Indigo Flight: ఇండిగో విమానంలో ఇంజిన్ వైఫల్యం, దిల్లీ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్
Indigo Flight: ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. దిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తుండగా ఇంజిన్ ఫెయిల్ కావడంతో దిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
Indigo Flight: ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. దిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న విమానంలో ఒక ఇంజిన్ ఫెయిల్ అయింది. ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన పైలట్ చాకచక్యంగా దిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యాడు. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ వల్ల భారీ ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. టేకాఫ్ సమయంలో ఎలాంటి లోపం లేదు. ఆకాశంలోకి ఎగిరిన కొద్దిసేపటికి విమానంలోని ఓ ఇంజిన్ లో పైలట్ లోపాన్ని గుర్తించాడు. అంతలోనే అది విఫలమైంది. దీంతో వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సమాచారం అందించాడు. అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి తీసుకున్నాడు. అనంతరం విమానాన్ని వెనక్కి మళ్లించి దిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం ఈ సంఘటన జరిగింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ టర్న్ బ్యాక్‌కు కారణాన్ని ఇంకా ధృవీకరించలేదు.
4వ తేదీ రోజూ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం
జూన్ 4వ తేదీ అస్సాంలోని గౌహతి నుంచి దిబ్రూగఢ్ కు బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత టెక్నికల్ సమస్యను పైలట్ గుర్తించాడు. వెంటనే విమానాన్ని తిరిగి గౌహతికి మళ్లించాడు. గోపీనాథ్ బోర్డోలాయ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ సమయంలో విమానంలో కేంద్రమంత్రి రామేశ్వర్ తెలి కూడా ఉన్నారు.
ఏప్రిల్ లోనూ ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
ఈ ఏడాది ఏప్రిల్ 4 వ తేదీన బెంగళూరు నుంచి వారణాసికి వెళ్తున్న ఇండిగో విమానం సాంకేతిక లోపంతో శంషాబాద్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇండిగో 6ఈ 897 విమానం వారణాసికి బయలు దేరగా.. కాసేపటికే విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించాడు పైలట్. వెంటనే దగ్గర్లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వడంతో పైలట్ సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులను దించేసి వారణాసి వెళ్లాల్సిన మరో విమానంలో ప్రయాణికులను తరలించారు.
ఫిబ్రవరిలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్, మహిళ మృతి
సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి దిల్లీ వస్తున్న ఇండిగా విమానాన్ని ఫిబ్రవరి 7వ తేదీన ఉదయం జోధ్‌పూర్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే ఈ ల్యాండింగ్ సాంకేతిక కారణాల వల్ల జరగలేదు. విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళకు గుండెపోటు రావడంతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అయినా మహిళ ప్రాణాలు నిలవలేదు.
ఇండిగో ఫ్లైట్‌లో ఘటన..
జనవరిలో మదురై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో ఫ్లైట్‌లో ఓ 60 ఏళ్ల వ్యక్తి ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యాడు. నోట్లో నుంచి రక్తం రావడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. పరిస్థితి విషమించడం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇండోర్‌లోని దేవి అహిల్యాబాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ల్యాండ్ అయిన క్షణాల్లోనే ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. అప్పటికే ఆ వ్యక్తి చనిపోయినట్టు వైద్యులు నిర్ధరించారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial