Indian Railways: డిజిల్ ఇంజన్లను మూలకుపడేయనున్న రైల్వే శాఖ - ఎందుకో తెలుసా ?
Indian Railways: ఇండియన్ రైల్వేస్ నెట్‌వర్క్‌లో వంద శాతం విద్యుదీకరణ త్వరలోనే పూర్తి కానుంది. ఈ మేరకు రైల్వే శాఖ నివేదిక విడుదల చేసింది.

Indian Railways: ఇండియన్ రైల్వేస్ నెట్‌వర్క్‌లో వంద శాతం విద్యుదీకరణ త్వరలోనే పూర్తి కానుంది. ఈ మేరకు రైల్వే శాఖ నివేదిక విడుదల చేసింది. జులై 31 నాటికి 69,102 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ లైన్‌లో విద్యుదీకరణ పూర్తయింది. ఇంకా కేవలం 698 కిలోమీటర్ల నెట్‌వర్క్‌లో విద్యుదీకరణ పనులు పూర్తి చేస్తే మొత్తం వంద శాతం పనులు పూర్తయినట్లే. ఇప్పటివరకు రైల్వే నెట్‌వర్క్‌లో 99 శాతం విద్యుదీకరణ పనులు పూర్తి చేసినట్లు రైల్వే శాఖ తన నివేదికలో తెలిపింది.
కరోనా కారణంగా విద్యుదీకరణ పనుల్లో జాప్యం
ఎన్‌డీఏ ప్రభుత్వంలో నాటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆధ్వర్యంలో 2016లో ఈ మిషన్ ఎలక్ట్రిఫికేషన్ పనులు ప్రారంభమయ్యాయి. 2022 నాటికి రైల్వే నెట్‌వర్క్‌ను వంద శాతం విద్యుదీకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే మధ్యలో కరోనా రావడంతో పనులకు అంతరాయం కలిగింది. అయినా 2019-2025 మధ్య కాలంలో సగటున 15 కిలోమీటర్ల మేరకు విద్యుదీకరణ పనులను రైల్వే శాఖ చేపట్టింది. మరో రెండు, మూడు నెలల్లో మిగతా 698 కిలోమీటర్ల రైల్వే లైన్లలో విద్యుదీకరణ పనులు పూర్తి చేయాలని రైల్వే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
పనులు మిగిలి ఉన్న రాష్ట్రాలు, జోన్లు ఇవే...
భారతీయ రైల్వే నివేదిక ప్రకారం, దేశంలోని రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, గోవా, అస్సాం రాష్ట్రాలలో మాత్రమే విద్యుదీకరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనే 698 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ చేపట్టాల్సి ఉంది. ఇక జోన్ల వారీగా చూస్తే పశ్చిమ, మధ్య, తూర్పు, ఉత్తర, దక్షిణ మధ్య రైల్వే వంటి పెద్ద జోన్లలో ఇప్పటికే వంద శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని సాధించాయి. కొన్ని జోన్లలోనే ఇంకా స్వల్ప పనులు మిగిలి ఉన్నాయి.
భారతీయ రైల్వే నివేదిక ప్రకారం, 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, గోవా, అస్సాంలలో మాత్రమే విద్యుదీకరణ పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలలో మొత్తం 698 కిలోమీటర్ల మేర పనులు చేయాల్సి ఉంది. ఉత్తర పశ్చిమ రైల్వే (98%), దక్షిణ రైల్వే (97%), నైరుతి రైల్వే (95%), ఈశాన్య సరిహద్దు రైల్వే (94%) విద్యుదీకరణ పనులు పూర్తి చేశారు. మిగిలినవి మరో రెండు, మూడు నెలల్లో పూర్తి చేసే అవకాశం ఉంది.
2019-2025 మధ్య కాలంలోనే వేగంగా పనులు
రైల్వే శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1948 నుంచి 2014 వరకు 21,413 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్ విద్యుదీకరణ పూర్తి కాగా, 2014-2019 మధ్య కాలంలో 13,687 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేయడం జరిగింది. ఇక 2019-2025 మధ్య కాలంలో 33,213 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసినట్లు ఈ నివేదిక ద్వారా రైల్వే శాఖ తెలియజేసింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వే విద్యుదీకరణ పనుల కోసం రూ. 6,150 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే వంద శాతం రైల్వే నెట్‌వర్క్ విద్యుదీకరణ లక్ష్యం సాధిస్తామని చెబుతున్నారు.
రైల్వేస్‌లో డీజిల్‌కు చెల్లు చీటి
ఇప్పటిదాకా విద్యుదీకరణ లేని లైన్లలో రైల్వే శాఖ డీజిల్‌తోనే రైలు ఇంజిన్లు నడిపిస్తున్నారు. వంద శాతం విద్యుదీకరణ లక్ష్యం సాధిస్తే డీజిల్ వాడకం పూర్తిగా తగ్గిపోతుంది. తద్వారా ఇంధన దిగుమతులు తగ్గి, విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. దీనివల్ల రైల్వే శాఖకు ఖర్చు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా, డీజిల్ వాడకం తగ్గిపోవడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది.






















