GST Rate Cut: నేటి నుంచి జీఎస్టీ కొత్త స్లాబ్స్ అమలు, దిగి రానున్న ధరలు.. ఈరోజే ఎందుకు చేశారంటే
PM Modi On GST Reforms | నేటి (సెప్టెంబర్ 22) నుంచి దేశంలో జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వస్తున్నాయి. జీఎస్టీ తగ్గింపుతో దేశంలో కొత్త శకం ఆరంభం అవుతుందని, ప్రజలకు ఇది మేలు చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు

GST 2.0 In India from 22 September | న్యూఢిల్లీ: నేటి (సెప్టెంబర్ 22, 2025) నుంచి వస్తువులు, సేవల పన్ను (GST) కొత్త స్లాబ్‌లు అమలులోకి వస్తున్నాయి. 5 శాతం, 18 శాతం జీఎస్టీ స్లాబ్స్ ఉంటాయి. 12 శాతం, 28 శాతం జీఎస్టీ స్లాబ్‌లను కేంద్రం తొలగించింది. లగ్జరీ ఐటమ్స్, పొగాకు ఉత్పత్తులు, ఆల్కాహాల్ లాంటి వాటిపై 40 శాతం జీఎస్టీ విధించారు. 2017లో జీఎస్టీ ప్రారంభమైనప్పటి నుండి భారతదేశ పన్ను వ్యవస్థలో ముఖ్యమైన సంస్కరణలలో ఇది ఒకటి. నిత్యావసర సరుకులు, వస్తువులపై ఎక్కువ శాతం 5 శాతం జీఎస్టీ పరిమితం చేశారు. లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీని పూర్తిగా తొలగించారు.
సెప్టెంబర్ 22 నుంచే ఎందుకు..
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలను ప్రారంభించడానికి సెప్టెంబర్ 22నే తేదీగా ఎందుకు ఎంచుకుందని కొందరు ఆలోచిస్తుంటారు. నవరాత్రి పండుగ నేడు ప్రారంభం అవుతుందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు శుభ సూచకంగా మారాలాని అభివృద్ధి పథంలో నడవాలని భావించి ఈరోజు నుంచి జీఎస్టీ కొత్త స్లాబ్‌లను అమలు చేస్తున్నారు. 295 రకాల వస్తువులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. లేక పూర్తిగా తొలగించడం విశేషం. 56వ GST కౌన్సిల్ సమావేశంలో జీఎస్టీ స్లాబ్ లపై నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని రోజుల కిందటే ప్రకటించారు.
ఈ నవరాత్రి నుండి ఏవి చౌకగా లభిస్తాయి
- విద్యార్థులు: పాఠశాల స్టేషనరీ సామగ్రిపై జీఎస్టీని పూర్తిగా తొలగించారు
- పాల ఉత్పత్తులు: అల్ట్రా-హై టెంపరేచర్ (UHT) పాలు, పనీర్ 0% GST. కొన్ని రకాల పాల ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ
- రోజువారీ అవసరాలు: చాలా గృహ వినియోగ వస్తువులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5% జీఎస్టీ పరిధిలోకి మార్చారు.
- వాహనాలు: చిన్న కార్లు, 350cc వరకు ఉన్న మోటార్‌సైకిళ్లు, బస్సులు, ట్రక్కులు, అంబులెన్స్‌లు ఇప్పుడు 28%కి బదులుగా 18% GSTని అమలు చేస్తున్నారు. ఆటో విడిభాగాలు, మూడు చక్రాల వాహనాలు కూడా 18% జీఎస్టీ పరిధిలోకి వస్తాయి.
- టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మిషన్‌లు, కూలర్, ల్యాప్‌టాప్, ఏసీలపై జీఎస్టీని 18 శాతానికి పరిమితం చేశారు
- ఇళ్ల నిర్మాణాలు: స్టీల్, సిమెంట్ లపై 28 శాతంగా ఉన్న GSTని 18 శాతానికి తగ్గించారు
- పునరుత్పాదక శక్తి: సోలార్ ప్యానెల్స్, విండ్‌మిల్స్, బయోగ్యాస్ ప్లాంట్లు, ఇతర స్వచ్ఛమైన ఇంధన పరికరాలపై రేటు 12–18% నుండి 5% జీఎస్టీకి తగ్గించారు. ఇది పర్యావరణ అనుకూల శక్తిని మరింత అందుబాటులోకి తెస్తుంది.
- వ్యవసాయ పెట్టుబడులు: సల్ఫ్యూరిక్ యాసిడ్, అమ్మోనియా వంటి ఎరువుల భాగాలు కేవలం 5% GST పరిధిలోకి వచ్చాయి. ఇది రబీ సీజన్‌కు ముందు రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
- వస్త్రాలు: హ్యాండ్ మేడ్ ఫైబర్, నూలు GST రేట్లు 5%కి తగ్గించారు.
- లగ్జరీ వస్తువులపై భారీ పన్ను: పెద్ద కార్లు, వ్యక్తిగత ఉపయోగం కోసం వినియోగించే విమానాలు, యాచ్‌లు, పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ విధించారు. అయితే పొగాకు ఉత్పత్తులపై త్వరలో ఈ నిర్ణయం అమలులోకి రానుంది.
ప్రధాని మోదీ ఆదివారం కీలక ప్రసంగం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో దేశ ప్రజలకు దీపావళి బొనాంజ అని చెప్పారు. అందుకు తగ్గట్లుగానే జీఎస్టీ కౌన్సిల్ జీఎస్టీ స్లాబ్ లను తగ్గించి సామాన్యుడికి ధరల నుంచి ఊరట కలిగించింది. 12 శాతం, 28 శాతం జీఎస్టీ స్లాబ్‌లు నేటి నుంచి ఉండవు. ప్రధాని మోదీ ఆదివారం నాడు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. జీఎస్టీ ఉత్సవం సోమవారం నుంచి మొదలవుతుందన్నారు. గత ఎనిమిదేళ్లలో, GSTలో భారీ సంస్కరణలు తీసుకొచ్చాం. ఇది దేశ ప్రజలపై పన్ను భారాన్ని తగ్గిస్తుంది. మనం ఆత్మనిర్భర్ భారత్ గా నిలవాలంటే ఇలాంటి నిర్ణయాలు అవసరం. దేశ ప్రజలకు నవరాత్రి వేడుకల ప్రారంభం నుంచే జీఎస్టీ తగ్గింపు పండుగ మొదలవుతుందని" ప్రధాని మోదీ అన్నారు.






















