Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Unstoppable With NBK Season 4: నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ 4'కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నారు. ఆయన ఎపిసోడ్ షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది? స్ట్రీమింగ్ ఎప్పుడు? అంటే
నట సింహం నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్... ఈ ముగ్గురు సంక్రాంతి 2025 హీరోలు. వీళ్ళ సినిమాలు థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే కాదు... డిజిటల్ స్క్రీన్ మీద కూడా ఈ ముగ్గురూ సందడి చేయనున్నారు. అదేనండి... ఆహా ఓటీటీలో. మిగతా ఇద్దరు హీరోలను బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయనున్నారు.
'అన్‌స్టాపబుల్ 4'కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్!
Unstoppable Season 4: 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికే' సీజన్ 4లో ఓ సంక్రాంతి హీరో విక్టరీ వెంకటేష్ ఆల్రెడీ సందడి చేశారు. ఆయన ఎపిసోడ్ ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా రానున్నారు.
డిసెంబర్ 31వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో రామ్ చరణ్ 'అన్‌స్టాపబుల్ 4' ఎపిసోడ్ షూటింగ్ జరగనుంది (Ram Charan In Unstoppable Season 4). ఇంతకు ముందు బాలకృష్ణ, చరణ్ మధ్య సంభాషణ ఎలా ఉంటుందో వీక్షకులు చూశారు. ప్రభాస్ ఎపిసోడ్ లో చరణ్ ఫోన్ ద్వారా మాట్లాడారు. అది వైరల్ అయింది. ఇప్పుడు రామ్ చరణ్ నేరుగా 'అన్‌స్టాపబుల్ 4' కార్యక్రమానికి వస్తున్నారు. ఆయన్ను బాలకృష్ణ ఎటువంటి ప్రశ్నలు అడుగుతారో చూడాలి.
సంక్రాంతికి డిజిటల్ తెరపై బాలకృష్ణ చరణ్ ధమాకా!
సంక్రాంతి కానుకగా రామ్ చరణ్ 'అన్‌స్టాపబుల్ 4' ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయడానికి ఆహా ఓటీటీ వేదిక సన్నాహాలు చేస్తోందని సమాచారం. 'గేమ్ చేంజర్' సినిమా జనవరి 10న థియేటర్లలోకి రానుంది. బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన సినిమా 'డాకు మహారాజ్'. అది జనవరి 12న థియేటర్లలోకి వస్తుంది. ఈ రెండు సినిమాలకు ఉపయోగపడేలా ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... కాంట్రవర్సీని క్యాష్ చేసుకోవడమా? శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
సంక్రాంతి పోటీ చర్చకు వస్తుందా? హీరోలు ఏమంటారు?
'అన్‌స్టాపబుల్' కార్యక్రమం ద్వారా బాలకృష్ణ ప్రేక్షకులలో ఉన్న పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ అతిథిగా వచ్చినప్పుడు 'మన ఇద్దరికీ గొడవ అంట కదా' అని నేరుగా అడిగేశారు. ఆ రూమర్ గురించి ప్రేక్షకులలో ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. సంక్రాంతి కాంపిటీషన్ గురించి ప్రతి ఏడాది అభిమానుల మధ్య భారీ ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ కాంపిటీషన్, అలాగే మెగా - నందమూరి కాంపిటీషన్ గురించి రామ్ చరణ్ - బాలకృష్ణ మధ్య చర్చ వస్తుందా? ఒకవేళ వస్తే అప్పుడు చరణ్, బాలయ్య ఏం చెబుతారు? అనే ఆసక్తి నెలకొంది.