US Immigration: అమెరికా వెళ్లే విద్యార్థులు జాగ్రత్తగా సమాధానాలు చెప్పాలి, ఏ మాత్రం తేడా ఉన్నా ఇంటికే!
US Immigration: ఉన్నత విద్య కోసం అమెరికాకు క్యూ కడుతున్న ఇండియన్ స్టూడెంట్స్‌కు విద్యార్థులకు అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు షాక్ ఇస్తున్నారు.
US Immigration: ఉన్నత విద్య కోసం అమెరికాకు క్యూ కడుతున్న ఇండియన్ స్టూడెంట్స్‌కు విద్యార్థులకు అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు షాక్ ఇస్తున్నారు. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోవడం, సోషల్ మీడియా పోస్టులు, బ్యాంకు ఖాతా లావాదేవీలు భారత విద్యార్థులు ఇండియా తిరిగిరావడానికి కారణమవుతున్నాయి. ఇమిగ్రేషన్ అధికారులు కొందరు విద్యార్థులను విమానాశ్రయం నుంచే వెనక్కి పంపించేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇలా దాదాపు 500 మంది భారతీయుల్ని వెనక్కి పంపించారని అంచనా.
గత వారం అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు చిన్నచిన్న పొరపాట్ల కారణంగా, అవగాహన లేమితో తిరిగి స్వదేశం పయనమయ్యారు. వివిధ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు లభించి వాటిలో చేరేందుకు వెళ్లిన భారత విద్యార్థులను శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగో, అట్లాంటా విమానాశ్రయాల్లో వారిని రిటర్న్ ఫ్లయిట్‌లు ఎక్కించారు. వీరిలో ఎక్కువమంది తెలుగువారే ఉన్నారు. సరైన పత్రాలు లేకపోవడం వల్లనే వారిని తిప్పి పంపుతున్నట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్తున్నప్పటికీ కారణాలు వేరుగా ఉన్నట్టు సమాచారం.
విమానాశ్రయాల్లో దిగిన విద్యార్థుల ఎఫ్-1 వీసా, బోర్డింగ్ పాస్ లాంటి వాటిని ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీ చేస్తారు. దీన్ని ‘పోర్ట్ ఆఫ్ ఎంట్రీ’గా పిలుస్తారు. విద్యార్థులను పేరు, తలిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, ఏ వర్సిటీలో ఏ కోర్సు చదవబోతున్నారని అడుగుతారు. ఆర్థిక స్థితిగతులు, ఆదాయ వనరులు, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ వంటి వాటిపైనా ఆరా తీస్తారు. వాటన్నింటికీ ఓపికగా సమాధానాలు చెప్పాలి. లేకపోతే ఇంటికి రావాల్సిందే.
ఇమిగ్రేషన్ అధికారులు అడిగిన ప్రశ్నలకు కొందరు ఆంగ్లంలో సరిగా సమాధానాలు చెప్పలేకపోతున్నారని అమెరికన్ కాన్సులేట్ వర్గాలు చెబుతున్నాయి. వెనక్కి పంపుతున్న వారిలో సగం మంది కనీస ఆంగ్ల పరిజ్ఞానం లేని వారే ఎక్కువగా ఉన్నారు. ఆంగ్లంలో సమాధానాలు చెప్పలేకపోతే.. జీఆర్‌ఈ, టోఫెల్ స్కోర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. అందరిని ఇమిగ్రేషన్ అధికారులు ప్రశ్నించడం, తనిఖీ చేయడం వీలుకాదు. కానీ తమకు అనుమానం వచ్చిన కొందర్ని గదుల్లో కూర్చోబెట్టి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పరిశీలిస్తారు.
వాట్సప్ ఛాటింగ్‌లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, ఈ-మెయిళ్లు తనిఖీ చేస్తారు. వాటిలో పార్ట్ టైమ్ ఉద్యోగానికి సంబంధించినవి, ఫీజులకు అవసరమైన డబ్బు వివరాలు, కన్సల్టెన్సీల ఫీజు గురించి ఉంటే వారి వివరాలు తనిఖీ చేస్తారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతేవెనక్కి పంపడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టు, సెప్టెంబరు నుంచి మొదలయ్యే ఫాల్ సీజన్‌కు వెళ్లే తమ పిల్లల పరిస్థితి ఏంటనే ఆందోళన వారిలో వ్యక్తం అవుతోంది.
గత ఏడాది 1.90 లక్షల మంది అమెరికా వెళ్లగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 91 వేల మంది వెళ్లారు. ఈ ఏడాది చివరి వరకూ ఈ సంఖ్య 2.50 లక్షల నుంచి 2.70 లక్షల మందికి చేరుకోవచ్చని అంచనా. తప్పుడు ధ్రువపత్రాలున్న వారిని అడ్డుకునేందుకు అమెరికా అధికారులు తాజాగా ఒకేసారి 21 మందిని వెనక్కి పంపారు. ప్రతి ఏటా కనీసం 200 మంది ఇలా ఇమిగ్రేషన్‌లో దొరికి వెనక్కి వస్తుంటారని, కానీ ఈ ఏడాది 500 మంది భారతీయులు వచ్చి ఉంటారని అంచనా.
ఈ నేపథ్యంలో విద్యార్థులకు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. వీసా మంజూరు కోసం ఎలాంటి తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించకూడదని, అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉద్యోగం చేయకూడదని, అలాంటి విషయాలు చర్చించకూడదని సూచిస్తున్నారు. చదువుకునే వర్సిటీ, కోర్సు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని, చదువుకునే సమయంలో ఎక్కడ, ఎవరితో ఉంటారన్న అంశంపై స్పష్టత ఉండాలని అంటున్నారు.
ఐ-20 కోసం పూర్తిగా కన్సల్టెన్సీలపై ఆధారపడకుండా సొంతంగా వివరాలు నింపాలని, ట్యూషన్ ఫీజు, ఇతర ఖర్చులకు అవసరమైన డబ్బులు ఎక్కడి నుంచి పొందుతారనే అంశాలపై స్పష్టత ఉండాలి. ఒకవేళ బ్యాంకు రుణం తీసుకుంటే.. ఆ పత్రాలను దగ్గర ఉంచుకోవాలని సూచిస్తున్నారు.