Googleతో ఎన్నికల సంఘం జట్టు, ఫేక్ సమాచార వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా నిబంధనలు
కేంద్ర ఎన్నికల సంఘం గూగుల్ సంస్థతో జట్టు కట్టింది. ఎన్నికల సందర్బంగా తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది.
Google Collaborates With ECI : పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) కు రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. భారతీయ జనతా పార్టీ (Bjp) 195 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించింది. కాంగ్రెస్ (Congress)పార్టీ రెండు జాబితాల్లో 82 మంది అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం( Election Commission Of India) గూగుల్ (Google) సంస్థతో జట్టు కట్టింది.
తప్పుడు సమాచార వ్యాప్తికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యం
ఎన్నికల సందర్బంగా తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. దీని కోసం గూగుల్ సహాకారం తీసుకుంటోంది. అధికారులు నిర్దారించిన సమాచారం మాత్రమే ప్రజలకు చేరేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి రూపొందించే వీడియోలకు లేబుల్ వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల్లో పారదర్శకత కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది. ఓటర్లకు కచ్చితమైన సమాచారం ఇవ్వడమే లక్ష్యంగా పని చేయనున్నట్లు గూగుల్ సంస్థ స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం వైరల్ కాకుండా, వాటికి అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక విధివిధానాలను తయారు చేసింది.
గూగుల్ ప్రకటనల విషయంలోనూ జాగ్రత్తలు
ఓటరు జాబితాలో పేరు ఎలా నమోదు చేసుకోవాలి ? ఎలా ఓటు వేయాలి ? పోలింగ్ కేంద్రానికి వెళ్లాలి ? పోలింగ్ కేంద్రంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ఓటరు జాబితాలో పేరు ఎక్కడ ఉంది ? వంటి అంశాలను సులభంగా తెలుసుకోవడం కోసం ఈసీతో కలిసి గూగుల్ పని చేయనుంది. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ సమాచారం లభిస్తుంది. కోట్ల మంది అర్హులైన ఓటర్లు...ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్దమయ్యారు. విశ్వసనీయ సమాచారాన్ని ప్రజలకే చేరేలా సులభతరం చేయడం, తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేయడానికి గూగుల్ చర్యలు చేపట్టింది. ఎన్నికల-సంబంధిత ప్రకటనల విషయంలోనూ పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రకటనకర్తలు గుర్తింపు ధృవీకరణను అందజేయాల్సి ఉంటుంది. ప్రకటనల కోసం వెచ్చించే డబ్బుకు సంబంధించిన వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఈ పారదర్శకతతో ఎన్నికల ప్రక్రియలో జవాబుదారీతనం, నమ్మకాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది గూగుల్.
ఎన్నికల సమాచారంపై ఆంక్షలు
కొన్ని రోజుల క్రితం ఏఐ జెమినిపై విమర్శల వెల్లువెత్తాయి. దీంతో గూగుల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమాచారం ఇవ్వకుండా గూగుల్ ఆంక్షలు విధించింది. ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే తప్పుడు సమాచారం, హింసను ప్రేరేపించేవి, విద్వేష వ్యాఖ్యల వంటి అంశాలపై విధానాలు రూపొందించింది గూగుల్. పాలసీకి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ను తొలగించేందుకు మనుషులతో పాటు మెషిన్ లెర్నింగ్‌ను వినియోగించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసే కంటెంట్ ను ఈజీగా గుర్తించవచ్చు. డీప్‌ఫేక్, మార్ఫింగ్ చేసిన వీడియోలు, ఫోటోలను కట్టడి చేయవచ్చు. ఏఐ ఫీచర్లతో యూట్యూబ్‌లో క్రియేట్ చేసిన కంటెంట్‌కు...లేబుల్ వేయడంలో గూగుల్ నిమగ్నమైంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో...పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటాయి. గూగుల్ చర్యలతో వీటికి అడ్డుకట్ట పడనుంది.