Gaganyaan Mission: సాంకేతిక లోపంతో ఆగిన గగన్‌యాన్ మిషన్ తొలి పరీక్ష- పది గంటలకు రీషెడ్యూల్
Gaganyaan Mission: గగన్‌యాన్ ప్రయోగంలో తొలి పరీక్ష సాంకేతిక కారణాలతో ఆగింది. దీన్ని పది గంటలకు రీ షెడ్యూల్ చేశారు.
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ ప్రయోగంలో తొలి పరీక్ష సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ప్రయోగానికి ఐదు సెకన్ల ముందు శాస్త్రవేత్తలు పరీక్షను నిలిపేశారు. పది గంటలకు రీ షెడ్యూల్ చేశారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి గగన్ యాన్ మిషన్ మొదటి పరీక్షను మొదట ఉదయం 8 గంటలకు నిర్వహించాలనుకున్నారు. కానీ సాంకేతిక కారణాలతో ముందు 8,30కి వాయిదా వేశారు. ఆఖరి నిమిషంలో కూడా పరీక్ష వాయిదా పడింది.
గగన్ యాన్ మిషన్ తొలి ప్రయోగాన్ని ఇవాళ చేయలేదని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. మొదటి ప్రయోగాన్ని ఉదయం 8 గంటలకు నిర్వహించాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రయోగ సమయాన్ని ఉదయం 8.45 గంటలకు మార్చారు. ఇంజిన్ సరిగా పని చేయలేదని చెప్పారు. ఎక్కడ ఏం తప్పు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. రాకెట్, క్రూ మాడ్యూల్ సేఫ్ గా ఉన్నాయి. ఏం తప్పు జరిగిందో చూడటానికి లాంచింగ్ సైట‌్‌కు వెళుతున్నాము. విశ్లేషించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. లోపాన్ని సరిచేసి త్వరలోనే లాంచ్ చేస్తామన్నారు.
తొలి 'ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ -1' (టీవీ-డీ1)లో 'క్రూ ఎస్కేప్ సిస్టం' (సీఈఎస్ ) పరీక్షించాలని భావించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రో మరిన్ని మానవ రహిత మిషన్లు, ఇతర పరీక్షలు నిర్వహించగలుగుతుంది. ఈ విధంగా తొలి గగన్ యాన్ మిషన్ దిశగా అడుగులు వేయాలని భావించారు.
అంతరిక్షంలో భూమి దిగువ కక్ష్యలోకి మనుషులను పంపడమే గగన్ యాన్ మిషన్ ఉద్దేశం. భూ ఉపరితలం నుంచి దీని దూరం 400 కిలోమీటర్లు. ఈ మిషన్ ద్వారా భారత్ తొలిసారిగా మానవులను అంతరిక్షంలోకి పంపి సురక్షితంగా తిరిగి తీసుకురానుంది. భారత్ గగన్ యాన్ మిషన్ ను 2025లో ప్రారంభించనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మనుషులను అంతరిక్షంలోకి పంపితే ఎలాంటి అవాంతరాలు ఉండవని అర్థమయ్యేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది భారత్ అత్యంత ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రాజెక్టుల్లో ఒకటి.
చంద్రయాన్-3 మిషన్ ద్వారా భారత్ ఇప్పటికే విజయవంతమైన ప్రయోగంతో ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంది. ఇప్పుడు తన ఫోకస్‌ను సూర్యుడిపై పెట్టింది. ఇలా ఒక్కో ప్రయోగంతో అంతరిక్షంలో పట్టు పెంచుకుంటుంది. స్పేస్ స్టేషన్‌ను కూడా నిర్మించాలని భారత్ భావిస్తోంది.