Andhra Pradesh News: 99 శాతం నిత్యావసర వస్తువులు 5 శాతం GST పరిధిలోకి: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu | కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో దేశ ప్రజలకు భారీగా ప్రయోజనం ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని స్వదేశీ నినాదానికి సంపూర్ణ మద్దతు తెలిపారు.

GST New Slabs | అమరావతి: నెక్స్ట్ జెన్ జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఆదివారం దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగం గౌరవనీయమైందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకువచ్చిన ఈ జీఎస్టీ సంస్కరణలతో జీఎస్టీ బచత్ ఉత్సవ్ వేడుకలు ప్రారంభించడాన్ని చంద్రబాబు ఆనందకరమైన పరిణామంగా అభివర్ణించారు.
జీఎస్టీ కొత్త స్లాబ్‌లతో అన్నివర్గాలకు మేలు
జీఎస్టీ పన్ను శ్లాబులను కేవలం 5%, 18% శాతాలకు పరిమితం చేయడం వల్ల అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 99 శాతం నిత్యావసర వస్తువులు 5 శాతం పరిధిలోకి రావడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు, రైతులు, మహిళలు, యువతకు ఈ సంస్కరణలు లబ్ధి చేకూరుస్తాయని ఆయన స్పష్టం చేశారు. పన్ను విధానాన్ని సరళతరం చేయడంతో వ్యయాలు తగ్గుతాయని, వ్యాపారాలు అభివృద్ధి చెందడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఈ సంస్కరణలు పనిచేస్తాయని చంద్రబాబు వివరించారు.

ప్రధాని మోదీ సూచించిన "నాగరిక్ దేవో భవ" అనే మంత్రం ప్రజలకు అందే గొప్ప బహుమతి అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. అలాగే "గర్వ్ సే కహో, యే స్వదేశీ హై" అనే నినాదం జాతీయ భావాలను ప్రోత్సహించేలా ఉందని చెప్పారు. ఈ నినాదం ఒక జాతీయ ఉద్యమంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రాలకు చేసిన ‘స్థానిక ఉత్పత్తులను పెంచాలి, వృద్ధిలో సమాన భాగస్వాములు కావాలి’ అనే ప్రధాని పిలుపు సహకార సమాఖ్య సిద్ధాంతానికి బలమైన సందేశమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Congratulations to Hon'ble Prime Minister, Shri @narendramodi Ji, on the visionary launch of the next-generation GST reforms and the commencement of the GST Bachat Utsav, a celebration that truly puts the citizen at the center of governance. The number of tax slabs has been… https://t.co/3OnxS3WepI
— N Chandrababu Naidu (@ncbn) September 21, 2025
ప్రధాని మోదీ నిర్ణయాలకు మద్దతు
ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ స్ఫూర్తితో పని చేయాలన్న ప్రధాని సూచనలకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. స్వర్ణాంధ్ర సాధనకు తాను అంకితమవుతున్నానని ఆయన తెలిపారు. సాహసోపేతమైన నిర్ణయంతో జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చినందుకు రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంస్కరణలతో దసరా పండుగను ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తక్కువ ధరలు, సరళమైన పన్ను విధానంతో ప్రజలు నేరుగా లబ్ధి పొందనున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు. ఆత్మనిర్భరత, జాతీయతా భావం పెంచేలా ప్రతి ఒక్కరూ తమవంతు ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎక్స్ వేదికలో కోరారు.






















