INDIA Alliance Meeting: ముంబయి వేదికగా ప్రతిపక్ష కూటమి సమావేశం, 27 పార్టీలు హాజరు
INDIA Alliance Meeting: ప్రతిపక్ష కూటమి I.N.D.I.A భాగస్వామ్య పార్టీలు రేపు సమావేశం కానున్నాయి.
INDIA Alliance Meeting: బీజేపీని గద్దె దించి, అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏకమైన ప్రతిపక్ష పార్టీలో ముంబయి వేదికగా రేపు మరోసారి సమావేశం కానున్నాయి. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో I.N.D.I.A(ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) లోని 27 బీజేపీయేతర పార్టీలు జాతీయ స్థాయిలో సమావేశం కానున్నాయి. రెండ్రోజుల పాటు జరిగే సమావేశానికి కూటమి భాగస్వామి పార్టీలన్నీ హాజరు కానున్నాయి. ఈ సమావేశంలోనే కూటమి లోగోను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్రాల ఎన్నికల్లో సీట్ల పంపకంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఉమ్మడి కార్యక్రమాలను, దేశవ్యాప్తంగా చేయాల్సిన ఆందోళనలు, పోరాటాలపై ఉమ్మడి ప్రణాళికలను రూపొందించనున్నాయి.
ప్రతిపక్ష కూటమికి నేతృత్వం వహించేందుకు కోఆర్డినేటర్ లేదా ఛైర్ పర్సన్ ఉండాలనే అంశంపై కూడా సభ్యులు చర్చించనున్నారు. రాబోయే కాలంలో నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాల కార్యాచరణ, ప్రణాళికనే ప్రధాన అజెండాగా ఈ సమావేశం ఉంటుందని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నందున అభ్యర్థులను నిర్ణయించడానికి కూడా చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. I.N.D.I.A కూటమికి కన్వీనర్ ను కూడా రేపు నిర్ణయిస్తామని తెలిపారు.
ఈ ప్రతిపక్ష కూటమి సమావేశం సజావుగ సాగేందుకు, సమావేశానికి సంబంధించిన వివిధ ఏర్పాట్లను నిర్వహించడానికి పలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలలో మీడియా నిర్వహణ, సోషల్ మీడియా, వసతి, రవాణా ఏర్పాట్లు, భద్రత, ప్రముఖులను స్వాగతించడం వంటి పనులకు బాధ్యత వహిస్తాయి. ప్రతి కమిటీలో ప్రతి పార్టీ నుంచి ఇద్దరు నాయకులు ఉంటారు.
మీడియా కవరేజీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారం, ఇతర కమ్యూనికేషన్ ఛానళ్లను పర్యవేక్షించే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంది. సమావేశం కోసం రవాణా నిర్వహణ బాధ్యతను ఎన్సీపీ నిర్వహిస్తోంది. ప్రతిపక్ష పార్టీల మూడో సమావేశానికి హోస్ట్‌గా, వకోలాలోని గ్రాండ్ హయత్ హోటల్ లో సమావేశానికి సంబంధించిన బస, విందు, ఇతర ఏర్పాట్లను శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) చూసుకుంటోంది. సమావేశానికి హాజరయ్యే ప్రముఖులు, నేతలు బస చేసేందుకు రెండ్రోజులుగా దాదాపు 150 గదులను బుక్ చేశారు. ఈ సమావేశానికి ఐదుగురు ముఖ్యమంత్రులతో పాటు 26 వేర్వేరు పార్టీలకు చెందిన దాదాపు 80 మంది ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.
ప్రతిపక్ష కూటమి సమావేశానికి హాజరుకానున్న నేతలు
- శివసేన(ఉద్ధవ్‌ఠాక్రే) - ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్యా ఠాక్రే, సంజయ్ రౌత్
- కాంగ్రెస్ - సోనియా గాందీ, రాహుల్ గాందీ, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్
- టీఎంసీ - మమతా బెనర్జీ, డెరెక్ ఓబ్రెయిన్, అభిషేక్ బెనర్జీ
- డీఎంకే - ఎంకే స్టాలిన్, టీఆర్ బాలు
- ఆప్ - అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా
- జేడీయూ - నితీష్ కుమార్, లాలన్ సింగ్, సంజయ్ కుమార్ సింగ్
- ఆర్జేడీ - లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్, మనోజ్ ఝా, సంజయ్ యాదవ్
- జేఎంఎం - హేమంత్ సోరెన్, అభిషేక్ ప్రసాద్, సునీల్ కుమార్ శ్రీవాస్తవ
- ఎన్సీపీ - శరద్ పవార్, సుప్రియా సూలే, జయంత్ పాటిల్
- ఎస్పీ - అఖిలేష్ యాదవ్, రాంగోపాల్ యాదవ్, కిరణ్మయి నందా, అబు అజ్మీ
- ఆర్ఎల్డీ - జయంత్ సింగ్ చౌదరి, షాహిద్ సిద్ధిఖీ
- అప్నా దళ్ - కృష్ణ పటేల్, పంకజ్ నిరంజన్
- నేషనల్ కాన్ఫరెన్స్ - ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా
- పీడీపీ - మెహబూబా ముఫ్తీ, ఇల్తిజా ముఫ్తీ
- సీపీఎం - సీతారాం ఏచూరి, అశోక్ ధావలే
- సీపీఐ - డి రాజా, బినోయ్ విశ్వం, భాలచంద్ర కాంగో
- ఆర్ఎస్పీ - మనోజ్ భట్టాచార్య
ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ - జి దేవరాజన్ - ఎండీఎంకే - వైకో ఎంపీ
- వీసీకే - తోల్ తిరుమావళవన్, ఎం దయాళన్, డి రవికుమార్
- కేఎండీకే - ఈశ్వరన్ రామసామి
- సీపీఎం లిబరేషన్ - దీపాంకర్ భట్టాచార్య, వి అరుణ్ కుమార్
- ఎంఎంకే - ఎంహెచ్ జవహిరుల్లా
- ఐయూఎంఎల్ - కాదర్ మొహిదీన్, పికె కున్హాలికుట్టి, సయ్యద్ సాదిక్ అలీ షిహాబ్ తంగల్
- కేరళ కాంగ్రెస్ - జోస్ కె మణి
- కేరళ కాంగ్రెస్ (J) - పిసి థామస్
- పీసంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా - జయంత్ పాటిల్