సైతం వేధించాలని కేసులు నమోదు చేసే కుట్ర జరిగిందని కోర్టును ఆశ్రయించారు. కానీ వ్యక్తిగత ఫిర్యాదుతో విచారణకు ఆదేశించే హక్కు గవర్నర్ కు ఉందని హైకోర్టు స్పష్టం చేయడంతో సిద్ధరామయ్యకు చిక్కులు తప్పడం లేదు. ఈ క్రమంలో లోకాయుక్త పోలీసులు నవంబర్ 6న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని సిద్ధరామయ్యకు తాజాగా నోటీసులు జారీ అయ్యాయి.