Indian Railway Rules: ట్రైన్ జర్నీలో ఈ తప్పులు చేస్తే ఇబ్బందులు తప్పవు, ఈ రూల్స్ తెలుసుకోండి
Indian Railways | రైలు ప్రయాణం సులభంగా, సౌకర్యవంతంగా ఉండాలంటే మీరు కొన్ని నియమాలు పాటించాలి. చిన్న తప్పులు పెద్ద సమస్యగా మారి జరిమానాలకు దారి తీయవచ్చు.

రైలు ద్వారా దేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణిస్తున్నారు. ఇతర ప్రయాణాలతో పోల్చితే రైలు ప్రయాణం చాలా చవకైనది. సుదూర ప్రయాణాలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. రైలులో ప్రయాణించే వారి కోసం రైల్వే శాఖ కొన్ని నిబంధనలను రూపొందించింది. వాటిని అందరూ పాటించాల్సిందే. అయితే ప్రయాణికులు తమ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ, నిబంధనలను ఉల్లంఘించినప్పుడు చిక్కుల్లో పడతారు.
రైల్వే నిబంధనలను ఉల్లంఘించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. వీటిని ఉల్లంఘిస్తే కొన్నిసార్లు జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రయాణాన్ని మధ్యలోనే నిలిపివేసే అవకాశం ఉంది. మీరు రైలులో ప్రయాణిస్తుంటే, ఈ రైల్వే రూల్స్ తెలుసుకోవడం చాలా అవసరం. మీ చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యలను తెచ్చి పెడుతుంది. రైల్వే శాఖ రూల్స్ ఇక్కడ తెలుసుకోండి.
రైలులో ఈ నిబంధనలను పాటించకపోతే చిక్కులు తప్పవు
రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం, వారి భద్రత కోసం రైల్వే మంత్రిత్వశాఖ అనేక నిబంధనలను రూపొందించింది. ఉదాహరణకు, మిడిల్ బెర్త్‌ను పగటిపూట ఎవరూ బలవంతంగా తెరవకూడదు. ఎందుకంటే ఇది రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలి. అదేవిధంగా ప్రయాణ సమయంలో ధూమపానం (Smoking) చేయడం పూర్తిగా నిషేధించారు. ఎవరైనా రైలులో సిగరెట్ తాగితే, సంబంధిత అధికారి వారికి జరిమానా విధించనున్నారు.
అదేవిధంగా ఎవరైనా గట్టిగా సౌండ్ పెట్టి మ్యూజిక్, పాటలు వినడం లేదా ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడటం సైతం నిబంధనలను ఉల్లంఘించడమే. ఈ విషయాలు ఇతర ప్రయాణికులకు చికాకు కలిగిస్తాయి. వారి జర్నీని ప్రశాంతంగా సాగనివ్వవు. అలాంటి పరిస్థితులో రైల్వే సిబ్బంది నేరుగా చర్యలు తీసుకుంటారు. కొన్ని సందర్భాలలో హెచ్చరించడం మాత్రమే కాదు ఆ ప్రయాణికుడికి జరిమానా సైతం విధించవచ్చు.
రాత్రి సమయంలో ఈ నిబంధనలు పాటించాలి
చాలా మంది రాత్రిపూట రైలు ప్రయాణం చేయాలని భావిస్తారు. అయితే రాత్రివేళ ప్రయాణం కోసం కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికులు మొబైల్స్‌లో బిగ్గరగా మాట్లాడటం లేదా లైట్లు వేయడం లాంటివి చేయకూడదు. తద్వారా ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. చాలా మంది అర్ధరాత్రి వరకు లైట్లు వేస్తారు, దీనివల్ల తోటి ప్రయాణికులకు ఇబ్బంది పడతారు. దీనిపై ఎవరైనా ప్రయాణికుడు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేస్తే, వెంటనే చర్యలు తీసుకుంటారు.
అంతేకాకుండా, మీది కింది బెర్త్ (Lower Berth) అయితే.. మీకు నిద్ర రాకపోతే, మీరు కూర్చోవాలనుకున్నా సైతం, మిడిల్ బెర్త్ ప్రయాణికుడిని నిద్రపోనివ్వాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో మిడిల్ బెర్త్ వారితో పట్టుబట్టకూడదు. రాత్రివేళ కనుక మిడిల్ బెర్త్ తెరిచేందుకు అడ్డు చెప్పకూడదు. ఈ నియమాలన్నీ మీ ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా చేయడానికి వీలు కల్పిస్తాయి.
టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో జైలుశిక్షకు దారితీసే ఛాన్స్ ఉంది. మీరు స్లీపర్ బుక్ చేసుకుని ఏసీ కోచ్ ఎక్కి ఇతరుల్ని ఇబ్బంది పెట్టినా మీ మీద చర్యలు తీసుకుంటారు. టీటీఈ విధించే జరిమానా చెల్లించక తప్పదు.






















