Gujarat PASAA Act: దేశ రాజధాని ఢిల్లీలో గుజరాత్ చట్టం, హోంశాఖకు సిఫార్సు చేసిన లెఫ్ట్‌నెంట్ గవర్నర్!
Gujarat PASAA Act: గుజరాత్‌లో అమలవుతున్న PASAA యాక్ట్‌ని ఢిల్లీలోనూ అమలు చేయాలని ఎల్‌జీ సూచించారు.
Gujarat PASAA Act:
పాసా చట్టం..
దేశ రాజధాని ఢిల్లీలో గుజరాత్ చట్టం అమలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (VK Saxena)కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు దీనిపై సిఫార్సు చేశారు. "The Gujarat Prevention of Anti-Social Activities Act (PASAA)' చట్టం ఢిల్లీలోనూ అమలు చేయాలని ప్రతిపాదించారు. 1985లో గుజరాత్‌లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో భాగంగా...మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, అక్రమంగా సరుకులు రవాణా చేసే వాళ్లు, డ్రగ్స్ ముఠాలు, ట్రాఫిక్‌ని ఉల్లంఘించే వాళ్లు..స్థలాలు కబ్జా చేసే వాళ్లు..ఇలా నిందితులందరినీ ముందస్తుగా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే...ఏదైనా అల్లర్లు జరుగుతాయని ముందస్తుగా సమాచారం వచ్చినప్పుడు శాంతి భద్రతలు కాపాడేందుకు వీళ్లను ముందుగానే అదుపులోకి తీసుకుంటారు. అయితే..గుజరాత్‌లో ఈ చట్టాన్ని అమలు చేయడంపైనే విమర్శలు వెల్లువెత్తాయి. వ్యక్తిగత కక్ష్యల కోసమే ఈ దీన్ని తీసుకొచ్చారని వాదనలు వినిపించాయి. చాలా సందర్భాల్లో ఈ చట్టాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. కోర్టు కూడా ప్రభుత్వాన్ని మందలించింది. ఇలాంటి చట్టాలు ఎలా చేస్తారని ప్రశ్నించింది.
వివాదాస్పదం..
రెండేళ్ల క్రితం దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. డాక్టర్ మిథేష్ టక్కర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా రోగులకు రెమెడెసివర్ ఇంజెక్షన్‌లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారని అనుమానించారు. ఆయనను అరెస్ట్ చేసి దాదాపు 106 రోజుల పాటు జైల్లో ఉంచారు. 2021 జులై 27వ తేదీన కోర్టు ఆదేశాలతో విడుదల చేశారు. PASAA యాక్ట్ కింద ఆయనను అరెస్ట్ చేయడాన్ని కోర్టు ఖండించింది. ఈ చట్టంలోని గైడ్‌లైన్స్‌ని మార్చాల్సిన అవసరముందని గుజరాత్ హైకోర్టు ఈ ఏడాది మే నెలలో సూచించింది. ఎలాంటి ఆధారాలు, వెరిఫికేషన్ లేకుండా ఇష్టారీతిన అరెస్ట్ చేయకూడదని తేల్చి చెప్పింది.
Also Read: అగ్నిపథ్ స్కీమ్‌లో భారీ మార్పులు, 50% మంది అగ్నివీరులకు రెగ్యులర్ క్యాడర్!