Modi 3.O@100 days : వంద రోజుల పాలన అద్భుతం- ప్రతి సెక్టార్‌లో ప్రగతి: మోదీ
Modi Comments On 100 Days: మూడోసారి అధికారం చేపట్టిన తొలి వంద రోజుల్లోనే.. దేశాభివృద్ధికి అవసరమైన ప్రతి సెక్టార్‌లో ప్రగతి కనబరిచామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.
NDA @100 Days: మూడో సారి అధికారం చేపట్టిన తొలి వంద రోజుల పాలనపై మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి సెక్టార్‌లో ప్రగతి చూపించామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గుజరాత్ గాంధీనగర్‌లో జరుగుతున్న గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్‌పో 4వ ఎడిషన్‌ను నరేంద్ర మోదీ సోమవారం నాడు ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుండగా పది వేల మంది వరకు వివిధ రంగాలకు చెందిన డెలిగేట్స్.. అధికారులు ఇతర బ్యూరోక్రాట్లు పాల్గొననున్నారు.
ఈ ఈవెంట్‌లో ప్రారంభోపన్యాసం చేసిన మోదీ భారతీయులు మాత్రమే కాదని.. ప్రపంచ మానవాళి మొత్తం 21వ శతాబ్ది సవాళ్లు ఎదుర్కోవడంలో భారత్ వైపు చూస్తోందని మోదీ అన్నారు. ఈ వంద రోజుల పాలనలోనే తమ ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా చెప్పామని.. భారతదేశ పురోభివృద్ధే లక్ష్యంగా ప్రతి నిర్ణయం సాగిందని మోదీ వివరించారు. భారత దేశపు వైవిధ్యం.. శక్తి, స్థాయి, మానవ వనరులు, పనితీరు ఎంతో ప్రత్యేకమైనవని ప్రధాని అన్నారు. ప్రపంచానికి అన్వయించి సమస్యల పరిష్కారానికి అనువుగా మన చర్యలు ఉంటాయన్నారు. వచ్చే వెయ్యేళ్ల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని భారత్ తన అభివృద్ధిపై దృష్టి సారిస్తుందన్న మోదీ.. టాప్ ర్యాంక్ సాధించడం తమ లక్ష్యం కాదని.. దానిని ఎల్లవేళలా నిలుపుకోవడంపైనే దృష్టి పెట్టినట్లు తెలిపారు. తమకు గ్రీన్ ఫ్యూచర్, నెట్ జీరో అన్న పదాలు ఫ్యాషన్ కాదని.. భారతదేశపు భవిష్యత్‌కు ఎంతో ముఖ్యమైనవని.. వాటి సాధనకు కట్టుబడి ఉన్నామని అన్నారు.
క్లైమెట్ ఛేంజ్ అన్న అంశం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదని.. దశాబ్దాల క్రితమే మహాత్మ గాంధీ జీవితాన్ని చూస్తే అర్థం అవుతుందని అన్నారు. అయోధ్యతో పాటు మరో 16 నగరాలను మోడల్ సోలార్ సిటీలుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రీ- ఇన్వెస్ట్- 2024లో వివరించారు. త్వరలోనే భారత్‌ను మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు 140 కోట్ల మంది భారతీయులు ప్రతిన బూనారని మోదీ చెప్పారు. తాము 2047 నాటికి ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామన్న మోదీ.. తమకు సొంత ఆయిల్ సోర్సెస్ అవసరం మేర లేనందున.. రెన్యూవబుల్ ఎనర్జీ మీద దృష్టి పెట్టినట్లు తెలిపారు. సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. వారి వారి రాష్ట్రాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ పెట్టుబడులకు సంబంధించి డెన్మార్క్, జర్మనీ, ఆస్ట్రేలియా, యూఎస్ తదితర దేశాల రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు.
వంద రోజుల్లో మూడు లక్షల కోట్ల రూపాయల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ప్రారంభం:
దేశ వ్యాప్తంగా 25 వేల ఆవాసాలను కలుపుతూ 49 వేల కోట్ల రూపాయల ఖర్చుతో 60 వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేయడం సహా 3 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు మొదలు పెట్టినట్లు మోదీ పేర్కొన్నారు. 76 వేల 200 కోట్ల రూపాయల ఖర్చుతో మహారాష్ట్ర వధ్‌వాన్‌లో పెద్ద పోర్టు కూడా ఇందులో భాగమే. ఖరీప్ సాగులో పండించే పంటలకు కనీస మద్దతు ధర సహా అనేక ఇతర కార్యక్రమాలు కూడా ఈ వంద రోజుల్లోనే పూర్తి చేశారు. ఇంకా జీఎస్‌టీలో కూడా 140 వస్తువులకు సంబంధించి ట్యాక్స్ రేట్లు కూడా తగ్గించినట్లు ప్రభుత్వం తెలిపింది. మరో 50 వేల 600 కోట్లతో దేశవ్యాప్తంగా 8 హైస్పీడ్ రోడ్ కారిడార్ రోడ్ నెట్ వర్క్‌ను 936 కిలోమీటర్ల మేర ఖర్చు చేయనున్నారు. ఉద్యోగ కల్పన మీద కూడా భారీగా ఖర్చు చేయనున్నట్లు ఎన్‌డీఏ సర్కారు 3.O లో భాగమని చెప్పారు.
Also Read: గ్రీన్ ఎనర్జీకి ఆకాశమే హద్దు- ఎలా అమలు చేయాలనేది కీలకం: ఏపీ సీఎం చంద్రబాబు