Kalpana Chawla News: తొలి భారతీయ మహిళా వ్యోమగామి కథ తెలుసా?
కల్పనా చావ్లా. అంతరిక్షంలోకి వెళ్లిన తొలిభారతీయ మహిళ. జీవితాన్ని అంతరిక్ష రంగానికి అంకితంచేశారు. కృషితో నాస్తి అన్న నానుడిని నిజంచేశారు.
Kalpana Chawla: చందమామ రావే.. జాబిల్లిరావే అంటూ నెలరేడుని చూపిస్తూ.. తల్లి మురిపించిన క్షణం.. గగన వీధుల్లో మెరిసిన నక్షత్ర కాంతాలను అవలోకనం చేసుకోవాలని, అంతరిక్ష అద్భుతాల వెనుక రహస్యాలను ఛేదించాలనే బీజాలు నాటుకున్నాయి. ఇదే.. ఆమె జీవితాన్ని అంతరిక్ష రంగానికి అంకితమయ్యేలా చేశాయి. మహిళల(Women)కు ఆటో రంగమే పనికిరాదు.. ఇక, అంతరిక్షమా? అని గేలి చేస్తున్న రోజుల్లోనే ఆమె తన పట్టుదలను సాకారం చేసుకునే క్రమంలో నిరంతరం కష్టపడ్డారు. మహిళలకు సాటి మరెవరూ లేరని నిరూపించారు. ఆమే కల్పనా చావ్లా(Kalpana Chawla). అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన హరియాణా(Hariyana) ఆడపడుచు. ఆమె సాధించిన విజయం అనన్య సామాన్యం.
అంతరిక్షంలోకి వెళ్లిన చావ్లా.. తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పాయారు. అయితేనేం.. ఆమె స్ఫూర్తి నేటికీ రగులుతూనే ఉంది. ఎంతో మంది మహిలను అంతరిక్ష పరిశోధన దిశగా అడుగులు వేయించింది. నేడు భారత దేశంలో 550 మంది మహిళలు అంతరిక్షం రంగంలో విశేష కృషి చేస్తున్నారు. వీరంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మాటను సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే చెప్పడం విశేషం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నేపథ్యంలో స్ఫూర్తి దాయకమైన కల్పనా చావ్లా కృషిని గుర్తు చేసుకుందాం.
హరియాణా నుంచి అమెరికా వరకు
కల్పనా చావ్లా(Kalpana Chawla) హరియాణాలోని కర్నాల్(Karnal) పట్టణంలో 1962 మార్చి 17 న జన్మించారు. తల్లిదండ్రులకు ఈమె చివరి సంతానం. ఆమె తండ్రి బనారసీలాల్ చావ్లా సాధారణ వ్యాపారి. పేదరికం నుంచి పైకెదిగారు. పట్టుదల, అందుకు తగిన కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి ఆయన. ఈ కృషి ఈ పట్టుదలలే కల్పనలోనూ తర్వాత నాటుకున్నాయి. టైర్ల వ్యాపారాన్ని ప్రారంభించిన చావ్లా తండ్రి దీనిలో అనేక ప్రయోగాలు చేశారు. టైర్ల తయారీకి విదేశీ యంత్రాన్ని ఉపయోగించేవారు. ఆ క్రమంలో ఆయన దేశీయంగానే ఆ యంత్రాన్ని రూపొందించారు. బనారసీలాల్ శ్రమ ఫలించింది. రాష్ట్రపతి నుంచీ అభినందనలు అందుకున్నారు. ఇలా.. ఈ కుటుంబం ప్రయోగాలకు కేంద్రంగా మారింది. కల్పనా చావ్లా చదువుల్లో దిట్ట. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. 1982 లో తొలిసారి అమెరికాలో అడుగు పెట్టారు. అది కూడా ఉన్నత విద్య కోసమే. అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి "ఏరోస్పేస్ ఇంజనీరింగ్"లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. చదువులో ఆమె ఉత్సాహాన్ని చూసిన ఉపాధ్యాయులు ఎంతో ప్రోత్సహించారు. దీంతో కల్పన పిన్నవయసులోనే గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఇక, విద్యాభ్యాసం చేస్తూనే అమెరికాలో ఆమె ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. ఇలా తొలిసారి నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్(NASA)లో ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. ఈ ఉద్యోగానికి ఏకంగా 2 వేల మంది పోటీ పడ్డారు. అయితే కల్పనా చావ్లా ఉత్సాహం.. ఆమెలోఉన్న జిజ్ఞాసలను గుర్తించిన ఎంపిక బోర్డు.. కల్పనా చావ్లాను ఎంపిక చేసింది. ఇక, అప్పటి నుంచి చావ్లా వెనుదిరిగి చూడలేదు. ఇల్లు, ఒళ్లు.. అన్నీ నాసానే అన్నట్టుగా తన జీవితాన్ని అంకితం చేశారు.
ప్రపంచానికి పరిచయం ఇలా..
1994లో మొట్టమొదటిసారి కల్పనా చావ్లా పేరు ప్రపంచానికి తెలిసింది. దీనికి కారణం నాసా చేపట్టిన మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి చావ్లా ఎంపిక కావడమే. 1995 లో చావ్లా సహా 22 మందితో కలసి నాసాకు చెందిన వ్యోమగామి శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. టెక్సాస్ లోని హూస్టన్ లో ఉన్న జాన్సన్ స్పేస్ సెంటర్లో శిక్షణ నిర్విఘ్నంగా సాగింది. ఏరో డైనమిక్స్ ఉపయోగానికి సంబంధించిన సమర్థమైన మెళకువలు నేర్చుకున్నారు. 1983లో విమానయాన శిక్షకుడు, విమాన చోదక శాస్త్ర రచయిత ఐన జీన్-పియర్ హారిసన్ ను వివాహం చేసుకున్నారు, 1990 లో యునైటెడ్ స్టేట్స్ దేశ పౌరసత్వం పొందారు. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ మహిళగా ఖ్యాతి గడించింది. 1997 లో మొదటిసారిగా కొలంబియా స్పేస్ షటిల్ లో రోబోటిక్ ఆర్మ్ ఆపరేటరుగా ఆమె అంతరిక్షంలోకి వెళ్లారు. అది విజయవంతమైంది. తర్వాత 2003లో రెండవసారి అదే రకమైన స్పేస్ షటిల్ లో ఆమె అంతరిక్ష ప్రయాణం చేశారు. అయితే, 2003 ఫిబ్రవరి 1న వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆమె మృత్యువాత పడ్డారు. చావ్లా మరణానంతరం కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ అందించారు. పలు వీధులు, విశ్వవిద్యాలయాలు, సంస్థలకు కల్పనా చావ్లా పేరు పెట్టడం గమనార్హం. భారతదేశం కూడా కల్పనా చావ్లా స్మృత్యర్థం ఇస్రోలో కేంద్రానికి ఆమె పేరును పెట్టింది.
కృషి ఉంటే..
కృషి ఉంటే మనుషులు రుషులవుతారన్న దానికి కల్పనా చావ్లా చక్కని ఉదాహరణ. తాను ఏర్పరుచుకున్న లక్ష్యం దిశగా ఆమె వడివడి అడుగులు వేశారు. వ్యోమగామిగా ఎంపిక కావడమే కష్టమని అనుకుంటే.. దానికి ఎంపిక కావడమే కాదు.. శిక్షణలో భాగంగా ఆమె ఎంతో శ్రమించి.. తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. వ్యోమగాములందరూ కొండలు ఎక్కుతూ తాము తెచ్చుకున్న బరువులను మోయలేక ఒక్కొక్కరు వాటిని వదిలివేస్తూ ఉంటే కల్పన మాత్రం ఏమాత్రం కష్టమని భావించకుండా.. అత్యంత సునాయాసంగా వాటిని అధిరోహించారు. శారీరక శ్రమ విషయంలో పురుషుల కంటే తాను తక్కువ కాదని నిరూపించుకున్నారు. కల్పన ఒక శక్తిగా ఎదిగారు. కాబట్టే.. 1988 లో నాసా లోని రీసెర్చి సెంటర్ లో సైంటిస్ట్ గా చేరిన కల్పన అయిదేళ్ళకే ఎన్నో పరిశోధనలు చేసి కాలిఫోర్నియా ఓవర్ సెట్ మెథడ్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అందుకే.. కల్పనా చావ్లా ఈ ప్రపంచానికి దూరమై 21 సంవత్సరాలు గడిచినా.. ఆమె స్ఫూర్తి మాత్రం నిరంతరాయంగా ఈ ప్రపంచంపై ప్రసరిస్తూనే ఉంది.