Viral Video: సూసైడ్ బాంబ్ ఇవ్వండి, పాకిస్తాన్ మీద ఆత్మాహుతి దాడి చేస్తా! కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
Pahalgam Terror Attack | పాకిస్తాన్‌తో యుద్ధం చేసేందుకు తాను సిద్ధమని, తనకు సూసైడ్ బాంబు ఇవ్వాలని కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలను కోరారు.

Karnataka Minister Zameer Ahmed Khan | పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత మరింత పెరుగుతోంది. పాకిస్తాన్ ఆర్మీ పహల్గాం ఉగ్రదాడి తరువాత సైతం నియంత్రణ రేఖ వద్ద, అంతర్జాతీయ సరిహద్దు వద్ద ప్రతిరోజూ కాల్పులకు తెగబడుతోంది. ఈ క్రమంలో కర్ణాటక గృహనిర్మాణ, మైనారిటీ శాఖమంత్రి బి.జెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తనకు ఆత్మాహుతి బాంబు ఇస్తే పాకిస్తాన్ పైకి యుద్ధానికి వెళ్లి పేల్చేస్తా అన్నారు. పాకిస్తాన్ తో నేరుగా యుద్ధం చేయడానికి వెళ్తానని చెప్పడంతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనకు ఆత్మాహుతి బాంబు ఇవ్వాలని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పొరుదేశం పాకిస్తాన్ ఎల్లప్పుడూ మన దేశానికి శత్రువు అని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా అనుమతిస్తే యుద్ధ భూమిలో దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నానని" అన్నారు.
— B Z Zameer Ahmed Khan (@BZZameerAhmedK) May 2, 2025
మనమందరం భారతీయులం, అందులోనూ హిందుస్థానీయులం. పాకిస్తాన్‌కు మనతో ఎలాంటి సంబంధాలు లేవు. పాకిస్తాన్ ఎల్లప్పుడూ మనల్ని శత్రువుగా చూస్తుంది. శత్రువు... మోడీ, అమిత్ షా మరియు కేంద్ర ప్రభుత్వం నన్ను అనుమతిస్తే, నేను పాకిస్తాన్‌కు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను" అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, అమిత్ షాలను తనకు సూసైడ్ బాంబు ఇవ్వాలని కోరడం సంచలనంగా మారింది.
మోదీజీ కఠిన చర్యలు తీసుకోండి..
అంతకుముందు, జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడిని జమీర్ అహ్మద్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్రదాడిని అమాయక పౌరులపై జరిగిన "హేయమైన, దారుణమైన చర్య"గా ఆయన అభివర్ణించారు. ప్రతి భారతీయుడు ఈ సమయంలో ఏకం కావాలని, దేశం కోసం నిలబడాలని.. జాతీయ భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
పహల్గాంలో ఉగ్రదాడి
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ చరిత్రలో అతిపెద్ద ఉగ్రదాడుల్లో ఒకటి జరిగింది. పహల్గాంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి పాల్పడింది తామేనని ప్రకటక చేసింది.
మొదట ఉగ్రవాదులు చెట్లు, కొండల మధ్య నుంచి వచ్చి మైదానంలో కనిపించిన టూరిస్టులను చుట్టుముట్టారు. వారందర్నీ ఒకచోట పోగు చేసి.. అనంతరం కలిమా పఠించాలని పరీక్షించారు. ఎవరైతే కలిమా పఠించలేదో వారిని, ముస్లింలు కాదనుకుంటా అంటూ తుపాకులతో అతి సమీపం నుంచి కాల్పులు జరపగా 26 మంది చనిపోయారు. కొందర్నీ కాల్చకుండా.. వెళ్లి మీ మోదీకి చెప్పుకో పో అని ఉగ్రవాదులు అనడం సంచలనం రేపింది. తమకు కాల్చమని అడిగినా, వదిలేసిన ఉగ్రదాడులు వెళ్లి మోదీకి చెప్పు అనడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.






















